Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

ఉద్యమాలకూ విలువలుండాలన్నవాడు

without comments

ఎం కోదండరామ్‌  (Source: Vaartha,  సొమ వారం, అక్టోబర్ 19, 2009)

డా.కె బాలగోపాల్‌కు 1980లో పౌరహక్కుల సంఘంలో చేరినప్పటి నుంచి 2009 అక్టోబర్‌ 8న మరణించే వరకు పౌరహక్కుల ఉద్యమం వెలుపల వేరొక జీవితం లేదు. ఏకాగ్రతతో తన శక్తియుక్తులన్నింటిని ఆయన పేద, అణచి వేయబడిన వర్గాలహక్కుల సాధనకే ఉపయో గించారు. అందుకే బాలగోపాల్‌ జీవితం అర్ధం చేసుకోవాలంటే హక్కుల రంగంలో ఆయన చేసిన కృషిని తెలుసుకోవాలి.

1980లో బాలగోపాల్‌ పౌరహక్కుల ఉద్యమం వైపు ఆకర్షితుడు కావడానికి వరంగల్‌ వాతావరణమే దోహదపడింది. తిరుపతిలో డిగ్రీ పూర్తి చేసుకొని ఎంఎస్సీ చదవడానికి బాలగోపాల్‌ వరంగల్‌, రీజనల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరారు. ఆ తర్వాత అక్కడనే పిహెచ్‌డి కూడా పూర్తి చేశారు.వరంగల్‌ వచ్చే వరకు ఆయన లెక్కల మేధావి. వరంగల్‌ రాజకీయ పరిస్థితులు ఆయనను హక్కుల బాలగోపాల్‌గా మార్చివేసాయి.బాలగోపాల్‌ రీజనల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో (ఆర్‌ఇసి) చదువుతున్న కాలానికి రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఏర్పడింది. ఆర్‌సిలో సూరపనేని జనార్ధన్‌ నాయకత్వంలో ఆ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. కేవలం విద్యార్థులనే కాక మెస్‌ వర్కర్లను, ఆర్‌ఇసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలను సూరపనేని సంఘటిత పర్చారు. ఎమర్జెన్సీ విధించిన తరువాత సూరపనేనిని పోలీసులు అరెస్ట్‌ చేసి గిరాయిపల్లి ఎన్‌కౌంటర్లో కాల్చి చంపారు.

రాడిక్‌ స్టూడెంట్స్‌్‌ యూనియన్‌ కార్యకలాపాలను డాII బాలగోపాల్‌ నిశితంగా పరిశీలించేవాడు. నమ్మిన రాజకీయాల కొరకు విద్యార్థులు ప్రాణాలను బలిదానం చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే ఆ రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. క్రమంగా ఆయనలో తాత్విక అన్వేషణ మొదలైంది. ఈ క్రమంలోనే బాలగోపాల్‌ సామాజిక పరిస్థితులు అర్ధమ య్యాయి. వాటిని విశ్లేషించే మార్గమూ తెలిసింది.
ఈ పరిస్థితి కొనసాగుతుండగానే ఎమర్జెన్సీ ఎత్తివేశారు. ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశవ్యాపంగా ఎమర్జెన్సీ కాలంలో జరిగిన దురాగతాలకు వ్యతిరేకంగా లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ నేతృత్వంలో బలమైన ప్రజాస్వామిక ఉద్యమం ఉప్పెనవలే లేచింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం పదిలంగా ఉందని నమ్మినవారికి ఎమర్జెన్సీ కనువిప్పు కలిగించింది. పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితం కాకుండా భారతదేశం ప్రజాస్వామ్యంగా నిలబడలేదన్న అభిప్రాయం బలపడింది.

