ఐక్యతే హక్కులకు రక్షణ
యస్.శేషయ్య (APCLC) Source: Andhra Jyothy, November 11, 2009.
అభివృద్ధిపేరుతో జరుగుతున్న విస్తాపన, విధ్వంసం, హిందూ మతోన్మాదం పెరిగి మైనారిటి మతస్తులపై ఊచకోత, ఉగ్రవాదం పేరుతో హక్కుల ఉల్లంఘన, తీవ్రవాదం పెనుప్రమాదం అని చెప్తూ ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఆదీవాసీలపై చేస్తున్న యుద్ధం, అన్నీ కూడా హక్కుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యం కాదు. హక్కుల సంఘాలు కలిసి ఐక్యంగానే హక్కులను కాపాడుకోగలుగుతాం. హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేయగలుగతాం.
బాలగోపాల్ ఆకస్మిక మరణం హక్కుల ఉద్యమకారులందరినీ విషాదంలోకి నెట్టివేసింది. బాలగోపాల్ ‘ఇక లేడు’ అనే నిస్పృహతోపాటు, ‘పౌరసమాజం’ ఒక రకమైన భయానికి, వెలితికి లోనయ్యిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ, ఈ పరిస్థితి తాత్కాలికమే. పురుషోత్తం, ఆజం అలీలను సర్కారీ హంతకముఠాలు కిరాతకంగా హత్య చేసి ఒక భయానక వాతావరణం సృష్టించారు. పౌరహక్కుల సంఘం ఇక పనిచేస్తుందా? అనే సంశయం, సందేహాలు ఏర్పడ్డాయి. బాలగోపాల్ ఆ సందర్భంలో ‘నిస్పృహను, నిస్సహాయతను అధిగమించడానికి కావల్సిన దృఢ సంకల్పం, మానసిక స్థైర్యాన్ని పురుషోత్తం నుండి ఉద్యమాలు, ఉద్యమకారులు, ప్రజలు నేర్చుకోగలిగితే అతని మరణం వృధా కానట్టే’ అని ధైర్యాన్ని యిచ్చాడు.
మానవ హక్కుల వేదిక మూడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా అనంతపురంలో బహిరంగ సభలో ‘భయం నుండి బయటపడాలనీ, నిర్భయంగా ప్రశ్నించాలనీ, రాజకీయ, సామాజిక జీవితంలో విలువలను పెంపొందించడానికి కృషి చేయాలి’ అని చివరిసారిగా పిలుపునిచ్చాడు. బాలగోపాల్ ఆలోచనలు, ఆచరణకు సంబంధించిన అంచనాలు, హక్కుల ఉద్యమంపై వచ్చిన వాఖ్యానాలు హక్కుల కార్యకర్తలను కొంత గందరగోళానికి గురిచేశాయి. మన రాష్ట్రంలో హక్కుల ఉద్యమ చరిత్ర, నేపథ్యం మరుగున పడిపోయింది. హక్కుల ఉద్యమాన్ని నిలబెట్టడంలో ముందుకు నడిపించడంలో పౌరహక్కుల సంఘానికి (ఎపిసిఎల్‌సి), ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపిడిఆర్)కి ఎలాంటి పాత్ర లేదా? ప్రధానంగా మానవ హక్కుల ఉద్య మం విశాలమైందనీ, పౌర ప్రజాస్వామిక హక్కుల ఉద్యమం పరిమితమైందనీ లేదా సంకుచితమైందనే విధంగా ప్రచారం జరిగింది.
