నాకు ఎదురుచూపులే మిగిలాయి…
గౌరిపెద్ది వేంకట శంకర భగవాన్ (Source: Andhra Jyothy, November 1st, 2009).
ఈ మధ్యనే (08.10.2009) హఠాన్మరణం చెందిన మానవహక్కుల నేత కె.బాలగోపాల్‌తో పాటు హైస్కూల్లోనూ, ఆ తర్వాత డిగ్రీలోనూ దాదాపు ఐదారేళ్లు కలిసి చదువుకున్న బాల్య స్నేహితుడు గౌరిపెద్ది వేంకట శంకర భగవాన్. ప్రస్తుతం ఈయన కడప జిల్లా గ్రామీణబ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగ బా«ధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్నతనంలో బాలగోపాల్ జీవనశైలిని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ అందిస్తున్న అక్షర నివాళి ఇది.
బాలగోపాల్‌తో ఐదారేళ్లు కలిసి నడిచిన అదృష్టవంతుణ్ణి నేను. తిరుపతిలోని ప్రకాశంపంతులు మున్సిపల్ హైస్కూలులో 8,9,10 తరగతులు కలిసి చదువుకొనే రోజుల్లో అతనితో సన్నిహితంగా ఉంటూ, ఇతర స్నేహితుల మధ్య నా స్థానం ప్రత్యేకమైనదిగా భావించేవాణ్ణి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మనవడిగా బాలగోపాల్, గౌరిపెద్ది రామసుబ్బశర్మ కుమారుడిగా నేను …అందరికీ తెలిసిన రెండు పండిత కుటుంబాల సాన్నిహిత్యం మాది.
క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్
తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ క్వార్టర్స్‌లో ఉన్న తన మేనమామ ఇంటి నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు మా ఇంటికి కాలినడకనే వచ్చేవాడు. లంచ్‌బాక్స్ మా ఇంట్లో ఉంచేవాడు. ఇద్దరం కలిసి సుమారు ఒక కిలోమీటరు నడిచి స్కూలుకు వెళ్లే వాళ్లం. మధ్యాహ్నం భోజనానికి మళ్లీ మాఇంటికి వచ్చేసి అతని బాక్సులోనివి నేనూ, మా ఇంట్లో చేసిన పదార్థాలు తనూ పంచుకు తినేవాళ్లం.
అతనెప్పుడూ మా తరగతికి సంబంధించిన గణితం చేసేవాడు కాదు. ఆనాటి బీఎస్సీ మాథ్స్‌ను, ఫిజిక్స్‌కు సంబంధించిన లెక్కలను చేసుకొనేవాడు. అతను ఏదైనా చర్చించినా, వివరించినా ఇతరుల ముఖాల్లోకి చూసి మాట్లాడటం చాలా తక్కువ. ఎంతదూరమైనా నేలమీదో, ఆకాశంవైపో దృష్టి సారించి నడుస్తూ మాకు చాలా విషయాలు చెప్పేవాడు.
చరిత్ర, సోషలిజం, క్రికెట్ మాకు ముఖ్యమైన విషయాలు. క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్‌గా దిగితే బాలగోపాల్ చివరికంటా నిలిచి ఆడేవాడు. అతను అవుట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఫెలిసియస్ క్రికెట్ క్లబ్ అని మా స్నేహితులం ఏర్పాటు చేసుకున్న టీమ్ తిరుపతిలో అజేయంగా ఉండేది. మాకు కెప్టెన్‌గా ఓరుగంటి రవీందర్ ఉండేవాడు.
