Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

మనకాలపు పరిపూర్ణ మానవుడు

without comments

అల్లం నారాయణ

నిజానికి బాలగోపాల్‌ నిరాడంబరత, సంపూర్ణ మనిషిలాగా జీవించడం గురించి, నిర్భయత్వం గురించి మాట్లాడ్తున్నాం కానీ, అవి ఆయనకు తెలుగునాట జరిగిన కీలకమైన సామాజిక పరిణామాల సందర్భంలో సహజంగా ఏర్పడినవే. ఈ సందర్భాల్లో ఆయన నిండా ఉద్యమంతో మమేకమై ఉన్నందున…. గొప్ప ఆదర్శాలుగా ముందుకొచ్చిన అంశాలను ఆవాహన చేసుకున్నవే.

చివరి ప్రసంగంలో బాలగోపాల్‌ భయం గురించి మాట్లాడారు. సమాజంలో సర్వత్రా వ్యాపించిన భయం గురించి. ఈ భయానికి కారణమైన ఇప్పుడు నెలకొని ఉన్న వాతావరణం గురించీ మాట్లాడారు. ఈ భయం వల్ల హక్కుల కోసం ప్రశ్నించేవాళ్లు, అన్యాయాన్ని అన్యా యం అని చెప్పేవాళ్లు, సులభంగా అవకాశవాదం వేపు మళ్లుతున్న దుస్థితి గురించీ ప్రస్తావించారు. ఇప్పుడాయన లేరు. వారం రోజులుగా ఒక వెలితి ఏదో కమ్ముకున్నట్టుగా ఉంది. ఎక్కడో పూరించలేని ఒక లోటు కనపడ్తున్నది.

పని రాక్షసుడిగా పేరుపడిన బాలగోపాల్‌ మళ్లీ సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ కార్మికుల బతుకులను బొందలగడ్డ చేస్తున్న ప్రాంతాల కు వెళ్లరు. అభివృద్ధి పేరిట విస్థాపన, విధ్వంసం జరుగుతు న్న ఆదివాసీల దగ్గరకూ వెళ్లరు. స్థానికుల నీటి అవసరాలు తీర్చినాకే ఇతర అవసరాలు తీర్చాలని, ప్రాణహిత పరీవాహక ప్రాంత ప్రజల వద్దకూ వెళ్లలేరు. బాలగోపాల్‌ లేని లోటు తీరదనేది ఒక నిజార్థంలోకి అవగాహన కావడం అక్కడే. చెప్పింది చేసిండు బాలగోపాల్‌. మేథకూ, కార్యాచరణకూ మధ్య ఇసుమంత తేడా రానివ్వలేదు. నమ్మింది చేసుకుంటూ పోవడం. అంతిమార్థంలో ప్రత్యామ్నాయాల ను బోధిస్తున్న మేధావులు, బుద్ధిజీవుల నుంచి ప్రజలు ఆశించే కనీస కార్యాచరణ కూడా కనపడని పాడు పరిస్థితు ల్లో, ప్రసంగాలకూ, రాతలకూ మాత్రమే మేధావులు పరిమితమవుతున్న కాలంలో బాలగోపాల్‌ పరిపూర్ణ కార్యాచరణను ఆచరించి చూపాడు. అందుకే బాలగోపాల్‌ పని అట్లా గే మిగిలిపోయింది.

