Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

కరువుకూ, పోలవరానికీ సంబంధం ఏమిటో…!

without comments

- కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

‘వివిధ కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న’ వారిలో మేము కూడ ఉన్నాము కాబట్టి, వేములపల్లి వెంకట్రామయ్య రాసిన వ్యాసాని(జన వరి 6,ఆంధ్రజ్యోతి)కి జవాబు రాయడం అవసరమని భావిస్తున్నాను. గోదా వరి జలాలలో మన రాష్ట్రానికి కేటాయించిన వాటాలో 700 టిఎంసిలు (680 అని నిపుణులఅంచనా) ఇంకా వినియోగంలోకి రాకుండా మిగిలే ఉందని ఆయన గుర్తించా రు. మన వాటాను వీలయిన మేరకు వాడుకోవటం అవసరమనే అనుకుందాం. దాని నుంచి పోలవరం ప్రాజెక్టు చేపట్టడం తప్పనిసరి అనే నిర్ధారణకు ఎందుకు రావాలి? ఆ నీళ్ళన్నీ పోలవరం దగ్గరనో, దానికి కొంచెం ఎగువనో గోదావరిలో వచ్చి చేరేటట్టయితే పోలవరం ప్రాజెక్టు ద్వారా తప్ప ఇంకొకరకంగా మన వాటాను వాడుకోవటం సాధ్యం కాదు.

కానీ ఆ జలాలు పోలవరానికి బాగా ఎగువున గోదావరిలో వచ్చి కలుస్తాయి. ‘మన వాటా’గా మనం భావించే గోదావరి నీళ్ళు ప్రధానంగా ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదుల ద్వారా గోదావరిలోకి వస్తాయని వెంకట్రామయ్య సరిగానే గుర్తించారు. ఆ నదులు గోదావరిలోనికి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో వచ్చి కలు స్తాయి. అవి తెచ్చే నీటిని అక్కడే వాడుకునే ఆలోచన మొదట ఎందుకు చేయకూడదు?

ఇది ఎత్తిపోతల ద్వారా తప్ప ఇతరత్రా సాధ్యం కాదనేది నిజమే. కానీ నదీజలాలను భారీ జలాశయం కట్టి గ్రావిటీ ద్వారా తీసుకోవడమే సరైన మార్గమని భావిచేటట్టయితే ఉత్తరతెలంగాణ జిల్లాలకు గోదావరిజలాలు ఇవ్వడం సాధ్యమే కాదని వెంకట్రామయ్య గ్రహిస్తున్నారా? ఉత్తర తెలంగాణకు గోదావరి జలాలు ఇవ్వడం అంటూ జరిగితే అది ‘గరిష్ఠం’గా వాడుకోవడానికి జలాశయాల నుంచి గ్రావిటీ ద్వారా తీసుకోవడం సరైన మార్గమా లేక ఎత్తిపోతల ద్వారా తీసు కోవడం సరైన మార్గమా అనేది కాదు ప్రశ్న. నదీ జలాలను ఏ నేలలకు మళ్ళించడం ఎక్కు వ అవసరం, దానికి అనువైన మార్గమేమిటి, దానికి కాగల ఖర్చు ఎంత అనే విషయాలను ప్రాధాన్యతల క్రమంలో నిర్ణయించాలి.

ఎత్తిపోతలకు ఎకరానికి 5000 నుంచి 10000 రూపాయలు ఖర్చు కావచ్చని వెంక ట్రామయ్య అన్నారు. అంతకంటే నిర్దిష్టం గానే చెప్పవచ్చు. 1 ఎక రానికి సాగునీరు 100 మీటర్లు ఎత్తిపో యడానికి 1000 యూనిట్ల కరెంట్‌ అవసరం అవుతందని అంచ నా. యూనిట్‌కు 2 రూపాయల చొప్పున, ఖర్చు 2000 రూపా యలవుతుంది. తెలంగాణలోని వర్షాభావ ప్రాంతాలకు గోదావరి జలాల నివ్వడానికి కొద్దిపాటి ఎత్తిపోతల నుంచి దాదాపు 400 మీటర్ల ఎత్తిపోతల దాకా అవసరం ఉంటుంది. అంటే ఎకరానికి ఖర్చు 8000 రూపాయల దాకా ఉండగలదు. సగటున 4000 రూపాయలు ఉంటుందనుకున్నా, ఏ రైతూ అంతకాదుకదా అందులో పదవ వంతైనా పెట్టుకోవడం సాధ్యం కాదు. కాలవల కింద నీటితీరువా 200 రూపాయలున్నప్పుడు అంతకంటే ఎక్కువ పెట్టుకొమ్మని రైతుల నడగడం న్యాయమూ కాదు. అంటే ఈ ఖర్చు ప్రభుత్వం పెట్టుకోవల్సివుంటుంది.

