Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

సజీవంగా ఉన్న ముఠాతత్వం

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

ముఠా కక్షలు, ముఠా కొట్లాటల గురించి మాట్లాడితే అదేదో పాతకాలం విషయం అయినట్టు గడచిపోయిన విషయాన్ని అనవసరంగా పదే పదే తవ్వితీసి వినోదిస్తున్నారని మీడియాపైన, విశ్లేషకులపైన విరుచుకుపడడం రాయలసీమకు చెందిన నాయకులు ఈ మధ్య నేర్చుకున్నా రు. ప్రతీ హత్యనూ ఫాక్షన్‌ హత్యగా ప్రతీ కొట్లాటనూ ఫాక్షన్‌ కొట్లాటగా వర్ణించే మీడియా అజ్ఞానం కూడ దీనికి దోహదం చేసింది. ఫాక్షన్లు ఇప్పటికీ ఉన్నాయా అంటే మనం దానికి ఇచ్చుకునే అర్థాన్ని బట్టి ఉంటుంది.

గుంపును పోగు చేసి సామాజిక పెత్తనం కోసం బల ప్రయోగం చేసే దురాచారం గా మొదలయి, స్వాతంత్య్రానంతరం రెండవ తరం నుంచి రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం కోసం ముఠాలు కట్టి బల ప్రయోగం చేసే విధ్వంసకర వ్యూహం రూపం తీసుకున్న సంస్కృతిగా దానిని అర్థం చేసుకుంటే అదెక్కడికీ పోలేదు. అవసరాన్ని బట్టి, ఇతర పరిస్థితులను బట్టి, దాని పద్ధతులూ పరికరాలూ మారి ఉండవచ్చు. ప్రతీ చెట్టు చాటున, పుట్ట చాటున టివి కెమెరాలున్న ఈ రోజులలో బాంబులు పట్టుకొని తిరగడం తెలివితక్కువతనం అన్న గుర్తింపు వచ్చి ఉండవచ్చు. ప్రజలలో తెలివితేటలు పెరగడం వల్ల హింస ప్రతిసారీ చేసి చూపించవలసిన అవసరం లేకుండవచ్చు. పెరిగిన తెలివిలో భాగంగా ఆత్మ సంరక్షణకు అవసరమయి న భయం కూడ పెరిగిన కారణంగా బెదిరింపుతో సగం పనులు జరిగిపోతుండవచ్చు.

మొన్నటి ఎన్నికలలో కడప, అనంతపురం జిల్లాలలో రెండు ప్రధాన పక్షాలు నడుచుకున్న తీరు మారిందేమీ లేద ని మరొక్కసారి రుజువుచేసింది. రెండు పక్షాలూ అని నొక్కి చెప్పడం అవసరం, ఎందుకంటే దౌర్జన్యమంతా కాంగ్రెస్‌ వారిదే అన్న అభిప్రాయం ప్రధాన మీడియా బలంగా కలిగించింది. మీడియా అనుకూలంగా ఉండడం వల్ల చంద్రబాబు నాయుడంత ప్రయోజనం పొందుతున్న నాయకుడు సమకాలీన భారత రాజకీయాలలో లేడేమో. అతని అబద్ధా లు, కప్పదాట్లు సునాయాసంగా సాగిపోతున్నాయి. ప్రస్తుత ఎన్నికలలో నోరున్న రెండు ప్రధాన రాజకీయ శక్తులను- వామపక్షాలు, తెరాస-తన వెంట తిప్పుకోవడం వల్ల అతని పని మరీ సులభం అయిపోయింది. ఉదాహరణకు రెండవ దశ పోలింగ్‌ జరిగిన రాత్రి, మరుసటి రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన దౌర్జన్యమంతా జెసి ప్రభాకర రెడ్డి అకౌంట్‌కే జమ చేయబడిందిగానీ నిజానికి ఇద్దరూ యదేచ్ఛ గా హింసకు పాల్పడ్డారు. ఇంకా చెప్పాలంటే మొదలుపెట్టిం ది తెలుగుదేశం వారే. అంతా అయిపోయిన తరువాత తూకం వేస్తే ఎక్కువ హింస చేసిందీ వారే.

అయితే ఈ తూకం దగ్గర ఆగిపోవడమే పొరపాటు అవుతుంది. ఆధిపత్య హింస కేవలం ఒక ఉదంతం కాదు, కాలక్షేపానికి వస్తువు అంతకంటే కాదు. సార్వత్రిక భయం దాని అనివార్య పర్యవసానం. రేపు తాడిపత్రిలో తెలుగుదేశం అభ్యర్థి గెలిచినా, కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచినా రాబోయే అయి దు సంవత్సరాలలో వారి నిర్వాకాన్ని ఆ ఊరి ప్రజలు ధైర్యం గా ప్రశ్నించగలరా? ఏప్రిల్‌ 24నాటి రాళ్ల వర్షాన్ని తలచుకొని నోరునొక్కేసుకోరా? ప్రజాస్వామ్యానికి అవసరమైన అన్ని వ్యవస్థాగతమైన లక్షణాలనూ ఆచరణ రీతులనూ ధ్వంసం చేయడం, అసాధ్యం చేయడం, భయంతో కప్పేయడం హింసాత్మక ముఠారాజకీయాల గుణం. అదే దానివల్ల ప్రజాజీవితానికి ఉన్న ప్రధాన నష్టం.

