Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

ఉద్యమ పరిధిని విస్తరించాడు

without comments

నిఖిలేశ్వర్‌ (Source: Andhra Jyothy, October 11, 2009).

రాజ్యం, దాని స్వభావం వాటిలో ముడివడిన మానవ ప్రవర్తన గురించి మిత్రు లు బాలగోపాల్‌ నిశితంగా పరిశీలించి రచనలు చేసిన వ్యక్తి. ప్రజాస్వామిక హక్కులు అందరికి సమన్యాయంగా వర్తించాలని, వాటి అమలులో నిరంతరం జరిగిన ఉల్లంఘనలను ఎ త్తిచూపిన మేధావి. గత నాలుగు దశాబ్దాలుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని నక్సల్‌ ఉద్యమ దశలను సన్నిహితంగా అధ్యయనం చేస్తూ-పాల్గొంటూ వచ్చిన నేను, బాలగోపాల్‌ రాజకీయ-సామాజిక విశ్లేషణలను ఆసక్తిగా చదివి చర్చించే వాణ్ణి.

‘తుపాకి పట్టుకున్న వాడికి పౌరహక్కులు’ అనే ఒక అతివాద నినాదం, 1970 దశకంలోనే పౌరహక్కుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించి సంకుచితమైపోయిన దశలో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ’ (ఓ.పి.డి.ఆర్‌) ఆచరణలోకి వచ్చింది. అతి సామాన్యుల హక్కుల నుంచి, విప్లవకారుల ప్రాథమిక హక్కుల కోసం పౌరహక్కు లను ప్రజా ఉద్యమంగా విస్తరించాలని మొదటి నుంచి నమ్మూతూ వచ్చిన వాళ్లు- ఆతర్వాత బాలగోపాల్‌ ‘మానవ హక్కుల వేదిక’ ఆచరణలో మరిన్ని ఆశా రేఖల్ని చూశారు.

నలభై సంవత్సరాల నక్సల్‌ ఉద్యమం హింసా మార్గాన్నే వ్యూహాలుగా ఎన్నుకున్నదని, రాజ్యం తీసుకునే అసమంజస నిర్ణయాలవైపు దృష్టి సారించ లేదని, ఆ దిశలో వారి ప్రయత్నం సాగలేదని చెబుతూ బాలగోపాల్‌ ఇలా వ్యాఖ్యానిస్తారు- ‘వారి వ్యూహాత్మక ఆలోచనలెప్పుడూ రాజ్యాన్ని రాజకీయంగా ఓడించే దిశగా కాకుం డా, సాయుధ పోరాట కోణంలోనే సాగుతున్నాయి. రాజకీయ ఓటములు, అసమానతలు, విధ్వంసక అభివృద్ధి వంటి విషయాలకు వారి (నక్సల్‌) అజెండాలో ఎప్పు డూ చోటివ్వలేదు.

తన జీవిత కాలంలో ఒక రాజీపడని మేధావిగా, క్రియాశీలిగా-నిరాడంబరంగా తన శక్తి యుక్తులను ఆయన సార్థకం చేసుకున్నారు. ఏనాడూ సిద్ధాంతాన్ని పిడివాదంగా కాకుండా, హేతుబద్ధంగా-యథార్థ నిర్థిష్ట పరిస్థితులకు అన్వయించి రచనలు చేశారు. సాహిత్య పరమైన చర్చలలో వారితో విభేదించిన సందర్భాలున్నాయి. అల్లం రాజయ్య ‘కొలిమంటుకున్నది’ నవలలో వాడిన తెలంగాణ మాండలికం గురించి ఒక గోష్టి దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో నా అధ్యక్షతన జరిగింది.

ఆ గోష్టిలో ప్రధాన వక్తలు బాలగోపాల్‌, జయప్రభ. జనజీవన చిత్రణలో కథనానికి వీరోచిత భాషకు సంబంధించిన అంశాలపై ఆ రోజు అసక్తికరంగా చర్చ సాగింది. వారు ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం కార్యదర్శిగా ఉన్నప్పుడు రెండు సందర్భాలలో ఆయన ఓపిడిఆర్‌కు అడగగానే వెంటవచ్చి సహాయమందించారు. కరీంనగర్‌ న్యాయవాది మిత్రులు పర్వతాలును డబ్బుకోసం నక్సల్స్‌ బెదిరించినప్పుడు, ఒక సోదర హక్కుల సంఘం పట్ల ఆయన తమ బాధ్యతను నెరవేర్చారు.

యూ.సి.సి.ఆర్‌ (యమ్‌.ఎల్‌) కార్యకర్త విజయ్‌ను పోలీసులు రహస్యంగా నిర్బంధించి, విపరీతంగా చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత మాకేమి తెలియదని బుకాయించినప్పుడు బాలగోపాల్‌ మాతో పాటువచ్చి అదనపు పోలీస్‌ కమిషనర్‌ను (ఇతర అధికారులను) సూటిగా ప్రశ్నించిన సందర్భం మరొకటి. వ్యక్తిగతంగా మితభాషి. ఎదురైనా పట్టించుకోని ఒక విధమైన అంతర్ముఖీన లక్ష ణం ఆయనది. తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేసేవాడు.

‘ప్రజాతంత్ర’ వార పత్రికల్లో ఆయన రెగ్యులర్‌ కాలమ్‌లో ప్రత్యేక తెలంగాణ వస్తే దళితులకు రాజ్యధికారం అప్పగిస్తే మార్పు ఉండవచ్చుననే అంశాన్ని నేను ఫోనులో ప్రశ్నించినపుడు ఆయన స్పష్టీకరించారు. ఆయన చివరి రచన కాబోలు ‘దొడ్డి దారిన మరో విపత్తు’ (ఈ నెల 7న ఆంధ్రజ్యోతిలో) చదివినప్పుడు ఈ దేశం క్రమంగా ఆర్థికంగా చితికిపోయే ప్రమాదాన్ని మనం అర్థం చేసుకుంటాము. వెంటనే తరిమెల నాగిరెడ్డి ‘తాకట్టులో భారతదేశం’ (నలభై ఏళ్ల క్రితం చేసిన హెచ్చరిక) గుర్తుకు వస్తుంది.

Written by chs

October 20th, 2009 at 8:27 pm

Leave a Reply