మానవహక్కుల వేదిక నక్సలైటు ఉద్యమాన్ని, వారి హింసను ఖండిస్తుందనీ, పౌర హక్కుల సంఘం సమర్థిస్తుందనీ, మానవ హక్కుల వేదిక రాజకీయాలకు అతీతం అనీ, ఇతర సంస్థలు రాజకీయ పార్టీలకు అనుబంధం అనే భావన ఏర్పడేటట్టు ప్రచారం గతంలో జరిగింది. ఇప్పుడూ జరుగుతూ ఉంది. బాలగోపాల్ బ్రతికుంటే పై అభిప్రాయాలను సమర్థించేవాడు కాదు. హక్కుల ఉద్యమంలో బాలగోపాల్ ప్రతిపాదించిన దృక్పథం పట్ల పౌర హక్కుల సంఘంలో చర్చ జరిగింది. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయం కారణంగా సంస్థ నుంచి విడిపోయి మానవ హక్కుల వేదిక ఏర్పాటు చేశాడు. పౌరహక్కులు, ప్రజాస్వామిక హక్కులు, మానవ హక్కులను వేరువేరుగా భావించడం, వర్గీకరించడం వాటి మధ్య హెచ్చుతగ్గులు చూడటం సరైందేనా? కాదని బాలగోపాల్ వివరించాడు. ‘ప్రతి సమస్యకు ఒక హక్కుల కోణం ఉంటుం ది’ అని బాలగోపాల్ అభిప్రాయం.
ప్రస్తుతం చట్టాల్లో, రాజ్యాంగంలో గుర్తించబడిన హక్కులన్నీ కూడా చరిత్రలో ప్రజల అవసరాలుగా, డిమాండ్లుగా ముందుకు వచ్చినవే. ప్రతి హక్కుకు ఒక చరిత్ర ఉంది. వివిధ చారిత్రక అభివృద్ధి దశల్లో అనేక రాజకీయ, సామాజిక ఉద్యమాల నుంచి, ప్రజల త్యాగాల ఫలితంగానే హక్కులు ఉనికిలోకి వచ్చాయి. ప్రజల సామాజిక వ్యవస్థలో నిత్యం హక్కుల నిరాకరణ, అతిక్రమణ జరుగుతూ ఉంది. ప్రజలు సాధించుకున్న హక్కుల అమలు కోసం, అనుభవించటం కోసం పోరాడుతూనే, కొత్త హక్కుల కోసం ఆందోళన చేస్తూ ఉన్నారు. వీరికి సహకరించటం హక్కుల ఉద్యమ ప్రధాన కర్తవ్యం అని బాలగొపాల్ మొదటి నుంచి అభిప్రాయపడ్డారు.
పౌరహక్కుల సంఘం 1993 డిసెంబరులో సవరించిన తన లక్ష్య ప్రకటనలో హక్కుల ఉనికి గల చారిత్రక నేపథ్యం గురించి హక్కుల అవసరం, ప్రయోజనం గురించి చాలా స్పష్టంగా వివరించింది. హక్కులు జీవించడానికి అవసరం. జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరం. హక్కులు వాటంతటవే విలువైనవే కాక, అణచివేతను ప్రతిఘటించడానికి, జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి సాధనాలు కూడా’ అని పేర్కొంది. ఈ అవగాహన పట్ల రాష్ట్రంలో పనిచేస్తున్న మూడు సంస్థలకు ఏకభావం ఉంది. పౌరహక్కులు, ప్రజాస్వామిక హక్కుల మధ్య తేడాల గురించి, పరిమితులు, పరిధి గురించి గతంలో దేశంలోని హక్కుల సంస్థల మధ్య చర్చలు, వాదోపవాదాలు జరిగాయి.
పౌర హక్కులంటే వ్యక్తిగతమైనవనీ, పౌరులకు మాత్రమే చెందినవనీ, రాజ్యానికి వ్యతిరేకమనీ, రాజ్యాంగ యంత్రాన్ని దాని అధికారాన్ని నియంత్రించే సాధనాలనీ, కేవలం చట్టంలో, రాజ్యాంగంలో గుర్తించబడినవనీ, ఈ హక్కుల ఉల్లంఘన జరిగితే బాధితులు కోర్టుల ద్వారా అమలు చేసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక హక్కులు అంటే ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక జీవితానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి గల హక్కులే ప్రజాస్వామిక హక్కులు. అంతే కాకుండా ప్రజాస్వామిక హక్కులు సామూహికంగా వ్యక్తీకరించబడతాయనీ ప్రజాస్వామిక ఉద్యమాల ఆకాంక్షలుగా ముందుకు వస్తాయి.
