ఈ కాలపు గాంధీ
- వెల్చాల కొండలరావు
(వ్యాసకర్త తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు, Source: Andhra Jyothy, October 27, 2009).
అరుదైన మనీషి, చాలా అరుదైన మేధావి బాలగోపాల్. అటువంటి వ్యక్తి ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతి చెందని వారు, దుఃఖితులు కాని వారు ఎవరైనా ఉంటారా? మానవహక్కులకు పర్యాయపదం బాలగోపాల్. అన్ని హక్కులు మానవహక్కులలోనే సమ్మిళితమై ఉన్నాయని గ్రహించి వాటిని సాధించడానికే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఉద్యమాలు విజయవంతం కావాలంటే, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలంటే ప్రజలకు వారి హక్కుల గురించి క్షుణ్ణంగా తెలియజేయాలి. ‘ప్రతి పౌరుడికి హక్కుల గురించి తెలిస్తే వారే వారి హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తారని’ బాలగోపాల్ విశ్వసించారు.
ప్రజల్లో అటువంటి చైతన్యం ఉన్నప్పుడు పరిపాలకులు సక్రమ పాలన నందిస్తారు. బాలగోపాల్‌ను నేను ఈ కాలపు ‘గాంధీ’ అంటాను. మహాత్మునిలాగే ఆయనా ఎంతో నిరాడంబరంగా జీవించారు. ఆయన గాంధేయవాది కాకపోవచ్చు. అయితే మానవహక్కుల కోసం శాంతియుతంగా పోరాడడం గాంధీ ఇజం కాక మరేమవుతుంది? ప్రజల హక్కుల కొరకు పోరాడిన వాడు, వాటిని సాధించిన వాడు మరొక గాంధీ కాక మరేమవుతాడు? మొదట ఆయన ఏ విధానం వైపు మొగ్గినా అంతిమం గా మానవతావాది, మావహక్కుల వాది అయ్యాడు.
ఈ కారణంగానే బాలగోపాల్‌ను గాంధీ అంతటివాడని అంటున్నాను. శాంతి కావాలంటే మానవహక్కులు పరిరక్షించబడాలని దృఢంగా విశ్వసించి వాటికోసం వాదించాడు, వాటిని శాంతియుతంగా పోరాడి సాధించాడు. బాలగోపాల్ ప్రధానంగా చేసిన పని తోటి మానవులను చైతన్యవంతులను చేసి ప్రతి పౌరుణ్ణి అతని హక్కులు అతడే సాధించుకునేట్లు సాధికారత కలిగించడం.
బాలగోపాల్ ఉత్తమ శ్రేణికి చెందిన సాహిత్యవేత్తకూడా. ‘సాహిత్యాన్ని కేవలం ఉద్యమ నేపథ్యంలో చర్చించడం పొరపాటు, ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే, సాహిత్యం దాని కి పరిమితం కాదు, అది జీవితమంత విస్తృతమైంది’ అని అన్నవాడు ఎంత గొప్ప సాహిత్యవేత్తయితే అలా అనగలడు? ‘సాహిత్యంలో సాహిత్య కార్యక్షేత్రమైన మాన వ అస్తిత్వ నైజంలోని అన్ని రకాల సందిగ్ధాలూ తీవ్ర పరిణామం చెందుతాయి’ అంటాడు బాలగోపాల్.
ఆయనకు అన్ని సాహిత్య నేపథ్యాలూ తెలుసు. కాని ఆయ న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాహిత్య, చారిత్రక నేపథ్యాలను వేరు వేరుగా చూడలేదు. సమగ్ర దృష్టి కలవాడు కనుక వాటిని ఒకటితో ఒకటి సంబంధమున్న వాటిగా, ఒకటిపై ఒకటి ఆధారపడినవాటిగా చూశాడు. అతడు దేన్ని కూడా ఒకే ఒక కోణం ఒకే ఒక పార్శ్వం నుంచి చూడని, చూడదలచుకోనివాడు. బాలగోపాల్ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ప్రధానంగా నాలుగు పాత్రలు నిర్వహించాడని అర్థమవుతుంది. అవి: బోధనా పాత్ర, సాహిత్య పాత్ర, న్యాయవాద పాత్ర, రాజకీయ పాత్ర. కాకతీయ విశ్వవిద్యాలయంలో కొన్నాళ్ళు ఆచార్యుడుగా ఉన్నారు.