ఇది ఒకసారి పెట్టుకునే ఖర్చు కాదు. ప్రతి సంవత్స రమూ పెట్టుకోవాలసి ఉంటుంది. అంతే కాదు ఎత్తిపోతల ద్వారా నదీ జలాలను ఎక్కు వ వాడుకోలేమనీ జలాశయం కట్టి గ్రావిటీ ద్వారా తీసుకుంటేనే ఎక్కువ వాడుకోగల మనీ వెంకట్రామయ్య అన్నారు. అది నిజం కానవసరం లేదు. ఎత్తిపోతల ద్వారా నేరు గా పొలాలకు పారించుకుంటే ఏమోగానీ ఆ నీటిని ఎగువ ప్రాంతంలో రిజర్వాయర్ల లోకి పారించుకుని భద్రపరచుకునేట్టయితే ఈ ఏర్పాటు ఏ మేరకు చేసుకుంటే ఆ మేరకు ఎత్తిపోతల ద్వారా తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో నిర్మించిన చెరువుల వ్యవస్థను వాడు కొని, అవసర మయితే అర్ధ టిఎంసి లేక ఒకటి ఎంసి సామర్థ్యం గల కొత్త చెరువులను నిర్మించుకున్నట్టయితే గోదావరి జలాలు ఎత్తి పోతల ద్వారా చెప్పుకోదగ్గ మోతాదులో వాడుకోవాలంటే ప్రస్తుతం ఉన్న చెరువులకు పూర్తిగా మరమ్మతు చేయాల్సి ఉంటుంది.

కట్టలు, అలుగులు, తూములు బాగుచేసే పూడిక తీయవలసి ఉంటుంది. పూడిక తీయటానికే ఒక్కొక్క చెరువుకూ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఖర్చు కాగ లదు. దీనికెంత ఖర్చవుతుందో లెక్క తీయాలి. దానికి, వార్షికంగా అవసరమయ్యే ఎత్తి పోతల కరెంట్‌ ఖర్చు ప్రస్తుత విలువను జోడించినట్టయితే తెలంగాణాకు గోదావరి జలాలు ఇవ్వటానికి వెంటనే పెట్టవలసిన పెట్టుబడి ఎంతో తెలుస్తుంది. అది పోలవరా నికి అయ్యే ఖర్చు కంటే తక్కువ కాబోదు. అదీ యిదీ రెండూ ప్రభుత్వం చేస్తుందనుకో వడం తెలివితక్కువతనం. రెండిటిలో ఒక్కటి ఎంచుకోవటమే విజ్ఞత అనిపించుకుం టుంది. అప్పుడు పోలవరం కంటే తెలంగాణకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోవటమే సరయినది.

‘కరువుల నివారణకు అవసరమైన జలాలు గోదావరిలోనే ఉన్నాయి’ అంటూ మొద లుపెట్టి పోలవరం ప్రాజెక్టును సమర్థించడంలో అర్థం ఏమిటి? పోలవరం నీళ్ళు తీసు కోబోయే 7.27 లక్షల ఎకరాలు కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. అవి సాగునీటికిగానీ, తాగునీటికి గానీ కరువు ఉన్న ప్రాంతాలు కావు. మరి కరువుకూ పోలవరానికీ ఉన్న సంబంధం ఏమిటి? కృష్ణా బేసిన్‌కు తరలించే 80 టిఎంసిలు కరువు ప్రాంతాల కోసం కావా అంటారేమో. పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించే 80 టి ఎంసిలు ప్రకాశం బ్యారేజికి పోతాయి. అవి కృష్ణా డెల్టాను స్థిరీకరిస్తాయి. కృష్ణా డెల్టాకు వచ్చే నికర జలాల్లో 80 టిఎంసిలు సాగర్‌కు ఎగువ నుంచి వస్తాయి. అల్మట్టి కట్టక ముందు 80 కాదు, ఒక్కొక్క సంవత్సరం 300 నుంచి 400 టిఎంసిల దాకా డెల్టాకు వచ్చాయి.

కర్ణాటక వాళ్ళు అల్మట్టి కట్టి, తెలంగాణ, రాయలసీమలలో ప్రాజెక్టులకు మన నాయకులు ఎడాపెడా పునాదిరాళ్లు వేసే సరికి ఆ 80 టిఎంసిల గురించి కృష్ణా డెల్టావా సులకు బెంగపట్టుకుంది. పోలవరం కట్టి గోదావరి నుంచి 80 టిఎంసిలు నేరుగా ప్రకా శం బ్యారేజిలోకి పారించుకోవడం ఆ సందిగ్ధాన్ని అధిగమించడానికి తగిన మార్గంగా వారు గుర్తించారు. ఆ మేరకు 80 టిఎంసిల నీళ్ళు సాగర్‌కు ఎగువున నింపుకొని దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల అవసరాల కోసం ఎందుకు వాడుకోవచ్చుననే వాదన తో ఈ తరలింపు కరువు ప్రాంతాల కోసం అని చెప్పజూస్తున్నారు.

