| ఆదివాసీల ఆత్మబంధువు బాలగోపాల్ ఇకలేరనే వార్త, ఆదివాసీ క్షేత్రాల్లో చీకటినినింపింది. దోపిడీ, హింస, దౌర్జన్యాలను నిరంతరం మౌనంగా భరించే ఆది వాసీలకు డాIIకె.బాలగోపాల్ కొండంత అండగా నిలిచిన వ్యక్తి. ఆనాటి నుండీ ఈనాటిదాకా చాలామంది అర్థం చేసు కోలేకపోతున్న ఒక విషయంమేమిటంటే పర్యావరణ సమతుల్యానికి కావలసింది అడవులుకాదు, చెట్లు. అంటే అటవీశాఖ యాజ మాన్యంలోని భూమిని కబ్జాదార్ల నుంచి, పోడు వ్యవసాయం చేసే ఆదివాసుల నుండి కాపాడి వనాలు పెంచటమే దానికి ఏకైక పరిష్కారమార్గంకాదు.
రెవిన్యూభూమిలో పంట చేలబదులు చెట్లు పెంచడాన్ని ప్రోత్సహించడమూ అదే ఫలితాన్ని ఇస్తుంది. కానీ పర్యావరణం కోసం ఆదివాసులు మాత్రమే ఎందుకు త్యాగాలు చేయాలి? మనమంతా ఎందుకు చేయకూడదు? ఎవరిదీ అడవి? అని ప్రశ్నించే బాలగోపాల్ ఆదివాసీల అటవీ హక్కుల ఉద్యమానికి ఒక పెద్ద దిక్కుగా నిలిచాడు. ఆదివాసీల జీవనాన్ని ఛిద్రం చేస్తున్న పోలవరం ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించడం సరైన ప్రజాస్వామిక వైఖరని విస్పష్టంగా చెప్పగలిగే బాలగోపాల్ ఇకలేకపోవడం ఆదివాసీలకు ఎవరూ పూడ్చలేని లోటు.
గిరిపుత్రులకు అండగా
భూమి కేసులలో నిస్సహాయ గిరిపుత్రులకు అండగా నిలిచి వారి తరపున ఉన్నత న్యాయ స్థానాలలో వాదించి కొన్నివేల ఎకరాల భూమి రాబట్టేందుకు ఆయన కారణమయ్యాడు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ఏజెన్సీలలో గిరిజనుల సాగుభూములకు చట్టబద్దత తీసుకురావ డానికి ఆయన ప్రమేయంతో వచ్చిన హైకోర్టుతీర్పులు ఆదివాసీ భూమి ఉద్యమానికి ఎంతగానో సహకరించాయి. కనీసం కొన్ని న్యాయ పోరాట ఫలితాలనైనా ఇక్కడ ఉదహరిస్తే ఉచితంగా ఉంటుంది.దేవీపట్నం మండలం నేలకోట గిరిజనులు భూమి హక్కు కోసం ఉద్యమిస్తున్న రోజులవి.సుమారు అది 130 ఎకరాలు గిరిజన, గిరిజనేతరుల భూమి వివాదం. గిరిజనులు భూములపై గతంలో గిరిజనేతర్లు అక్రమంగా సెటిల్‌మెంట్ పట్టాలు సంపాదించారు. అయితే భూమిసాగు ఉద్యమం నేపథ్యంలో గిరిజనులు పోగొట్టుకున్న భూములను తిరిగి కైవసం చేసుకున్నారు. గిరిజనేతర్లు తమ పట్టాల ఆధారంగా గిరిజనులను తొలగించాలని చూసారు.
అందులో భాగంగా అవాస్తవాలతో రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసి వారికి అనుకూలంగా ఉత్తర్వులు కూడా పొందారు. ఆ ఉత్తర్వుల అమలు చేయాలంటూ జిల్లా అధికారులపై ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. గిరిజనులను భూముల నుంచి తొలగించడానికి అధికార యంత్రాంగం సమాయత్తమయింది. గిరిజనుల సాగుహక్కును పరిరక్షించాలంటూ బాలగోపాల్ గిరిజనుల తరపున రాష్ట్ర హైకోర్టులో రిట్ దాఖలు చేసారు.గిరిజనుల సాగు భూముల విషయంలో గిరిజనేతర్ల జోక్యం నివారించాల్సిందిగా అప్పటి జిల్లా ఎస్‌పిని ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొందడంలో బాలగోపాల్ సఫలీకృతులయ్యారు. ఆ కేసు విచారణ ముగిస్తూ గిరిజనేతరుల హక్కులను ధృవీకరించ కుండా సివిల్ కోర్టులలో వివాదాలు పరిష్కరించుకోవాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో నేలకోట గిరిజనులు తమ భూమి హక్కును కాపాడుకోగలిగారు.