ప్రజాస్వామిక హక్కులకు ఏ నిర్వచనం చెప్పుకున్నా మనిషిగా తలెత్తుకొని బ్రతకటమే పరమార్థం. దోపిడీని ప్రతిఘటించే హక్కు ప్రతిమనిషికి ఉంది. అది మౌలిక ప్రజాస్వామిక హక్కు. అందుకే సమస్యల పరిష్కారం కోసం, తమ జీవితాలను మెరుగుపరచుకోవడం కోసం పోరాడే హక్కు లేదా ఉద్యమించే హక్కును మౌలికమైన ప్రజాస్వామ్య హక్కుగా పౌరహక్కుల సంఘం గుర్తించింది. వ్యక్తిగత జీవితంలోకి, హక్కుల్లోకి రాజ్యం జోక్యం చేసుకోకూడదని పౌరహక్కుల భావన అయితే, ప్రజల జీవితాలను బాగుచేయడానికి, వారి సంక్షే మం కోసం రాజ్యం జోక్యం చేసుకోవాలని ప్రజాస్వామిక హక్కుల ఉద్యమం డిమాండు చేస్తుంది. పౌరహక్కులు వ్యక్తిగతం కాగా ప్రజాస్వామిక హక్కులు సామూహికంగా వ్యక్తీరించబడుతాయి.
ప్రజాస్వామిక హక్కులను చట్టం గుర్తించకపోవచ్చు. కానీ ప్రజల చైతన్యంలో ఉంటాయి. కోర్టుల ద్వారా అమలు చేసుకొనే అవకాశం లేకపోవచ్చు. పోరాటాల ద్వారా సాధించుకోవల్సిందే. పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులు అనే వర్గీకరణ ఒకటి మన దేశంలోని పౌర హక్కుల ఉద్యమంలో తరచుగా చర్చకు వస్తూంది. హక్కుల్లో హెచ్చు తగ్గులు నిర్ణయించడం కోసం దీనిని వాడుకోవడం జరుగుతూంది. ఈ వైఖరిని బాలగోపాల్ వ్యతిరేకించాడు. ఆయన మాటల్లోనే ‘నిజానికి మనుషులందరికీ రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాల్లో అన్ని రకాల సమానత్వం (హోదాలో, స్థితిగతుల్లో, అవకాశాల్లో ) ఉండాలనేది హక్కులకు ప్రామాణికం. ఈ దిశగా ఇప్పటికే సాధించుకున్న హక్కులు, ఇంకా సాధించుకోవాల్సిన హక్కులు అనేదే ఉపయోగకరమైన వర్గీకరణ, వేరే వర్గీకరణ అయినా విశ్లేషణ సౌలభ్యం కోసం చేసుకునేదే.
అంతే తప్ప హక్కులలో హెచ్చుతగ్గులు చూపించి ఒక దాని పేరు మీద మరొకదాని నిరాకరణను, సమర్థించడాన్ని వ్యతిరేకించాలి’ అని స్పష్టం చేశాడు. హక్కుల మధ్య వర్గీకరణకు, హెచ్చుతగ్గులకు పెట్టుబడిదారీ దేశాలకు, సోషలిస్టు దేశాలకు మధ్య ప్రాధాన్యత ప్రజాస్వామ్యంపై జరిగిన చర్చ వాటి రాజకీయ దృక్పథాలు కారణం. బాలగోపాల్ ఈ చర్చల ప్రభావం గురించి చర్చిస్తూ అర్ధ శతాబ్దం పాటు ప్రపంచ రాజకీయాలను శాసించిన ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో పౌర, రాజకీయ హక్కులే ప్రజాస్వామ్యమనీ, సామాజిక, ఆర్థిక హక్కులను పెట్టుబడిస్వామ్యం దయాదాక్షిణ్యాలకు వదిలేసినా అక్కడ ప్రజాస్వామ్యం లోపించినట్లు భావించడం అవసరం లేదని అమెరికా కూటమి వాదించగా, సామాజిక ఆర్థిక హక్కులే ప్రజాస్వామ్యమనీ, పౌర రాజకీయహక్కులుసైతం కావాలనడం కేవలం బూర్జువా బలహీనత అని సోవియట్ కూటమి వాదించింది.