మేమిద్దరమే ఆయనతో దెబ్బలు తినలేదు
మా గురువైన పి.వి. శ్రీనివాసమూర్తి తెలుగుపాఠం వినాలంటే మాకు చాలా ఇష్టం. ఛందస్సు బలవంతంగా నేర్పించారు. మాకు నిబంధన ఏమిటో తెలుసా? తప్పులు లేకుండా రోజూ ఒక పద్యాన్ని ఛందోబద్ధంగా స్వంతంగా రాసుకు వెళ్లాలి. మేమిద్దరమే ఆయన దగ్గర దెబ్బలు తిననిది. అప్పట్లో పాఠ్యాంశంగా చేమకూర వెంకటకవి ‘విజయవిలాసం’ గద్యభాగం ఉండేది. రకరకాల శకునాల గురించి నాన్‌స్టాప్‌గా సాగిపోయే ఆ వచన కవిత్వానికి బాలగోపాల్ పద్యరూపంలో దాదాపు వంద పద్యాలు రాసి ఉం టాడు. మహాకవి కాళిదాస విరచితమైన రఘువంశాన్ని తెలుగులో పద్యకావ్యంగా రాశాడు. అది నేను చదివాను. ఆ తర్వాత ఆ ప్రతిని ఆయనే చించేశాడు. ఎస్‌ఎస్‌ఎల్‌సీలో నాకు ఫస్ట్ క్లాస్ వస్తే… ఆయనకు జిల్లా ఫస్ట్. అప్పట్లో అదే కొలమానం. తరువాత పీయూసి చదవడానికి అతను కావలి వెళ్లిపోయాడు.
నా దృష్టిలో అభినవ రామానుజన్
జీవితంలో మరోసారి అతనితో కలిసి చదువుకొనే భాగ్యం నాకు కలిగింది. ఈ దశలో ఇద్దరం మరికొంత పక్వానికి వచ్చాం. కాబట్టి మా బంధం మరపురానిదిగా, నాకు జ్ఞానదాయకంగా ఉండేది. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీ ఎంపీసీ మూడేళ్లు పూర్తి చేశాం. ఈ దశలోనే అతనేమిటో పూర్తిగా బోధపడింది. నా దృష్టిలో అతను అభినవ రామానుజన్.
ఆయన క్లాసు పుస్తకాలు చదవటం, క్లాసులో వినటం, లెక్చరర్స్‌ను ప్రశ్నలు వేయటం నేను ఎప్పుడూ గమనించలేదు. రస్సెలు రాసిన సోషలిజం బుక్స్ ఎక్కువగా చదువుతూ కన్పించేవాడు. అతనికి క్లాస్ అటెండెన్స్ చాలా తక్కువగా ఉండేది. మేము ప్రోక్సీగా ప్రజెంట్ చెప్పడం చాలా మేలయ్యింది. కండోనేషన్ కట్టినట్టుగా గుర్తు. ఎలాగోలా ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై చేయించాం.
డెస్కులో సోషలిజం పుస్తకాలుండేవి
ఎక్కువగా యూనివర్శిటీ లైబ్రరీలోనే గడిపేవాడు. క్లాసుకు సంబంధించిన పుస్తకాలు చదివి ఉండడని నా గట్టి నమ్మకం. మరీ పట్టించుకుని సీరియస్‌గా యాక్షన్ తీసుకొనే మేజర్ పాపారావు మాస్టారి ఫిజిక్స్ క్లాసుకు మాత్రం వచ్చేవాడు. వచ్చినా తలదించుకొని డెస్కులోపల సోషలిజం పుస్తకాలు చదువుకొనేవాడు.
కాలేజీ రోజుల్లో అతని జీవనశైలి ప్రత్యేకించి చర్చించాలి. తిరుపతి అవిలాలవీధి ప్రాంతంలో చిన్న రూము అద్దెకు తీసుకున్నాడు. దేహంపై శ్రద్ధ ఏమాత్రం చూపేవాడు కాదు. సోపు, పౌడర్‌లాంటి కాస్మెటిక్స్ వాడడం నేను చూడలేదు. ఆహారం గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఒకటో రెండో పరాటాలు, టీలతోనే గడిపేవాడు. మేజస్టెక్ క్యాం టీన్‌లో ఖాతా ఉండేది. బిల్లులు ఆలస్యంగా చెల్లించినా, చెల్లించకపోయినా వారెవరూ విసుక్కునేవారు కాదు. పైపెచ్చు బాలగోపాల్ వస్తే చాలా మర్యాదగా, ఆనందంతో సప్లయ్ చేసేవారు.