తప్పుడు కేసుల బనాయింపు
బాలగోపాల్ చేసిన వాదనలు పలు కేసులలో గిరిజనుల అను కూల న్యాయసూత్రాల సిద్ధాంతీకరణకు ఉపకరించాయి. తమ పేర భూమి పట్టాలు ఉన్నాయని దౌర్జన్యంగా గిరిజనులు భూములు ఆక్రమించి సాగుచేసుకుంటున్నారనీ పశ్చిమ ఏజెన్సీలో గిరిజనేతర్లు కొన్ని ఏండ్లుగా భూమి సంఘర్షణలు లేవనెత్తుతున్నారు. గిరిజనేత రులకు అనుకూలంగా ఏజెన్సీమండల రెవిన్యూ అధికార్లు పోలీసు లను ఆదేశిస్తూ భూమి రక్షణ ఉత్తర్వులు ఇవ్వడం సర్వసాధారణ మైన విషయం. పోలీసులు ఆ ఉత్తర్వులు ఆధారంగా గిరిజనులను భూముల నుంచి తొలగించే చర్యలలో భాగంగా తప్పుడు కేసులు బనాయిస్తూ వచ్చారు.
అయితే గిరిజనేతర్లకు అనుకూలంగా ఇస్తున్న భూమి రక్షణ ఉత్తర్వులు జారీచేసే ఎమ్మార్వో అధికారాన్ని పోలవరం మండలం ఇటుకలకోట గిరిజన భూమి వివాద హైకోర్టు కేసులో బాలగోపాల్ ప్రశ్నించారు. రాష్ట్ర హైకోర్టు విచారణ అనం తరం భూరక్షణ ఉత్తర్వులు జారీ చేస్తున్న ఎమ్మార్వో అధికారాన్ని ఏ శాసనంకింద ఇవ్వబడిందో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రభుత్వం కోర్టుకి సమాధానం ఇవ్వలేకపోయింది. భూమి తగాదాలలో ఎమ్మార్వోల, పోలీసుల జోక్యాన్ని నివారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివాసీలకు తమ సాగులో ఉన్న కొన్ని వేల ఎకరాల భూములను కాపాడుకోవడానికి హైకోర్టు తీర్పు ఉపకరించింది.
భూమి హక్కుల విషయంలో జాగ్రత్తలు
1/70 గిరిజన భూమిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా ఓటు బ్యాంకే పరమావధిగా భావిస్తూ వస్తున్న ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతర్ల స్థిరనివాసానికి అనుకూలంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్డు ప్రాంతాలలో గిరిజనేతర్ల జనాభా పెరుగుదల ఆదివాసీల ఉనికికే ప్రమాదమని భావించిన బాలగోపాల్ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం హైకోర్టులో దాఖలు చేసి ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అదే విధంగా 1/70 నిబంధనలకు భిన్నంగా గిరిజనేతర్ల ఏజెన్సీ ప్రాంత భూమి కొనుగోళ్ళును ప్రశ్నిస్తూ ప్రజాప్రయోజనాల కేసును బాలగోపాల్ వాదించారు. రంపచోడవరం ఏజెన్సీలో 1400 ఎకరాల భూమికి సంబంధించిన గిరిజనేతర్ల క్రయవిక్రయాలను బాలగోపాల్ ప్రశ్నించారు. హైకోర్టు విచారణ అనంతరం ఇచ్చిన తీర్పు గిరిజను లకు ఆ భూమి దక్కడానికి సహకరించింది.
