Remembering K Balagopal

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

శ్రీలంక తమిళుల భవిష్యత్తేమిటి?

without comments

కె. బాలగోపాల్‌ (Source: Andhra Jyothy)

గడచిన ఆరు నెలలలో శ్రీలంకలో జరిగిన ఘటనలకు భారతదేశ పౌర సమాజం స్పందించలేదన్న ఫిర్యాదు బాధిత తమిళుల నుంచే కాదు, శ్రీలంకకు చెందిన మానవహక్కుల ఉద్యమకారుల నుంచి కూడ వచ్చింది. మనం తప్పు ఒప్పుకోవలసిందే. అయితే రాబోయే దినాలలో ఈ స్పందన అవసరం ఇంకా ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి తప్పొప్పుకోవడమే కాదు, సవరించుకునే అవకాశమూ ఉంది.

ఎల్‌టిటిఇని అణచివేయడం అయిపోయింది కాబట్టి ఇంక శ్రీలంక ప్రభుత్వం తమిళుల ఆకాంక్షలు తీర్చడానికి పూనుకుంటుందన్న అభిప్రాయం ఆ ప్రభుత్వమే కాక మీడి యా కూడ మనకు కల్గిస్తున్నది. ఏ మాత్రం ఇంగితం ఉన్నా ఆ దేశ పాలకులు అందుకు పూనుకోవడం సహజం కాబట్టి మనం సులభంగా నమ్ముతున్నాం. అయితే ఇది అత్యంత సందేహాస్పదమైన విషయం ఎందుకంటే శ్రీలంక భూభాగం బౌద్ధ సింహళీయులకే చెందుతుంది అన్నది ఆ దేశ అధికార రాజకీయాల భావజాలం.

అదొక రాజకీయ వైపరీత్యం కాదు, అన్ని రాజకీయ పార్టీల సామాన్య దృక్పథం. ఎల్‌టిటి ఇ యుద్ధ సామర్థ్యం కారణంగా 1987లో ఒకసారి, 1995 లో ఒకసారి, 2002లో ఒకసారి శ్రీలంక ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ ప్రతిపాదనలు చేయడానికి లేదా చర్చించడానికి సిద్ధపడిన మాట వాస్తవమే గానీ నిజంగా దానిని అమ లు చేసి సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించుకునే ఉద్దే శ్యం వారికి ఉండిందా, లేక వేర్పాటుకు తప్ప వేరే పరిష్కారానికి ఎల్‌టిటిఇ ఒప్పుకోదు కాబట్టి నెపం ప్రభాకరన్‌ మొండితనంపైన నెట్టేసే ఎత్తుగడగా ఆ ప్రతిపాదనలు చేశారా అంటే రెండవ సమాధానం వైపే వాస్తవికమయిన పరిశీలన మొగ్గు చూపవలసి ఉంటుంది.

ఇది ఆయా సందర్భాలలో ఆ ప్రతిపాదనలు చేసిన దేశా ధ్యక్షుల నిజాయితీకి సంబంధించిన విషయం కాదు. పాలనాబాధ్యతలు చేబట్టిన వారు అప్పుడప్పుడు కొంత సంయమనం పాటించక తప్పదు. అయితే తమిళులకు శ్రీలంక భూభాగంలో సమాన హక్కులు కల్పించే ఏ చర్యనయినా అమలు చేసే ప్రయత్నం చేసినట్టయితే దానికి శ్రీలంక సమాజంలో-ప్రత్యేకించి బౌద్ధ మత పెద్దలనుంచి- రాగల జాత్యహంకార వ్యతిరేకతను ఎదుర్కొని నిలబెట్టే సంసిద్ధత ప్రధా న పార్టీలయిన ఎస్‌ఎల్‌ఎఫ్‌పిలో గానీ, యుఎన్‌పిలో గానీ ఉందని నమ్మడానికి దాఖలాలు లేవు. భారత రాజకీయాల లో గనక అన్ని పార్టీలూ విశ్వహిందూపరిషత్‌ స్వాములకు భయపడి పరిపాలిస్తున్నట్టయితే మైనారిటీల మనుగడ గురించి వారు చేసే విధాన ప్రవచనాలు మనం ఏ మేరకు నమ్మగలుగుదుమో అన్న పోలిక చెప్పుకుంటే విషయం అర్థం కావచ్చు.