ఈ స్ఫూర్తితో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి దేశవ్యాప్తంగా హక్కుల ఉద్యమాలు అంకురించాయి. ఈ ఉద్యమాల ద్వారా ప్రజాస్వామిక విలువల కొరకు పనిచేయాలన్న లక్ష్యంతో బాలగోపాల్‌ 1981లో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘంలో చేరాడు. 1983తో సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.బాలగోపాల్‌చేరిన నాటికి పౌర హక్కుల సంఘానికి విస్తృత మైన నిర్మాణం, నిరంతరమైన పనివిధానం ఉండేవి కావు. హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ప్రజాసంఘాల సాయంతో హక్కుల కార్యకర్తలు నిజనిర్ధారణకు పోయి వాళ్ళ సాయంతోనే సభలు పెట్టి ఖండించేవారు. ఇతర సంఘాల మీద ఆధారపడి పనిచేయవలసివచ్చేది. బాలగోపాల్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్ని కైన తర్వాత ఈ సంప్రదాయం మారింది. స్టేజిలు ఏర్పాటు చేసుకోవడం నుంచి మొదలుకొని పోస్టర్లు అంటించడం దాకా అన్ని పనులు పౌరహక్కుల సంఘం స్వతంత్రంగా చేసుకోవడం ప్రారంభించింది.

అప్పట్లో హక్కుల సంఘాలలో పనిచేయాలంటే నిత్యం పోలీసులతో ఘర్షణపడవలసి వచ్చేది. తామూ చట్టం ప్రకారం నడుచుకోవాలన్న స్పృహ పోలీసులలో వీసమెత్తు కూడా ఉండేదికాదు. తాము చెప్పిందే చట్టం, తమ ఆజ్ఞలను అనుస రించడమే ప్రజల కర్తవ్యం అన్న ధోరణితో పోలీసులు వ్యవహ రిస్తుండేవారు. కనుక అక్రమ అరెస్టులను, ఎన్‌కౌంటర్‌ హత్య లను ఖండించడమంటే పోలీసుల విచ్చలవిడి అధికారాలను ప్రశ్నించడమే. ఆర్‌ఇసిలో కలిగిన చైతన్యం, పెంపొందిన తాత్విక దృక్పథం, ఇచ్చిన నిబద్ధత, తనకున్న మొండితనం వల్ల బాలగోపాల్‌ పౌరహక్కుల సంఘాన్ని నడిపించగలిగారు. ఇటు ప్రజాఉద్యమాలు, అటు పోలీసులదాడులవల్ల అగ్ని గుండంగా మారిన వరంగల్‌లో పౌర హక్కుల కార్యకలాపాలను కొనసాగించారు. పోలీసుల దాడులను తట్టుకొని సంస్థను నిలబెట్టడమే కాక క్రమంగా పౌరహక్కుల సంస్థ కార్యరంగాన్ని కూడా విస్తృతపరిచారు.

బాలగోపాల్‌ ప్రధాన కార్యదర్శి అయ్యేనాటికి అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్న సోయి పౌరహక్కుల సంఘానికి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల అది ఆచరణలోనికిరాలేదు. తొలుత కేవలం నిర్బంధ వాతావరణాన్ని తట్టుకొని నిలబడాలన్న తాపత్రయంతో బాలగోపాల్‌ నేతృ త్వంలో పౌరహక్కుల సంఘం కార్యకలాపాలను విస్తృత పరచుకుంది. మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీల కార్యకర్తలపై దాడులు జరిగినప్పుడే కాక సాధారణ ప్రజల హక్కులకు విఘాతం కలిగినప్పుడు కూడా పౌరహక్కుల సంఘం కార్యక్ర మాలను తీసుకున్నది.లాకప్పుహత్యలు, వాతావరణ కాలుష్యంవంటి సమస్యలపైనేకాక అనేకానేక ఇతర సమస్యలను పౌరహక్కుల కోణం నుంచి చూసి స్పందించడం వల్ల హక్కుల ఉద్యమ పరిధి విస్తరించింది.

భారతదేశంలో చాలా సంఘాలు తమ కార్యకలాపాలను పెంచుకున్నాయి. అయితే బాలగోపాల్‌ మాత్రమే ఈ పరిణా మాలను సిద్ధాంతీకరించి పౌరహక్కుల ఉద్యమానికి కార్యరంగం, పని విధానం నిర్దిష్టంగా ఉంటాయని తేల్చి చెప్పారు. ఈ విషయంలో బాలగోపాల్‌ చేసిన కృషి చాలా కీలకమైంది. తనకంటూ ఒక ప్రత్యేక కార్యక్షేత్రాన్ని పని మద్దతులను రూపొందించుకోవడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో హక్కుల ఉద్యమం సజీవంగా నిలబడింది.

