Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

భావజాల శృంఖలాలలో న్యాయ వ్యవస్థ

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

రెండు దశాబ్దాల కింద కేరళ రాష్ట్రం నుంచి ఒక కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. వేసినవారు ముగ్గురు విద్యార్థులు. వాళ్ల స్కూలు వాళ్లను బర్తరఫ్‌ చేసిందని వాళ్లు కోర్టు కు వెళ్లారు. ఎందుకు బర్తరఫ్‌ చేసిందంటే వాళ్లు జాతీయగీతం ఆలపించడానికి నిరాకరించారని. ఎందుకు నిరాకరించారంటే దేశభక్తి అనేది కొరవడటం వల్ల కాదు. వాళ్లు ఆచరించే క్రైస్తవ మతశాఖ దేవుడిని తప్ప మరెవరినీ స్తోత్రం చేయవద్దని చెప్తుందట. అందువల్ల ఈ పిల్లలు స్కూలులో ‘ప్రేయర్‌’ జరిగే సమయంలో అందరితో బాటు లేచి నిలబడతారు. వినయంగా తలదించుకుంటారు.

కానీ ‘జనగణమన’ మాత్రం పాడరు. అది దేశభక్తికీ స్కూలు నియమాల కూ విరుద్ధం అని చెప్పి వారి స్కూలు యాజమాన్యం వారి ని ఇంటికి పంపించింది. వారు కోర్టుకెక్కగా కేరళ హైకోర్టు స్కూలు యాజమాన్యం చర్యను సమర్థించింది. విద్యార్థులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. తమకు దేశమన్నా దేశ అధికారిక చిహ్నాలన్నా ఎంత మాత్రం అగౌరవం లేదనీ అయితే తాము నమ్మే క్రైస్తవ మత శాఖ వేరెవరినీ స్తోత్రించడం ఒప్పుకొనదనీ కాబట్టి జాతీయగీతం పాడకుండా ఉండే స్వేచ్ఛ తమకు ఉందనీ వాదించారు.

సుప్రీంకోర్టు వారి వాదనను సమర్థించింది. ‘వారిది వికారమైన చేష్ట కాదు, మనస్ఫూర్తిగా నమ్మే విశ్వాసం’ అనీ, ‘ఒకని విశ్వాసం మనకు వింతగా తోచవచ్చు. కానీ అది నిజాయితీగా నమ్మేదయితే ఆ స్వేచ్ఛను గౌరవించాలి’ అనీ జస్టిస్‌ చిన్నపరెడ్డి అన్నారు. సహ విద్యార్థులు జాతీయ గీతం ఆలపించేటప్పుడు వారు గౌరవంగా నిలబడుతున్నా రే తప్ప అగౌరవం ప్రదర్శించడం లేదనీ, అటువంటప్పుడు తమ మత విశ్వాసాల కారణంగా తాము దాన్ని ఆలపించకుండ ఉండడాన్ని రాజ్యాంగం ఆమోదించిన మతస్వేచ్ఛగా గుర్తించాలనీ అన్నారు. ‘మౌనంగా ఉండడం కూడ భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమే’ నన్నారు. ‘మన రాజ్యాంగం సహనాన్ని ఆదేశిస్తుంది. దానిని నీరుగార్చవద్దు’ అన్నారు.

ఇవాళ చాలా దూరం వచ్చాము. జాతీయ గీతం ఆలపించకపోవటం కాదు, విద్యార్థులంతా నున్నగా గడ్డం చేసుకోవాలని చెప్పే నియమాన్ని అతిక్రమించినందుకు సీటు రద్దు చేసి ఇంటికి పంపించిన చర్యను కూడ సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ విద్యార్థి ముస్లిం అనీ గడ్డం పెంచుకోవడం అతని మతాచారంలో భాగమనీ విద్యాలయ నియమాల పేరిట రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను నిరాకరించడానికి వీలులేదనీ అతని తరపున న్యాయవాది అనగా, ‘లౌకికవాదాన్ని మరీ దూరం తీసుకుపోవద్దు’ అని జస్టిస్‌ మార్కండేయ కట్జూ అన్నారు. పైగా ఆ న్యాయవాదితో ‘నువ్వు కూడ ముస్లింవేగానీ నీకు గడ్డం లేదు కదా’ అని చమత్కరించారంట.