ప్రభాకరన్‌లో రాజకీయ చాతుర్యం లోపించడం శ్రీలంక తమిళులకు నష్టం చేసిందన్న అభిప్రాయం చాలామంది పరిశీలకులు వ్యక్తం చేశారు. రాజకీయ పరిష్కారం గురించి ఒత్తి డి వచ్చిన సందర్భంలో, నిజంగా న్యాయమైన రాజకీయ పరిష్కారాన్ని రూపొందించి అమలు చేసే సంసిద్ధత శ్రీలంక పాలకులలో లేదన్న విషయాన్ని బయటపెట్టే పద్ధతిలో స్పందించే బదులు, రాజకీయ పరిష్కారానికి ఎల్‌టిటిఇ సిద్ధం కాదని శ్రీలంక పాలకులు ప్రచారం చేయడానికి అనుకూలించే పద్ధతిలో వ్యవహరించాడు. అదే ఎక్కువగా ప్రచా రం అయింది. శ్రీలంక ప్రభుత్వం లోతయిన వికేంద్రీకరణనూ స్వయం పాలననూ తమిళులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభాకరన్‌ యుద్ధ తంత్రం ద్వారా తమిళుల విముక్తిని సాధించాలన్న మొండి పట్టుదలతో ఆ ప్రయత్నాలను తిరస్కరించాడన్న అభిప్రాయం విస్త­ృతంగా ప్రచారం అయింది.

ప్రభాకరన్‌ మొండితనం నిజమే గానీ వీళ్ల సంసిద్ధత అబద్ధం. ఇప్పు డు ఎల్‌టిటిఇ లేదు కాబట్టి అది పరీక్షకు నిలబడుతుంది. 1987లో అప్ప టి భారత ప్రభుత్వం ఒత్తిడిమేరకు జరిగిన ఒప్పందాన్ని అమలు చేస్తామని అంటున్నారట! ప్రస్తుత భారత పాలకులు కూడ దానినే పరిష్కారంగా సూచిస్తున్నట్టున్నారు. ఆ నాడు ఆ ఒప్పందం ఫలితంగా శ్రీలంక రాజ్యాంగానికి 13వ సవర ణ జరిగింది. అది జరిగి రెండు దశాబ్దాలు దాటింది. దానిని అమలు చేయకుండ శ్రీలంక పాలకులను తమిళులు ఆపలేదు. కానీ దానిని అమలు చేయలేదు.శ్రీలంక రాజ్యాంగం ఆ దేశ ప్రభుత్వానికి, ప్రత్యేకించి నేరుగా ఎన్నుకోబడే అధ్యక్షునికి ఇచ్చిన విస్త­ృత అధికారాలను సడలించకుండ 13వ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళ ప్రాంతాలకు అధికార వికేంద్రీకరణ చేశారు. కాబట్టి అదిచ్చే స్వయం ప్రతిపత్తి చాలా పాక్షికంగా ఉండబోతుంది. కానీ అదయినా చేస్తారా అంటే అనుమానమే.