కడప జిల్లాలో దీని ముఖచిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. హింసాత్మక సంఘటన లు అనంతపురంలో ఎక్కువగా జరగడం వల్ల కడపలో ముఠా రాజకీయాలు గడచిపోయిన కాలానికి చెందినవన్న అభిప్రాయం కలుగవచ్చునుగానీ అది ముఠా రాజకీయాలను కేవలం బాంబుదాడులుగా, గృహ దహనాలుగా అర్థం చేసుకోవడం వల్ల కలిగే భ్రమ. ప్రపంచ జ్ఞానం, తెలివితేటలు పెరగడం వల్ల ప్రజలు ‘ముందుచూపు తో’ మౌనంగా తల ఒగ్గడం ప్రత్యక్ష హింస కంటె బహుశా నష్టకరమైనది.

కడప జిల్లాలో మొదట పులివెందులలోనూ కాలక్రమంలో ఇతర నియోజకవర్గాలలోనూ చెప్పుకోదగ్గ మోతాదులో ఈ స్థితిని తీసుకురావడంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి కృతకృత్యుడయ్యాడు. పులివెందులలో సహితం చాలా గ్రామాలలో రచ్చబండ దగ్గర ప్రజలతో మాట్లాడితే వైఎస్‌ ను వ్యతిరేకించే వాళ్లు చాలామందే ఉన్నారన్న సంగతి అర్థమవుతుంది. అయితే ప్రత్యామ్నాయ నాయకుడు ఎదిగే పరిస్థితి లేనప్పుడు మనం వ్యతిరేకించి ఎందుకు నష్టపోవాలి అన్న ఆలోచనతో అతనికి అనుకూలంగానయినా ఉంటారు లేదా నోరు మూసుకొనయినా ఉండిపోతారు.

ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒక రాజకీయ నాయకుడిని వ్యతిరేకించడానికి ప్రత్యామ్నాయ నాయకుడెందుకు, అతను నిలదొక్కుకోవడం ఎందుకు అన్న ప్రశ్న రావచ్చు. రాజకీయ జీవితం ముఠాలు గా చీలిపోయి వున్న సంస్క­ృతిలో ఈ ఆలోచనకు తావులేదు. బలంగా ఉన్న ముఠాలో భాగం కాకపోతే, కనీసం తటస్థంగా నైనా ఉండకపోతే, మన పని ఏదీ జరగదు, ప్రభు త్వం నుంచి అందవలసినదేదీ అందదు, గ్రామ వనరులలో ఏ వాటా దక్కదు. ఇవేవీ అక్కరలేని అదృష్టవంతులకు వ్యక్తి స్వేచ్ఛ ఆచరణీయం అయి వుండవచ్చును గానీ సాధారణ మానవులకు కాదు.

మరి ప్రత్యామ్నాయ నాయకుడెందుకు ఎదగలేదు? తెలుగుదేశం పార్టీ ఉంది, వామపక్ష పార్టీలున్నాయి, వాటి ఆసరాతో ఎదగలేడా అన్న సందే హం రావచ్చు. ఎదిగితే చంపేస్తారా ఏం అనవచ్చు. అక్కడిదాకా వస్తే ఆ పనీ చేస్తారనడాని కి కావలసినన్ని దృష్టాంతాలు లేకపోలేదు గానీ, అక్కడి దాకా రాకముందే ఉక్కిరి బిక్కిరి చేసి విరమింప చేస్తారు. అతను కాంట్రాక్టరయితే అతనికి కాంట్రాక్టులు దక్కవు. అతని వ్యాపారాలు సజావుగా సాగవు. ముఠా సంస్కృతిలో ప్రభుత్వ ఉద్యోగు లూ భాగమే కాబట్టి మండలాఫీసు నుంచి పోలీస్‌ స్టేషన్‌ దాకా ఎక్కడా అతని పనులు జరగవు.

ప్రజలూ భాగమే కాబట్టి ఊరిలో అతని మనుషుల దైనందిన బతుకులు కూడ దుర్భరంగా తయారవుతాయి. ఇవన్నీ తట్టుకుని ఒక పరిమిత ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా ఎదిగినవారు లేకపోలేదుగానీ అది చాలా కష్టం కాబట్టి పరిమితంగానే ఉండిపోయింది. ఈ స్థితి ఇతరులకు ప్రాబ ల్యం ఉన్న ప్రాంతాలలోనూ ఉంటుందిగానీ అక్కడ మాత్రం తనకున్న అన్ని వనరులూ అవకాశాలూ వెచ్చించి ప్రత్యామ్నాయ నాయకులను ఏరి ప్రోత్సహించడం, ఎదగడానికి సకల వసతులూ కల్పించడం, కొట్లాటలు పెట్టి ప్రత్యర్థిని లొంగదీసుకోవడం వైఎస్‌ అమలు చేసిన వ్యూహం. ఇందు లో ఎప్పటికప్పుడు విజయం సాధించడం అతని సక్సెస్‌ వెనకున్న రహస్యం. ఇది కలిగించగల నష్టానికి తట్టుకోలేని వారు దారిలోనే దాసోహం అంటారు.