ఇరవై ఏళ్ల నాడు సుప్రీంకోర్టు గుర్తించినట్టు ఇక్కడ మత స్వేచ్ఛే కాదు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛా ఉంది. ఒక విద్యార్థి ముస్లిం కాకపోయినా, తన ఇష్టం కారణంగా గడ్డం పెంచుకోవచ్చు. విద్యార్థులు శుభ్రంగా ఉండాలని (సహ విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా )నియమం పెట్టే అధికారం యాజమాన్యానికి ఉండగలదు గానీ, గడ్డం పెంచుకోవచ్చా, అమ్మాయిలు బొట్టు పెట్టుకోవచ్చా, కుర్రవాళ్లు క్రాఫు చేసుకోకుండ పగిడీ పెట్టుకోవచ్చా వగైరా నియమాలు పెట్టే అధికారం ఏ విద్యాలయం యాజమాన్యానికయినా ఎందుకు ఉండాలి? ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే జస్టిస్‌ మార్కండేయ కట్జూ కొంచెం చదువుకున్న వ్యక్తి. మామూలుగా న్యాయమూర్తుల చదువు వారి వృత్తిసంబంధమైన అధ్యయనం దగ్గర ఆగిపోతుంది.

అది తరచుగా కోర్టులిచ్చే తీర్పుల మీద దుష్ప్రభావం వేస్తుంది. (భారీ ప్రాజెక్టుల వల్ల కలిగే విస్థాపన మీద జరుగుతున్న చర్చ గురించి ఏమీ తెలుసుకోకుండ సర్దార్‌ సరోవర్‌ కేసులో అప్ప టి దేశ ప్రధాన న్యాయమూర్తి, భాక్రానంగల్‌ నుంచి నాగార్జునసాగర్‌ దాకా పెద్ద డ్యాంల నిర్వాసితులంతా ముంపు ముందుకంటే తర్వాతే బాగున్నారని ప్రకటించడం న్యాయవ్యవస్థలోని ఈ వెలితి గురించి తెలియని వాళ్లను మాత్రమే ఆశ్చర్యపరిచింది). జస్టిస్‌ కట్జూ అందుకు కొంత మినహాయింపు. ఆయన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం మొదలయిన విషయాల మీద జడ్జిగా కాకుండ విశ్లేషకుడిగా తరచుగా మాట్లాడుతుంటాడు, రాస్తుంటాడు. ప్రజాస్వా మ్య స్పూర్తినే వ్యక్తం చేస్తుంటాడు.

ఇక్కడ నిజానికి రెండు సమస్యలున్నాయి. ప్రజాస్వామ్యాన్ని గొప్పగా శ్లాఘించడం, మనది ప్రజాస్వామ్య దేశమని గర్వించడం (ముఖ్యంగా ఎన్నికలప్పుడు) ఎంతగా పెరిగిందో దాని వ్యక్తీకరణ పట్ల అసహనమూ అంత పెరిగిం ది. ఎన్నికలప్పుడు ఒక నెలరోజుల పాటు దేశంలోని ప్రతీ ప్రముఖుడి, ప్రముఖురాలి చేతి వేలి మీది ఇంకుచుక్కను టీవీలోనూ పత్రికలలోనూ వెగటు పుట్టేంతగా మనకు చూపిస్తారు. ఇది గొప్ప ‘విజువల్‌’ అని మీడియాకు ఎవరు చెప్పారో తెలీదుగానీ ఈ ప్రదర్శన సార్వజనీనం అయింది. అయితే వోటు వేసి వేలికి ఇంకుచుక్క పెట్టించుకోవడం అన్న ఈ ఒక్క ప్రజాస్వామ్య వ్యక్తీకరణ పట్ల మాత్రమే దేశంలో సహనం, గౌరవం మిగిలాయి. తక్కిన వాటి పట్ల అసహనం న్యాయస్థానాలలోనూ సమాజంలోనూ చాలా పెరిగింది. అభివృద్ధి, దేశ సమగ్రత అనే రెండు లక్ష్యాలకు ప్రజాస్వా మ్య వ్యక్తీకరణను ఆటంకంగా, అవరోధంగా చూడడం సాధారణం అయింది.

ప్రజాస్వామ్య మంటే అందరికీ ప్రేమే గానీ మన దారికి అడ్డంగా ఎవరయినా ఊరేగింపు తీస్తుంటే విసుక్కుంటాం. నగర జీవితానికి ఈ ఆటంకాలేమిటి అని అసహనంగా తిట్టుకుం టాం. ఫలాన వాళ్ల ఊరేగింపును నిషేధించమనీ ఇంకొకరి సమ్మెను నిషేధించమనీ ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోర్టులో కేసులు వేస్తాం. ఒకరి స్వేచ్ఛను హరించమ ని ఇంకొకరు కోర్టులో కేసు వేయడమేమిటని న్యాయస్థానాలు ఆ వ్యాజ్యాలను తిరస్కరించే బదులు ‘ప్రజా ప్రయోజన’ వ్యాజ్యాలుగా స్వీకరిస్తున్నాయి. ఎందుకింకా నిషేధించలేదని ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. అంతకంటే భాగ్యమా అని కోర్టు ప్రశ్ననే ఆదేశంగా స్వీకరించి ప్రభుత్వం పోలీసులను దించుతున్నది.