1/70 నిబంధనలకు విరుద్ధంగా పాడేరు ఆర్‌టిసి కాంప్లెక్స్‌లో గిరిజనేతరుల వ్యాపా రానికి అనుకూలంగా తీసుకున్న ప్రభుత్వం నిర్ణయాన్ని నిలుపుదల చేయిస్తూ హైకోర్టునుంచి ఉత్తర్వులు బాలగోపాల్ తీసుకురాగలిగారు. అలాగే గిరిజనేతర్లకు ఉపయోగపడే విధంగా రంపచోడవరంలో హెచ్‌పిసిఎల్ పెట్రోల్‌బంక్‌లను ఏర్పర్చడానికి జరిగిన ప్రయత్నా లను రాష్ట్ర హైకోర్టు ప్రమేయంతో ఆయన నిలువరించ గలిగారు. విచారణ పూర్తి అయి తీర్పు ఇవ్వబడిన కేసు మరొకసారి విచారణ చేపట్టడానికి వీలులేదని చెప్పే ‘రెస్‌జ్యూడికేటా న్యాయసూత్రాన్ని గిరిజన భూమికేసులలో మినహాయింపు ఉండాలని రాష్ట్ర హైకో ర్టులో గిరిజనుల తరపున వాదనలు బాలగోపాల్ వినిపించారు. రెస్‌జ్యూడికేటాసూత్రాన్ని యథావిథిగా కోర్టులు అమలుచేయ రాదని అలా అమలుచేస్తే గిరిజనుల భూ పరిరక్షణ చట్టాలు అమలు స్పూర్తి దెబ్బతీస్తాయని హైకోర్టుతీర్పులో స్పష్టం చేసింది.
రాష్ట్ర ఏజెన్సీ నియమాలకు భిన్నంగా ఏజెన్సీ ప్రాంత సివిల్ కేసుల విచారణ చేసే అధికారం మైదాన ప్రాంత కోర్టులకు లేదనే అంశాన్ని బాలగోపాల్ రాష్ట్ర హైకోర్టులో లేవనెత్తారు. బాలగోపాల్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు గిరిజనులకు అందుబాటులో ఉన్న ఏజెన్సీ న్యాయ వ్యవస్థకే సివిల్ కేసులు విచారణ చేసే అధికారం ఉందని మైదాన ప్రాంత జ్యూడీషియల్ కోర్టులకు లేదని తేల్చి చెప్పిన రాష్ట్ర హైకోర్టు తీర్పు గిరిజనులకు ఊరట కలిగించింది. ఆ తీర్పు ఆధారంగానే దేవీపట్నం మండలం మంటూరు ఎస్టేట్‌లో గల ఆరు గ్రామాల, భూములు, అటవీ ప్రాంతంతో సహా అప్పగించాలని రాజమండ్రి జిల్లా కోర్టులో జమీందారు దాఖలు చేసిన డిక్రీ అమలు పిటీషన్ విచారణ చట్టబద్దతను రాష్ట్ర హైకోర్టులో గిరిజనుల తరపు కేసు దాఖలు చేసి బాలగోపాల్ ప్రశ్నించగలిగారు. ఆ కేసులో రాష్ట్ర హైకోర్టు ఇటీవల జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులవల్ల సుమారు 4వేల ఎకరాల భూమిని గిరిజనులు నిలబెట్టుకోగలిగారు.
ఆదివాసీల విషయంలో జరుగుతున్న రాజ్యహింసను కోర్టు లోపలా, బయటా కూడా బాలగోపాల్ ప్రశ్నిస్తూ వచ్చారు. ఛత్తీస్ గఢ్ నుంచి ఖమ్మం ఏజెన్సీకి వలస వచ్చి అటవీక్షేత్రాల్లో ఆవాసాలు ఏర్పర్చుకొని జీవిస్తున్న గొత్తికోయల గుడిసెలు అటవీ అధికారులు తగులబెట్టి తరిమివేయడానికి ప్రయత్నించిన సంఘటనలపై నిజనిర్ధారణచేసి ప్రభుత్వ దుశ్చర్యలను ఎండ గట్టారు. భద్రాచలం మండలం రామచంద్రాపురం అటవీ ప్రాంతా లలో నిరాశ్రయులైన గిరిజనుల తరపున హైకోర్టులో కేసులు దాఖలు చేసి వారి ఆవాస ప్రాంతాల నుంచి అటవీశాఖ సిబ్బంది తొలగించకుండా బాలగోపాల్ ఉత్తర్వులు పొందడంతో గిరిజనులు ఊపిరిపీల్చుకున్నారు.