బహుశా పేరుకుపోతుంది. సకల మానవ ప్రాకృతిక వనరులనూ పెట్టుబడికి అప్పగించి, ఈ పెట్టుబడుల వ్యాప్తికి, వికాసానికీ, సుస్థిరతకూ, ప్రపంచ వాణిజ్య సంస్థలు, ప్రపంచ బ్యాంకు నేపథ్యంగా, విస్తరిల్లే కార్పొరేట్ల స్వేచ్ఛకూ, సాంఘిక సంక్షేమం, బాధ్యతలు ఒక ఆటంకంగా కనబడ్తున్న కాలం. పాలకతత్వం అనేది ఈ కార్పొరేట్ల పరిరక్షణకు మాత్రమే కాదు. వీటికి మొత్తం ప్రకృ తి వనరులను దోచిపెట్టే ఒక సాధనంగా మారుతున్న కాలం ఇది. జంగల్‌మహల్‌ నుంచి, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, ఉత్తరాంధ్ర బాక్సైట్‌ గనుల దాకా భవిష్యత్తులో జరగబోయేది ఇదే. ఇదొక జీవన విధ్వంస ప్రణాళిక. సంస్కరణలు, వాటి ప్రచారం, చివరకు మూడోదశలో సంస్కరణ ల అమలు తీవ్రాతి తీవ్రంగా జరుగుతున్న కాలం ఇది.

అందువల్లే లక్షలాది ఎకరాల భూములు అభివృద్ధి పేరిట కార్పొరేట్లకు ధారాదత్తం అవుతున్న దశ్యాలు. ఎక్కడో థర్మ ల్‌ విద్యుత్‌ కోసం సింగరేణిలో విధ్వంసం చిచ్చురేగుతున్న కాలం ఇది. అభివృద్ధిలో పెట్టుబడుల కేంద్రీకరణ కోసం పోలేపల్లి ‘సెజ్‌’లు పుట్టగొడుగులై మొలుస్తున్న కాలమిది. సరిగ్గా ఇప్పుడు బాలగోపాల్‌ వీట న్నింటినీ పట్టించుకొనే హక్కుల ఉద్యమ నేత అర్ధంతరంగా అందరినీ విడిచివెళ్ల డం ఒకలోటు. ముప్పదేండ్లుగా ఆయనతో ఉన్నవాళ్లకి, నడిచిన వాళ్లకీ, ఇప్పుడిప్పుడే నడుస్తున్న వాళ్లకు మాత్రమే కాదు. బెల్లంపల్లి, మందమర్రిల్లో ఉన్న భూములు కోల్పోయిన రాజపోశవ్వల దీనగాథను వినడమే కాదు.

ఈ దీనగాథల మూలమేమి టో? వాటిని ఇప్పుడు అంతకు ముందుకన్నా ఎక్కువ ఎందుకు పట్టించుకోవాలో? చెప్పేవారు లేరు. అది వెలితి. బంగ్లాదేశ్‌లో ఒక విచిత్రం జరిగింది. ఒక మావోయిస్టు విప్లవకారుణ్ణి కాల్చిచంపిన పోలీసులే ఆ తర్వాత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. బహుశా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి రోశయ్య నుంచి కేసీఆర్‌ దాకా ప్రధాన స్రవంతి నేతలు బాలగోపాల్‌ గురించి స్పందించా రు. సరే, ఆయనొక ఉత్తమ మానవుడుగా, నిరాడంబరుడు గా, పని రాక్షసుడిగా, పనిచేస్తూ, ప్రజల్లో ఉంటూ బతికినందుకు మాత్రమే వాళ్లు నివాళులర్పించవచ్చు.

నిజానికి ఇవ్వాల్టి విధ్వంసానికి మధ్యవర్తులుగా ఉన్న వాళ్లే విధ్వంసాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బాలగోపాల్‌కు నివాళులర్పించే అవసరమూ రావొచ్చు. బాలగోపాల్‌ మీద బతికున్నంత కాలం తీవ్ర వ్యతిరేకతలో ఉన్న పోలీసు అధికారులూ ఆయన వ్యక్తిత్వం ముందు తలవంచాల్సిన పరిస్థితి కూడా వచ్చి ఉండవచ్చు. కానీ, ఇదొక్కటేనా? బాలగోపాల్‌ అంటే కేవలం మానవహక్కుల ఉద్యమాన్ని విస్తృత పరిచిన వాడేనా? కాదు. నిజానికి బాలగోపాల్‌ అరుదైన మేధావి.