ఆ తర్వాత చైనా కూటమి కూడా ఇలాగే మాట్లాడింది. మన దేశంలో కమ్యూనిస్టులు సోవియట్, చైనా వాదనలను సమర్థించారు. కానీ పౌరహక్కుల ఉద్యమం దృష్టిలో ఇది కృత్రిమమైన విభజన అని బాలగోపాల్ అభిప్రాయపడ్డాడు. పౌరహక్కులు లేకుండా, ప్రజాస్వామిక హక్కును రక్షించుకోలేం, సాధించుకోలేం. భావ ప్రకటనా స్వేచ్ఛ, సంఘాలుగా ఏర్పడే హక్కు, సంఘటితమయ్యే హక్కు, సమావేశపు హక్కు అన్నీ కూడా ఉద్యమించే హక్కు (ప్రజాస్వామిక హక్కు)లో భాగమే. ఉద్యమించే హక్కు వ్యక్తీకరణలే. మానవ హక్కులంటే పౌర, ప్రజాస్వామిక హక్కులకు భిన్నమైనవి కాదు. వాస్తవానికి పౌర ప్రజాస్వామిక హక్కుల సమాహారమే మానవహక్కులు. ప్రపంచనాగరికత అభివృద్ధి క్రమంలో ఉనికిలోకి వచ్చి గుర్తించబడ్డ హక్కులన్నింటినీ ఇవ్వాళ అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటనలోనూ, వివిధ హక్కుల ఒడంబడికల్లోనూ, ఒప్పందాలలోనూ పొందుపరచబడ్డాయి.
హక్కులు మగవాళ్ళకే పరిమితం,సహజ హక్కులు స్థానంలో హక్కుల భావనలో లింగ వివక్షతను నిరాకరిస్తూ, దైవ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ మానవ హక్కులు అనే భావన వచ్చింది. ఈ మార్పు వెనుక అనేక ఉద్యమాల ప్రభావం ఉంది. పౌర, ప్రజాస్వామిక హక్కులు మానవ హక్కుల సమాహారంగా ఇవ్వాళ అందరూ అంగీకరిస్తున్నారు. మానవహక్కుల వేదిక, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ, పౌర హక్కుల సంఘాల మధ్య అవగాహనలో ఆచరణలో పెద్దగా తేడాలు లేవు. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా అవి కలిసి పనిచేయడానికి ఆటంకం కావు. ఇవ్వాళ హక్కుల ఉద్యమం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది.
అభివృద్ధిపేరుతో జరుగుతున్న విస్తాపన, విధ్వంసం, హిందూ మతోన్మాదం పెరిగి మైనారిటి మతస్తులపై ఊచకోత, ఉగ్రవాదం పేరుతో హక్కుల ఉల్లంఘన, తీవ్రవాదం పెనుప్రమాదం అని చెప్తూ ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఆదీవాసీలపై చేస్తున్న యుద్ధం, అన్నీ కూడా హక్కుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యం కాదు. హక్కుల సంఘాలు కలిసి ఐక్యంగానే హక్కులను కాపాడుకోగలుగుతాం. హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేయగలుగుతాం. ఈ కర్తవ్యం నిర్వహించడమే బాలగోపాల్‌కు నిజమైన నివాళి.