శ్రీలంక సమాజంలో ప్రజాతంత్ర శక్తులేవయినా బలం గా ఉండి ఉంటే అటువైపు నుంచి తమిళులకు న్యాయం చేయమన్న ఒత్తిడి లేదా కనీసం జాత్యహంకారులకు లొంగకూడదన్న ఒత్తిడి ఉండేదేమో. కానీ ఆ సమాజంలో ప్రజాతంత్ర శక్తుల బలం చాలా పరిమితం. 1970-71 సంవత్సరాలలో పేద వర్గాల యువతను పునాది చేసుకున్న జనతా విముక్తి పెరుమణ (జెవిపి)అనే కమ్యూనిస్టు భావాలు గల సంస్థ ఒక పెద్ద తిరుగుబాటు లేవదీసింది. దాన్ని శ్రీలంక ప్రభుత్వం చాలా క్రూరంగా అణచివేసింది. 10 వేల మంది దాకా చనిపోయారని అంచనా. 1980ల చివరి భాగంలో వారు మరొక్కసారి తిరుగుబాటు చేయగా అంతకు రెండు మూడు రెట్లు ఎక్కువ ప్రాణనష్టం జరిగింది, అయితే జెవిపి శ్రీలంక దక్షిణ ప్రాంతంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఇవ్వాళ్టికీ ఉంది. ఒక పార్టీగా ఎన్నికల రాజకీయాలలో ఉంది.

ఆ పార్టీ కమ్యూనిస్టు పార్టీగానే కొనసాగివుంటే, లెనిన్‌ కాలం నుంచి జాతుల ఆకాంక్షలకు కమ్యూనిస్టు సిద్ధాంతంలో ఉన్న గుర్తింపు సింహళ ప్రజానీకం ఆలోచనా రీతులలో విస్త­ృతం గా భాగం అయివుండేది, తమిళుల ఆకాంక్షల న్యాయమైన పరిష్కారానికి సింహళీయులలోనూ ఆ మేరకు మద్ద తు దొరికేది. దురదృష్టవశాత్తు, జెవిపి ఇతర విషయాలలో కమ్యూనిస్టు పరిభాష నింకా విడిచిపెట్టలేదు గానీ సిం హళీయ జాత్యహంకారాన్ని ఒంట బట్టించుకుంది. శ్రీలంక రాజకీయాల లో బౌద్ధ భిక్షువుల తరపున మెజారిటీ దురహంకారానికి బౌద్ధ భిక్షువుల సరసన అత్యంత మిలిటెంట్‌ ప్రతినిధిగా మారింది. ఇక చిన్నాచితకా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాతంత్ర భావాలుగల బుద్ధి జీవు లు సింహళీయులలో లేకపోలేదుగానీ వారి ప్రభావం చాలా బలహీనమైనది. శ్రీలంకలో బుద్ధి జీవులు వివిధ విషయాల గురించి జరుపుకునే సంవాదాలలో లోతయిన సిద్ధాంత వివేచన ఉంటుందనీ మన దేశంతో పోలిస్తే ఆ సమాజపు మేధో ప్రమాణాలు ఉన్నతమైనవనీ తెలిసిన వారు అంటారు. అదే నిజమయితే సంతోషించదగ్గ విషయమే గానీ ప్రస్తుత అవసరానికి దాని నుంచి రాగల ఆసరా స్వల్పమే.

శ్రీలంక పాలకు ల ఉద్దేశ్యాల విషయానికొస్తే, 2004 సునామీలో భారీగా దెబ్బ తిన్న దేశ ఉత్తర, ఈశాన్య ప్రాంతపు భూములను అమెరికా, భారత్‌ల సహాయంతో పునరావాసయోగ్యం చేసిన తరువాత కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించే ప్రయోగమేదయితే నడుస్తున్నదో, ఎల్‌టిటిఇని తుద ముట్టించడానికి ఖాళీచేసిన అదే ప్రాంతపు భూములనూ గ్రామాలనూ ఆ ప్రయో గంలో భాగం చేస్తారనీ, అక్కడి నుంచి ప్రభుత్వ క్యాంపులకు తరలించిన తమిళులకు వేరేచోట పునరావాసం కల్పిస్తారనీ, లేదా సింహళీయులను ఖాళీ అయిన ప్రాంతాని కి తరలించి ఇజ్రాయెల్‌ నమూనాలో మెజారిటీ వర్గం సెటిల్‌మెంట్లు సృష్టిస్తారనీ అనుమానం. స్వయం ప్రతిపత్తి పేరిట కిందిస్థాయిలో కొంత అధికార వికేంద్రీకరణ చేపట్టి, పైన మాత్రం దేశాధ్యక్షుని పాలనాధికారాన్ని కొనసాగించడం ద్వారా దానికి పరిమితులు విధించి, చేతులు దులిపేసుకోవచ్చు.