కానీ ఎప్పుడయితే 80 టిఎంసిలు గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు వస్తాయో అప్పుడవి కృష్ణా జలాలలో భాగం అవుతాయి. వాటిని మనం కర్ణాటక, మహారాష్ట్రలతో పంచుకోవలసి ఉంటుంది. మనకు 45, వారికి 35 టిఎంసిలు దక్కుతాయి. వాటితో తెలంగాణ రాయలసీమలకు సాగునీరు ఇచ్చుకోవచ్చు కదా అంటారేమో. కానీ కొత్తగా ఏమీరాదు. ఇప్పటికే నికర జలాలు కేటాయింపు లేకుండా కడప, నెల్లూరు జిల్లాల కోసం తెలుగు గంగ, నల్లగొండ కోసం ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టు కట్టుకోవడం జరుగుతున్నది. అవి రెండూ త్వరలో పూర్తయిపోవ చ్చు. వాటి ద్వారా తీసుకోదలచుకున్న నీళ్ళు 45 టిఎంసిల కంటే ఎక్కువే. నీటి భరోసా లేని ఈరెండు ప్రాజెక్టులకు నీటి భరోసా రావటమే తప్ప కొత్తగా కరువు తీర్చే ప్రాజెక్టు లేవీ ఈ నీటివల్ల ఒనగూడవు. అయినా ఆ 80 టిఎంసిల తరలింపే పోలవరం ప్రాజెక్టును సమర్థించే ప్రధాన వాదన అయితే దాని కంత భారీ ప్రాజెక్టు ఎందుకు? ఎక్కడ నుంచి ఎత్తి పోసుకుంటే వద్దన్నారు?

మా దృష్టిలో పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించడానికి ఇదే ప్రధాన కారణం- ఆదివాసులు కూడా మనుషులేనని. భుక్తినుం చి ఆచార సంప్రదాయాల దాకా వారి విషయంలో అన్నీ అడ వితో ముడివడి ఉన్నాయి. వారిని అడవి నుంచి వేరు చెయ్యొద్దని వెంకట్రామయ్య అంటున్నారు. షెడ్యూల్డు ప్రాంతంలోనే ఒకొక్కక్కరికి నీటి వసతి ఉన్న భూమి 3 ఎకరాలు ఇవ్వాలని అంటున్నారు. ఇస్తామని ప్రభుత్వం అంటున్నదని కూడా చెప్తున్నారు. నిర్వాసిత ఆదివాసీ కుటుంబాలు 15 వేల దాకా ఉంటాయని అంచనా. ఒకొక్కరికీ 3 ఎకరాలంటే 45 వేల ఎకరాలు. షెడ్యూల్డు ప్రాంతమంతా రిజర్వ్‌ ఫారెస్ట్‌ లోనే ఉంది. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 45 వేల ఎకరాలు వ్యవసాయానికి ఇవ్వడానికి కేంద్రప్రభు త్వం ఒప్పుకుంటుందా? ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యే 9 వేల ఎకరాల అడవికి అనుమతే ఇప్పటికీ లేదు.

అదీకాక ఇంకొక 45 వేల ఎకరాలు వ్యవసాయానికి కేటా యిస్తుందనుకోవడం కల్ల. అదీకాక గత ఏడాది సుప్రీం కోర్టు ఒక కేసులో మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తూ ఒక ఎకరం అడవిని వేరే అవసరాలకు ఇయ్యాలంటే దాని భవిష్యత్‌ విలువను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పింది. ఇక్కడ విలువ అంటే కేవలం అందులో పెరిగే కలప విలువ కాదు. దాని జీవావరణ విలువ. ఆ విలు వను అంచ నా వేయటానికి సుప్రీం కోర్టు ఒక నిపుణుల కమిటీని వేసింది. దాని నివేదిక ప్రకారం ఈ విలువ ఎకరానికి 7నుంచి 10 లక్షల రూపాయల దాకా ఉంటుంది.

7 లక్షలే అనుకున్నా 45వేల ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం 3159 కోట్ల రూపాయలు, వెంకట్రామ య్య ప్రతిపాదించే పునరావాసానికై, కేంద్ర ప్రభుత్నానికి చెల్లించవలసి ఉంటుంది. అంత డబ్బును రాష్ట్రప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది? ఆదివాసులకు షెడ్యూల్డు ప్రాం తంలోనే భూమి ఇచ్చి పునరావాసం కల్పించాలన్నది కేవలం ఒక డిమాండుగా కాక ముందు షరతుగా పెట్టాలని వెంకట్రామయ్యని కోరుతున్నాము. అప్పుడు వారు కూడా ప్రాజెక్టును వ్యతిరేకించినవారవుతారు. మేము అరడజను కారణాల వల్ల వ్యతిరేకించ వచ్చు. వారు ఈ ఒక్క కారణం వల్ల వ్యతిరేకించవచ్చు. ఏమయితేనేం, అందరం వ్యతిరే కించేవాళ్ళమే అవుతాం.

Written by chs

February 4th, 2010 at 9:04 pm

Leave a Reply