దాన్నే ‘జన చైతన్యా’నికి చెందిన పాత్రగా ఆఖరు వరకు కొనసాగించాడు. తన సాహిత్య పాత్రను ఆచార్య పాత్రకు అనుబంధంగా నిర్వహించారు. సాహిత్యాన్ని సాహి త్యం కొరకే కాక ‘మానవీయ హక్కుల’ ప్రచా రం కోసం ఉపయోగించుకున్నారు. ఆయన తన సాహిత్య అవగాహనను మానవీయ హక్కులకు మాత్రమే మలచుకున్నాడు సాహి త్యం ప్రధానంగా ‘మానవీయత’కు చెందింద ని, తద్వారా ‘మానవీయ విలువల’కు చెందిందని ఆయన భావించారు. అలాగే న్యాయవాద వృత్తిని మానవ హక్కులను సాధించడానికి సాధనంగా చేసుకున్నా డు.
తన రాజకీయ అనుభవం కూడా జోడించారు. దానిని శాసనపరంగా శాంతియుతంగా మాత్రమే ఉపదేశించుటకు వాడాడు. అలా ఒక పాత్రను ఇంకొక పాత్ర కు సమన్వయంగా, సమర్థనీయంగా ఉండేట్లు చేసికొని ప్రజాసేవా పాత్ర నిర్వహించాడు. ఉద్యమాలు విజయవంతంగా సాగాలంటే ఒకే ఒక పద్ధతి సరిపోదు. వాటి కొరకు అన్ని పద్ధతులలో, అన్ని దిశల నుంచి పోరాడాలి. అప్పుడు కాని అవి శక్తిమంతంకావు. ఆ శక్తి తెలిసిన, దానితో పాటు దానికి తగిన యుక్తి తెలిసిన వివేకి బాలగోపాల్. ఆయన కేవలం సిద్ధాంతకర్తే కాదు, ఎంతో కార్యదీక్షత కలవాడు.
ఏ పార్టీకైనా అలాంటి నాయకులు కావాలి. మహాత్ముని మాదిరిగానే బాలగోపాల్ కూడా శక్తి యుక్తి రెండూ తెలిసిన వాడు. మన రాజకీయ నాయకులకు చాలా మందికి శక్తి తెలుసుకాని యుక్తి తెలియదు. నీతి నిజాయితీల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. అలాంటప్పుడు వారు బాలగోపాల్ పొందిన లాంటి ప్రజాదరణ ఎలా పొందగలరు? బాలగోపాల్ జీవితం నుంచి మన రాజకీయ వేత్తలు, సామాజిక ఉద్యమాల నేతలు నేర్చుకోవలసిన గొప్ప పాఠం నాయకుడనేవాడు ఒకే పాత్ర కాదు నాలుగు పాత్రలు నిర్వహించవలసి ఉంటుందనునది.
బాలగోపాల్ పట్ల మనం నిర్వహించవలసిన కొన్ని కర్తవ్యాలు పేర్కొంటాను. ఆయన పేరిట ఒక పరిశోధనాపరమైన ఉన్నత గ్రంథాలయం స్థాపించి వారి విచారధారను అధిక సంఖ్యాకులకు అందించడం; ఆయన పేరిట వివిధ విశ్వవిద్యాలయాల్లో ఏటా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులచే స్మారకోపన్యాపాలు ఇప్పించ డం; ఆయన రాసిన వ్యాసాలన్నింటినీ ఒకచోటికి చేర్చి ప్రచురించడం; అవి తెలుగు లో మాత్రమే ఉంటే వాటిని ఇంగ్లీషులోకి అనువదింపజేసి ప్రపంచానికి అందించ డం; మానవ హక్కులను అన్ని విద్యా స్థాయిల్లో అన్ని విద్యాలయాలలో పాఠ్యాంశాలుగా నిర్దేశించడం. బాలగోపాల్ మన సంస్కృతిలో ఒక భాగం. మనకు ఒక గర్వకారణం. అలాంటప్పుడు మనం గాంధీలాంటి వారిని, లోహియా లాంటివారి ని, బాలగోపాల్ లాంటి వారిని ఎలా మరచిపోగలం కృతఘ్నలమయితే తప్ప?