అదేరీతిలో చాలా కేసులలో వలస గిరిజనులైన కోందు, గొత్తికోయల ఆవాసహక్కు జీవించే హక్కును కాపాడ గలిగారు. దండకారణ్య, నల్లమల అడవులలో నక్సలైట్ల కార్య కలాపాల అణచివేత పేరిట పోలీసులు అవలంబించిన ఆదివాసీ వ్యతిరేక విధానాలను బాలగోపాల్ అనేక పద్ధతులద్వారా నిల దీసారు. ఆదివాసీలను నక్సలైట్ల సానుభూతిపరులుగా ఆరోపిస్తూ బనాయించిన అనేక పోలీసు కేసులు సంఘటనలపై నిజనిర్థారణచేసి పోలీసుల హింసాత్మకచర్యలు బాలగోపాల్ బట్టబయలు చేసారు.
సల్వాజుడుంకు వ్యతిరేకత
చత్తీస్‌గఢ్‌లో మహేంద్రకర్మ నేతృత్వంలో ప్రభుత్వ సహకారంతో సల్వాజుడుం వంటి ప్రైవేటు సైన్యం తరహాలను ప్రత్యేకంగా గిరిజనులతో బెటాలియన్ ఏర్పాటు చేయాలని 2006లో ప్రభుత్వం తలపెట్టినప్పుడు అటువంటి బెటాలియన్ గిరిజన ప్రాంతాలలో అశాంతి, ప్రజల హక్కుల అణచివేతకు, అభివృద్ధి పేరుతో హింసా త్మక చర్యలకు పాల్పడటానికి సహకరిస్తుందని బాలగోపాల్ గట్టిగా వ్యతిరేకించారు. అలాగే వాకపల్లి ఆదివాసీ మహిళలపై జరిపిన పోలీసుల అత్యాచారాన్ని, గిరిజన మహిళలపై జరుగుతున్న అనేక అత్యాచార సంఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ఆదివాసీల అరణ్య రోదనను బాహ్య ప్రపంచానికి గట్టిగా వినపడేలా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.
షెడ్యూల్డు ప్రాంతాల్లో ఉపాధ్యాయుల పోస్టులను గిరిజనులతో భర్తీ చేయాలని సూచించే ప్రభుత్వ జిఓ నెంబరు 3కు మద్దతుగా రాష్ట్ర హైకోర్టులో బాలగోపాల్ తన వాదనను వినిపించారు. జిఓ నెంబరు 3 రాజ్యాంగబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటీషన్ విచారణలో గిరిజనులకు అనుకూలంగా 2002లో ఇచ్చిన హైకోర్టు ఫుల్‌బెంచ్ తీర్పుకు ఆయన కారకులయ్యారు.ఏజెన్సీప్రాంతాలలో వైద్యసహాయం అందక మృత్యువాత పడుతున్న గిరిజన గ్రామాలలో పర్యటించి నిజనిర్ధారణ చేసి గిరిజన వైద్యంపట్ల ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్య వైఖరిని తూర్పారబట్టారు. రాష్ట్ర ఏజెన్సీలో అనారోగ్యంతో మృత్యువాత పడుతున్న గిరిజనులు విషయంలో ప్రజాప్రయోజనాల కేసు దాఖలు చేసి ప్రభుత్వ లోపభూయిష్ఠ వైద్య విధానాలను రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకువచ్చి వైద్య సదుపాయం అందేటట్టు ప్రభుత్వానికి ఆదేశిక ఉత్తర్వులు జారీ చేసేలా శ్రద్ధ తీసుకున్న బాలగోపాల్ న్యాయ చర్యలు గిరిజనుల వైద్యవిషయంలో మార్గ దర్శకంగా ఉన్నాయి. రోగి దగ్గరకు వైద్యం అనే సూత్రాన్ని గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వం అమలు చేయాలని ఆయన గట్టిగా ప్రచారం చేసారు.