తర్వాత రిసెర్చ్ చేసేటప్పుడు వచ్చిన స్టయిఫెండ్‌లోంచి కాబోలు … అప్పుడప్పుడు కొంతకొంత డబ్బులు నాకే పంపి క్యాంటీన్ నడిపిన మళయాళీ ఓనర్‌కు చెల్లించమనేవాడు. ఆయన మళయాళీ యాసతో తెలుగు మాట్లాడుతూ బాలగోపాల్ క్షేమసమాచారం అడిగేవాడు. వ్యాపారంలో దివాళా తీసినా కూడా బాలగోపాల్ పంపిన డబ్బులు తీసుకోడానికి అంగీకరించేవాడు కాదు. నేనే బలవంతంగా జేబులో కుక్కేవాణ్ని. గోపాలంటే అంత ప్రేమ ఆ మలయాళీకి.
క్లాసు పుస్తకం ముట్టగా ఏనాడూ చూడలేదు
మా మిత్రబృందంలో ముఖ్యమైన వాళ్లు మరో ఇద్దరు. యనమండ్ర రామకృష్ణ (టీవీ సీరియల్స్ రచయిత, సంగీత దర్శకుడు మణిశర్మ అన్న య్య), కె.వరదాచారి (రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్, శ్రీవెంకటేశ్వరా యూనివర్శిటీ). ప్రస్తుతం రామకృష్ణ మద్రాసులోనూ, వరదాచారి తిరుపతిలోనూ ఉన్నారు.
మాకిప్పటికీ ఆశ్చర్యమేమంటే బీఎస్సీ చదివే రోజుల్లో గోపాల్ ఏరోజూ పాఠ్య పుస్తకాలు ముట్టగా మేం చూడకపోవటం. దాదాపు రోజూ రాత్రి ఒంటిగంట వరకు బాతాఖానీ … ఎన్నో విషయాలు చర్చించుకొనే వాళ్లం. మాకు తెలిసి బాలగోపాల్ ల్యాబ్స్‌కు కూడా సరిగా వచ్చిన ఆనవాలు లేవు. రికార్డు సబ్‌మిట్ చేయడం అంతంతమాత్రమే. లెక్చరర్స్‌గానీ, లాబ్ అటెండర్స్ గానీ ఏదో ఒక విధమైన గౌరవభావం అతనిపట్ల చూపడం మేము గమనించేవాళ్లం. ఒకరిద్దరు మాథ్స్ లెక్చరర్స్ మాత్రం గోపాల్‌ను విమర్శించేవాళ్లు. మేమంతా అతనితోపాటు క్లాసులు ఎగ్గొట్టి హిందీ సినిమాలకు వెళ్లే వాళ్లం. జనవరి తర్వాతే మా చదువుల తీవ్రత ప్రారంభమయ్యేది. మా సందేహాలు బాలగోపాలే నివృత్తి చేసేవాడు. చివరికి గోపాల్ బీఎస్సీలో డిస్టింక్షన్‌తో యూనివర్శిటీ ఫస్ట్‌గా పాసయ్యాడు. నేను హైసెకండ్‌క్లాస్‌తో సరిపుచ్చుకున్నాను.