మళ్లీ మూడు దశాబ్దాలు వెనక్కి పోదాం. ఆల్‌ ఇండి యా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ వారి ఊరేగింపుకు అహ్మదాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అనుమతి నిరాకరించడాన్ని సవాల్‌చేస్తూ ఆ సంస్థ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆ కేసులో మొట్ట మొదటిసారిగా సుప్రీంకోర్టు రహదారిపైన ఊరేగిం పు తీయడం ప్రాథమిక హక్కు అనీ దానిని హేతుబద్ధంగా నియంత్రించే అధికారం మాత్రమే పోలీసులకు ఉందనీ చెప్పింది. ఈ నిర్ణయానికి రావడానికి సుప్రీంకోర్టు రెండు ఆసక్తికరమయిన వాదనలు చేసింది.

వేరే దేశాల సంగతి ఎట్లాగున్నా భారతదేశంలో పండగలప్పుడు, పెళ్లిళ్లప్పుడు, చావులప్పుడు రహదారిపైన ఊరేగింపు తీయడం అనాదిగా ఉన్న సంప్రదాయమనీ రాజ్యాంగం దానిని నిషేధించలేదనీ అనింది (అనాదిగా ఉన్న ప్రజాస్వామిక సంప్రదాయాలను హక్కులుగా గుర్తించాలన్న ఈ అభిప్రాయాన్ని న్యాయస్థానాలు మళ్లీ ప్రయోగించాయో లేదో గానీ అది ‘అభివృద్ధి’లో చిక్కుకున్న ఆదివాసులకూ మత్స్యకారుల కూ చాలా మేలుచేయగల సూత్రీకరణ). రెండవది, రాజ్యాంగం ఊరేగింపును ప్రాథమిక హక్కుగా గుర్తించలేదుగానీ పదిమంది శాంతియుతంగా ఒకచోట గుమిగూడడాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించింది, దేశంలో ఎక్కడి నుంచయినా ఎక్కడికయినా పోయే స్వేచ్ఛను కూడ ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ రెండిటినీ కలుపుకుంటే ఊరేగింపు తీయడం ప్రాథమిక హక్కేననింది సుప్రీం కోర్టు. ప్రజాస్వామ్య వ్యక్తీకరణ హక్కులను పెంపొందించడానికి కోర్టులు ఇంత శ్రద్ధగా తర్కించిన సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ కనబడవు.

రెండవ సమస్య, పరిపాలనలో ఉండే కష్టాల పట్ల న్యాయస్థానాలలోనూ సమాజంలో నోరున్న వర్గాలలోను సానుభూతి పెరిగిపోవడం. బలహీనులయిన ప్రజలకు న్యాయం చేయడంలో ఉండే కష్టాలపట్ల సానుభూతికాదు. ఆ సానుభూతి అవసరము, న్యాయస్థానాలకయితే రాజ్యాంగం నిర్దేశించే కర్తవ్యం కూడ. పెరుగుతున్నది అదికాదు. అభివృద్ధికీ దేశ సమగ్రతకూ అవసరమయిన ‘క్రమశిక్షణ’ను సమాజంలో నెలకొల్పడంలో పాలకులు ఎదుర్కొనే సమస్యల పట్ల సానుభూతి పెరుగుతున్నది. న్యాయమూర్తులు తరచుగా ఈ సానుభూతిని వ్యక్తం చేస్తుంటారు. ఇది పూర్తిగా అవాంఛనీయం. వ్యక్తులుగా వారికి ఏ అభిప్రాయమైనా ఉండవచ్చును గానీ జడ్జిలుగా వారి కర్తవ్యం అది కాదు.

ఏ కారణంగా ప్రభుత్వం సమాజంలో ‘క్రమశిక్షణ’ పెంపొందించాలని చూసినా ఆ క్రమంలో ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకూ భౌతిక స్వేచ్ఛకూ జరగగల హాని గురించి ఆందోళన చెందడం , దానిని నివారించడమే న్యాయస్థానాల కర్తవ్యం. యుద్ధ సమయంలో యుద్ధ అవసరాలను చూపిం చి స్వేచ్ఛను హరించిన ప్రభుత్వ చర్యలనూ ఆదేశాలనూ నిలిపివేసిన న్యాయస్థానాలకే చరిత్రలో గౌరవం లభించిం ది. అటువంటి పరిస్థితేమీ లేకపోయినప్పటికీ కేవలం మధ్యతరగతి అభివృద్ధి దాహానికీ, తెచ్చి పెట్టుకున్న దేశ విచ్ఛిత్తి భయానికీ న్యాయస్థానాలు లోనయి ఈ స్ఫూర్తికి దూరం కావడం, ప్రజాస్వామ్య వ్యక్తీకరణ పట్ల అసహనం ప్రదర్శించడం, అత్యంత ఆందోళనకరం.

Written by chs

February 4th, 2010 at 9:23 pm

Leave a Reply