ఈ ఎన్నికలలో మైదుకూరు తెలుగుదేశం అభ్యర్థి స్వంత ఊరిలో అతని బంధువులనుంచే కాంగ్రెస్‌ వారు ప్రత్యర్థులను తయారుచేసి చీలికకు బీజం వేయగా, ఆ ఊరికి కడప పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న వైఎస్‌ జగన్మోహన రెడ్డి ప్రచారానికొచ్చినప్పుడు దీనికి నిరసనగా తెలుగుదేశం వారి ప్రోద్బలంతో గ్రామస్తులంతా ఇళ్ళకు తాళాలు వేసి పుణ్యక్షేత్రాలకు వెళ్లి పోయారు. బహుశ అతని ప్రోగ్రాం జరిగితే ప్రత్యర్థులు వచ్చిన వారి అండ చూసుకొని కాలుదువ్వి గొడవ పెట్టుకుంటారన్న భయం కూడ దీనికి కారణం కావచ్చు. కానీ చివరికి పోలింగ్‌ జరిగేనాటికి ఊరి లో మెజారిటీ అయిన తెలుగుదేశం వారు రాజీకొచ్చి అసెంబ్లీకి తెలుగుదేశానికీ పార్లమెంటుకు కాంగ్రెసుకూ వోట్లు వేయించారని వినికిడి. ఇది నిజమయితే వైఎస్‌ వ్యూహాలంటే ఎంత భయమో అర్థం అవుతుంది.

ఆ ఒక్క నియోజకవర్గంలోనే కాదు ఫాక్షనిస్టులు నిలబడ్డ అన్ని నియోజకవర్గాలలోనూ ఇరు పార్టీల వైఖరీ ఒకటే. తమ కు ప్రాబల్యం ఉన్న గ్రామాలకు ఇతరులు ప్రచారానికి రావడానికి వీలులేదు. కానీ ఇతరులకు ప్రాబల్యం ఉన్న గ్రామాలకు తాము పెద్ద గుంపును తీసుకొని రచ్చ చేస్తూ ప్రచారానికి పోతారు. అట్లా వచ్చిన వారిపైన ప్రత్యర్థులు గతంలో బాం బులు వేసేవారేమో గానీ ఇప్పుడు తెలివిగా తమ అనుచరులలోని స్త్రీలనూ దళితులనూ రంగంలోకి దింపి వాళ్లచేత తిట్టిస్తున్నారు. రాళ్లు వేయిస్తున్నారు. దెబ్బలు తింటే ఈ ప్రజలు తింటారు. ప్రత్యర్థులపైన స్త్రీని అసభ్యంగా అవమానించార నీ, దళితులను కులం పేరు పెట్టి దూషించారనీ కేసు అవుతుంది. ఈ సిగ్గుమాలిన ఎత్తుగడను కడప జిల్లాలో రెండు పార్టీలూ వాడుకున్నాయి.

దురదృష్టమేమిటంటే ప్రజల ఆలోచనలు కూడ ఈ సంస్క­ృతిలో భాగమే. ఎవరికి ఆధిపత్యం ఉన్న గ్రామాలలో వారికి మాత్రమే స్వేచ్ఛ ఉంటుం ది. ఇతరులు ‘తమ’ గ్రామాలకు పరిమితం కావాలి. అధికారంలో ఉన్న వారు తమ వారికి మాత్రమే చేసుకుంటారు. ఇతరులు తమ ముఠా నాయకుడు అధికారానికొచ్చేదాకా ఆగాలి. ప్రభుత్వ అధికారులు అధికారంలో ఉన్న వారి పను లే చేస్తారు తప్ప వారి ప్రత్యర్థులకు న్యాయం చేయరు. ఇవ న్నీ సహజమైన విషయాలుగా, ఇవే జీవితనియమాలుగా సగటు ప్రజలు స్వీకరిస్తున్నారు. దురదృష్టం కొద్దీ దీనిని పోగొట్టే రాజకీయ కృషి ఏదీ రాయలసీమలో లేదు. ఎవరూ చేపట్టడం లేదు. అది జరిగేంతవరకు ముఠా సంస్క­ృతి, రాజకీయాలలో ముఠా తత్వం వర్ధిల్లుతూనే ఉంటాయి.

Written by chs

February 4th, 2010 at 9:13 pm

Leave a Reply