దీనిని ఎదుర్కోగల బలమైన రాజకీయ శక్తి ఏదీ శ్రీలంక తమిళులలో ఈరోజు లేకపోవడానికి ఎల్‌టిటిఇ బాధ్యత చాలా ఉంది. శ్రీలంక జాత్యహంకార పాలకులకు వ్యతిరేకం గా ఎల్‌టిటిఇ వీరోచితమైన పోరాటం చేసిన మాట వాస్తవ మే. మానవ బాంబు వంటి అత్యంత సందేహాస్పదమైన ‘పోరాట రూపాన్ని’ మానవాళికి ఇచ్చిన ఘనతనూ, ఆ మానవ బాంబులను బజార్లో ప్రయోగించి నిరాయుధులయిన పౌరులను హతమార్చిన ఘనతనూ కూడ మూటగట్టుకున్నప్పటికీ, క్రూరమైన శ్రీలంక రాజ్యానికి వ్యతిరేకంగా క్రూరమైన పోరాట రూపాలను అనుసరించక తప్పలేదని వాదించడానికి ఎల్‌టిటిఇకి అవకాశం లేకపోలేదు.

అయితే తమిళ ప్రజానీకానికి తానే ఏకైక ప్రతినిధిననీ, తాను చెప్పినట్టు తమిళ ప్రజలు నడుచుకోవాలనీ, తనకు ప్రత్యర్థులు కాదు సరికదా ప్రత్యామ్నాయం సహితం తమిళ సమాజం లో ఉండడానికి వీలులేదనీ శాసించడంలో ఎల్‌టిటిఇ అంతే క్రూరంగా వ్యవహరించింది. ఎల్‌టిటిఇ అనుమతి లేకుండ తమిళులు దక్షిణాదికి పోవడానికి వీలులేదు. ఎంతమంది పిల్లలను ‘పోరాటానికి’ ఇమ్మంటే అంతమందినీ ఈయవలసిందే, ముక్కుపచ్చలారని పిల్లలను సహితం ఈయవలసిం దే. తన కార్యకర్తలకు కవచంగా ఉండమంటే ఉండవలసిం దే. ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమాలన్నిటినీ ఎల్‌టిటిఇ భౌతికంగా అణచి వేసింది. నాయకులను చంపింది.

తమిళ జాతికి నిన్ను నియంతగా ఎవరు నియమించారు అని ప్రశ్నించిన జాఫ్నా విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు, మానవ హక్కుల కార్యకర్త అయిన రజని తిరనగమను సహి తం చంపింది. తమిళం మాట్లాడే ముస్లింలను ఉత్తర ప్రాం తం నుంచి పెద్ద సంఖ్యలో తరిమేసింది. చివరికి తాను పోయిన తరువాత ఎవరూ లేకుండ చేసింది. అందుకే ఈ సమయంలో శ్రీలంక ప్రభుత్వంపైన బలమైన ఒత్తిడి ప్రపం చదేశాల నుంచి రావాలి. ప్రపంచ దేశాలకు-భారత్‌తో సహా- అవకాశవాదం తప్ప వేరే ఏ రాజనీతీ లేదు కాబట్టి ఇది జరగాలంటే పౌర సమాజాల నుంచి గట్టి కృషి అవసరం.

Written by chs

February 4th, 2010 at 9:26 pm

Leave a Reply