ఆయన ఖాళీలు పూరించకుండానే నిష్క్రమించడం ఇక్కడ మరొక లోటు. బలమైన రాజకీయార్థిక శక్తులకు, రాజ్యానికి జీవితమంతా వ్యతిరేకంగా నిలబడిన బాలగోపాల్‌ కార్యాచరణంతా మార్క్సిస్టు మూల సూత్రాల ఆధారంగా జరిగినట్టే అనిపిస్తుంది. కానీ పందొమ్మిది సంవత్సరా ల క్రితమే ఆయన మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం పట్ల అసంతృప్తి ప్రకటించారు. కానీ ఈ పందొమ్మిదేళ్లూ ఆయన ఖాళీగా లేరు. కార్యాచరణలో ఉన్నారు. ఈ ప్రపంచానికి ఆయన ఆలోచించిన ప్రత్యామ్నాయాన్ని కానీ ఆయనే చెప్పుకున్నట్టు 2001లో ఒక కొలిక్కివచ్చిన తన తాత్విక అన్వేషణను కానీ ప్రపంచానికి వెల్లడించలేదు. హరగోపాల్‌ రాసిన సార్వత్రిక నైతిక విలువల గురించి కూడా ఆయన సూత్రబద్ధంగా చేసిన బౌద్ధిక కృషీ లేదు.

నిజానికి బాలగోపాల్‌ ఈ పని, పని పని అనే స్థితిలో పడి ఈ కృషి కొనసాగించడానికి, ఇష్టపడలేదా? మరేదైనా కారణమా? తెలియదు కానీ… ఇది బహుశా ఆయన జీవిత కాలపు ఖాళీ కావొచ్చు. జీవితాన్వేషణలో ఆగిపోవడం గురించి, మానవ ప్రవృత్తి గురించి ఆయన లోతుగా ఆ తర్వాత ఏమీ రాయలేదు. బహుశా ఇదొక ఖాళీ. నిజానికి బాలగోపాల్‌ నిరాడంబరత, సంపూర్ణ మనిషిలాగా జీవించ డం గురించి, నిర్భయత్వం గురించి మాట్లాడ్తున్నాం కానీ, అవి ఆయనకు తెలుగునాట జరిగిన కీలకమైన సామాజిక పరిణామాల సందర్భంలో సహజంగా ఏర్పడినవే. ఈ సందర్భాల్లో ఆయన నిండా ఉద్యమంతో మమేకమై ఉన్నందున…. గొప్ప ఆదర్శాలుగా ముందుకొచ్చిన అంశాలను ఆవాహన చేసుకున్నవే.

అందుకే ఆయన లక్షణాలన్నీ సహజ స్వభావంగా కనపడేవి.. ఉద్వేగాలతో పనులు జరగవు అన్నది బాలగోపాల్‌ నేనొక సందర్భంలో ఉద్వేగంగా మాట్లాడిన వేదిక మీద అన్న మాటలు. ఆయన ఉద్వేగాల కు అతీతంగా జీవించారు. అన్నెందుకు? ప్రామాణిక జీవన విధానాన్ని ఎంచుకున్న పరిపూర్ణ మానవుడు బాలగోపాల్‌. వసంతను నేను పలకరించిన ప్రతి సారీ.. ఒక ప్రశ్న వేసే వాడిని.. బీజీ ఉన్నాడా…. ఉంటే రెండో ప్రశ్న. బాగున్నా డా.. బీజీ లేడు… ఉండరు…. మరిరాడు… ప్రజల పక్ష మేధావి ఆదివాసీల ఆరోగ్యం గురించి మాట్లాడిన బాలగోపాల్‌ తన ఆరోగ్యం పట్టించుకోకపోవడం బహుశా ఆయనతో పాటు ఉన ్న అందరికీ జీవిత కాలం తీరని వెలితిని ఏర్పరిచింది. ఆ వెలితి పూడ్చరానిది.

Written by chs

October 23rd, 2009 at 5:21 am

Leave a Reply