ఆదివాసీల స్వయం పాలనకు ఉపకరించే షెడ్యూల్డు ప్రాంత చట్టాన్ని (పెసా) అమలు చేయించుకునే క్రమంలో గిరిజన ప్రయోజనాలకు సంబంధించిన అనేక కేసులను రాష్ట్ర హైకోర్టులో బాలగోపాల్ దాఖలు చేసారు. అభివృద్ధి పేరుతో షెడ్యూల్డు ప్రాంత భద్రాచలం పట్టణాన్ని టౌన్‌షిప్‌గా మార్చి ఆదివాసీల స్వపరిపాలనకు విరుద్దంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ప్రమేయంతో నిలుపుదల చేయించారు. పెసా చట్టాన్ని అతిక్రమించి గ్రామ సభల అనుమతి లేకుండా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రాజెక్టుల కింద చేపట్టిన భూమిసేకరణ, పునరావాస పథకాల అమలు చెల్లుబాటును రాష్ట్ర హైకోర్టులో బాలగోపాల్ సవాల్ చేసారు. కొన్ని కేసులలో గిరిజనులకు అనుకూలంగా పోలవరం ప్రాజెక్టు భూసేకరణను నిలుపుదల చేయించగలిగారు.
సమస్యల ప్రచారమే ముఖ్యం
అయితే కోర్టులే ప్రజల హక్కుల సమస్యలకు సంపూర్ణ పరిష్కారంగా బాలగోపాల్ ఏనాడూ చూడలేదు. ప్రజాహక్కుల ఉద్యమాల నిర్మాణంతో పాటు న్యాయస్థానాలను కూడా వీలున్న పరిస్థితులలో ఒక సాధనంగా మాత్రమే వాడుకునేందుకు ఆయన ప్రయత్నం చేసారు.అందుకే ఆదివాసీ హక్కుల చైతన్యానికి, ఆదివాసీల సమస్యలపై ప్రచారానికి బాలగోపాల్ ఎక్కువ మక్కువ చూపారు. అందుకే ఆదివాసీ హక్కుల చైతన్యానికి, ఆదివాసీల సమస్యలపై ప్రచారానికి బాలగోపాల్ ఎక్కువ కృషి సల్పారు. శ్రీకాకుళం మొదలు ఆదిలాబాద్ వరకూ ఆయన అనేక గిరిజన గ్రామాలలో నిర్వహించిన సమావేశాలకు హాజరై గిరిజనులకు హక్కుల పరిభాష నేర్పారు.
ఆదివాసీల వ్యతిరేక ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ప్రచార కార్యాచరణలో భాగంగా జరిగిన అనేక ర్యాలీ, ధర్నాలలో పాల్గొని గిరిజనులకు అనుకూల ప్రసంగాలు చేసారు. 1/70 భూమి నిబంధనల రద్దు వ్యతిరేక ప్రభుత్వ చర్యలు మొదలు పోలవరం, బాక్సైట్, ప్రపంచ బ్యాంకు అటవీ ప్రాజెక్టుల వల్ల నిర్వాసిత సమస్యలకు వ్యతిరేకంగా అలాగే గిరిజనుల అనుకూల చట్టాలు అమలు చేయించుకునే ఉద్యమాల వరకూ అన్నిటిలోనూ బాలగోపాల్ గిరిజనులకు మద్దతు పలికారు.
అభివృద్ధి పేరుతో ఆదివాసీల విధ్వంసక ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ అనేక వ్యాసాలు రాయటంతోపాటు ప్రత్యక్షంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొని ఆదివాసీ ఉద్యమ కార్యకర్తలకు ఉత్తేజాన్ని కలిగించారు. ఆదివాసీల ఉనికిని దెబ్బతీసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, ప్రైవేటు భాగస్వామ్యంతో బాక్సైట్ ఖనిజాల కోసం ఆదివాసీ గుండెల్లో గునపాలు గుచ్చుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఉద్యమింపచేసారు.
బాలగోపాల్ ఆశయాలు, ఆలోచనలు, ఆచరణలు కొనియాడటం సులభమే. కాని అతనిలా నిబద్ధతతో విలువలతో కూడిన సంపూర్ణ మైన మనిషిగా మారటం ప్రపంచీకరణ యుగంలో అంత తేలికేమీకాదు. పదిహేనేండ్లుగా ఆదివాసీ హక్కుల కార్యాచరణలో భాగంగా తనతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. బాలగోపాల్ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆదివాసీ హక్కుల కోసం కృషి చేస్తున్న కార్యకర్తలు తమ కార్యాచరణను బాలగోపాల్ ఆకాంక్షలకు అనుగుణంగా సరిదిద్దుకోవడమే నిజమైన నివాళిగా భావిస్తున్నాను. |