భారతదేశంలో 1980ల దాకాహక్కుల సంఘాలు లోహియా ఏర్పరిచిన చట్రంలో పనిచేస్తూ వచ్చాయి. 1936లో తొలుతగా లోహియా పౌరహక్కుల భావనను నిర్వచించి, పౌర హక్కులసాధనకై హక్కుల సంఘాలు నిర్వర్తించవలసిన కర్తవ్యా లకు దిశానిర్దేశనం చేసారు. ఆ తరువాత సామాజిక చలనాలకు అనుగుణంగా పౌరహక్కుల భావనను విస్తరించ డానికి కావల్సిన తాత్వికపునాదిని హక్కుల ఉద్యమాలు తయారు చేయలేకపోయాయి. సామాజిక మార్పులకు అనుగుణంగా సిద్దాంత భూమికను ఏర్పాటుచేసుకోకపోవడం వల్లనే చాలా రాష్ట్రాలలోహక్కుల ఉద్యమాలు కాలపరీక్షకు నిలబడ లేక పోయాయి. ఆలోపం ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమంలో లేదు. హక్కుల కార్యాచరణను నిశితంగా పరిశీలించి సిద్ధాంత పరికల్పన చేయడంద్వారా బాలగోపాల్‌హక్కుల ఉద్యమాన్ని బలేపేతంచేసి బాధితులకు న్యాయాన్ని అందించడంలో దోహదపడ్డారు.హక్కులు సామాజికమైనవని అన్నది లోహియా సూత్రీ కరణకు ఉన్న వివిధ పార్శ్వాలను బాలగోపాల్‌ వెలుగులోకి తెచ్చారు.

నిండైనజీవితాన్ని పొందడానికి అణచివేయబడే సమూహాలు భిన్న రాజకీయ విశ్వాసాలతో అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. ప్రజాస్వామిక విలువలు ఊటలు ఊరేది ఈ ఉద్యమాల చెలిమలోనే. ఉద్యమాల నుండి ఉద్భ వించిన ప్రజాస్వామిక విలువలను, హక్కులను స్వీకరించాలని, వాటి రక్షణకు నిరంతరం పోరాటం చేసి వ్యవస్థీకరించాలని బాలగోపాల్‌ అన్నారు.విభిన్న ఉద్యమాల సారంశమే హక్కుల ఉద్యమం. ఈ ప్రస్థానంలో హక్కుల భావనకానీ, ఉద్యమంకాని రాజకీయ చట్రాల పరిధిలో ఇరుక్కొని తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పో వద్దని బాలగోపాల్‌ వాదించాడు. ఈ విషయంలో బాలగోపాల్‌ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అయినా చలించని విశ్వా సంతో ముందుకు సాగాడు.

తాను ఎంచుకొన్న ఈ ఉదాత్తమైన పాత్రవల్లనే అన్నిరకాల ప్రజాఉద్యమాలతో మమేకం కాగలి గారు. బాలగోపాల్‌ ఈ క్రమంలో బాధితుల గోపాల్‌ అయ్యారు. ప్రజాస్వామికవాదులు ప్రజాస్వామిక విలువలను ప్రవచించ డమే కాదు ఆచరించాలన్నారు. ఆధిపత్యం, అణచివేత ఏ రూపంగా వ్యక్తమైనా నిబద్ధతతో, నిజాయితీతో వ్యతిరేకించా లన్నారు. ఆఖరుకు ప్రజా ఉద్యమాలు కూడా తమ కార్యాచరణలో ఆ విలువలను ప్రతిబింబించినప్పుడు ఆ విలువల ఆధారంగానే ప్రశ్నించాలన్నారు. సమాజాన్ని మానవీయంగా చేసే అపురూపమైన ప్రయత్నం వల్లనే బాలగోపాల్‌ మానవ తారగా తళుక్కుమన్నారు. ఆయనను స్మరించడమంటే మనలోని మానవతను మననం చేసుకోవడమే.

Written by chs

November 7th, 2009 at 6:12 am

Leave a Reply