విలాస జీవితాన్ని తృణీకరించాడు
తర్వాత అప్లయిడ్ మాథ్‌మెటిక్స్‌లో రిసెర్చి చేస్తూ ఢిల్లీలోని ఒక ప్రొఫెసరును గైడ్‌గా తీసుకొని శ్రమించేవాడని, రాయల్ సొసైటీ ఆఫ్ మాథ్‌మెటిక్స్‌కు ఎన్నో విలువైన ఆర్టికల్స్‌ను సెమినార్లలో ప్రజెంట్ చేయడం నాకు తెలుసు. ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టుపై చేసిన పేపరులో తన పేరు కలుపుకొని ప్రజెంట్ చేయమని సదరు ప్రొఫెసరు కోరుతూ, విదేశాలలో ఉద్యోగాన్ని ఎరగా చూపాడని తెలిసింది. కానీ ఆ విలాస జీవితాన్ని తృణీకరించిన వ్యక్తి గోపాల్. ఆపై చాలాకాలం అతని ఉనికి తెలియలేదుగానీ, మీడియా ద్వారా అతనికి రాడికల్స్, నక్సల్స్ వ్యవస్థలతో సంబంధాలున్నాయని తెలిసింది. ఖమ్మంలో బాలగోపాల్‌ను కిడ్నాప్ చేసినప్పుడు, అతణ్ని ఎన్ని చిత్రహింసలు పెట్టారో అని తల్లడిల్లిపోయాను.
తనతో సంబంధాలు ముప్పనేవాడు
1993-94 ప్రాంతంలో కాబోలు కడపలో తారసపడ్డాడు. ప్రొద్దుటూరుకు చెందిన మానవహక్కుల నేత జయశ్రీతో కలిసి మా ఇంటికి భోజనానికి వచ్చాడు. ఇకపై తనతో స్నేహ సంబంధాలున్నా ముప్పేనని, పోలీసులు ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని చెప్పాడు. ఏమైనా నాకు తోచిన ధనసహాయం చేయమంటావా అని అడిగితే నీలాంటివాడు సదవగాహనతో ఇస్తే అంతకంటే నాకేమి అని 300 రూపాయలు మాత్రం బలవంతంగా తీసుకున్నాడు. ‘నీవు సన్నగా ఉన్నావు గదరా? పోలీసులు తీవ్రంగా హింసిస్తే తట్టుకోగలవా?’ అని అడిగితే బాలగోపాల్ పోలీసులపై ఈగ వాలనివ్వలేదు. తనను మొదట్లో అపార్థం చేసుకొని ఇబ్బంది పెట్టినా, తర్వాత అర్థం చేసుకొని ‘డాక్టరుగారని’ సంబోధించేవారని, తనను గౌరవిస్తారని చెప్పాడు. సంపద, వస్త్రధారణ, ఆడంబర జీవనశైలి ద్వారా తమ విలువ, గౌరవం పెరుగుతుందనే వారికి బాలగోపాల్ జీవితం ఒక గుణపాఠంగా చెప్పొచ్చు.
మా ఇంటికి వస్తానని మాటిచ్చాడు
ఈ మధ్యే ఆగస్టు 2వ తేదీన అనుకుంటాను … బాలగోపాల్ నుంచి నా మొబైల్‌కు ఫోను వచ్చింది. ఎవర్నో కాంటాక్టు చేయడానికి ప్రయత్నిస్తున్న ఆయనకు యాదృచ్ఛికంగా నా ఫోన్ తగలడం నా అదృష్టం. ఆ సందర్భంలో “మా ఇంటికి రాకూడదురా? ఎక్కడున్నావో చెబితే … మా ఇంటికి తీసుకొస్తాన”ని నేను అడిగితే, ‘ఆగస్టు 16న అక్కడికి వస్తున్నాను, వీలైతే తప్పక వస్తాన’ని మాటిచ్చాడు. నా ఎదురుచూపులు ఎదురుచూపులుగానే మిగిలిపోయాయి. తిరిగిరాని నా మిత్రుని సహచర్యం తలుచుకుంటే మనసంతా దుఃఖంతో నిండిపోతుంది. ఆయన ప్రేరణతో పేదలకు ఆసరాగా ఉండాలనుకుంటున్నాను. నా బాల్యమిత్రుడికి నేనిస్తున్న కన్నీటి అక్షర నివాళి ఇది.
-
ఈ ప్రపంచం లో సొంత లాభం చాల మానుకుని సాధారణ జీవితం గడుపుతున్న ఇలాంటి మేధావులే మనకు ఆదర్శం!!
chaitanya
11 Nov 09 at 6:15 pm