బాలగోపాల్ ఙ్ఞాపకాలు
కాత్యాయని విద్మహే (http://www.pranahita.org/2010/01/balagopal_gnapakalu)
2009 అక్టోబర్ 8, రాత్రి పదిన్నర , బాలగోపాల్ ఆరోగ్యం బాగాలేదు అన్న వార్త టి.విలో చూడటానికి, ఆయన మనకిక లేడన్న వార్త వినటానికి మధ్య ఎడంలేదు. బాలగోపాల్ మరణాన్ని తట్టుకోలేక , చెప్పలేక పెద్దపెట్టున ఏడ్చేసిన నామిత్రుడు పొరుగింటి బుర్రారాములు దుఃఖం లో నేను కూడా………. మానవహక్కుల ఉద్యమపుకాడిని రాములు ఒక్కడి భుజం మీద వదిలేసి బాలగోపాల్ ఎందుకలా వెళ్ళిపోవలసి వచ్చిందని ఎవరి మీదో తెలియని ఏదోకోపం………….. అక్రోశం………………
బాలగోపాల్ గణిత శాస్త్ర అధ్యాపకుడుగా కాకతీయ విశ్వవిద్యాలయం కాంపస్ లో నాకు సహోద్యోగి మంచి టీచర్ గా విద్యార్థులలో ఆయనకు బాగా పేరుండేది. ఎవరూ పట్టనట్టు, తనలో తానేదో గుణించుకొంటున్నట్టు కాంపస్ లో తిరిగే బాలగోపాల్ ను చూచి అది గణితశాస్త్ర మేధావి లక్షణమనుకొన్నామే కానీ హక్కుల ఉద్యమ నిర్మాణానికి వ్యూహారచనలో వున్నాడని పౌరహక్కుల ఉద్యమ పనిమంతుడయ్యాక కానీ తెలిసిరాలేదు. రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రారంభమైన పౌరహక్కుల ఉద్యమాన్ని విస్తృతీకరించటంలోను, తాత్త్వీకీకరించటంలోనూ ఆయన చేసిన కృషి గొప్పది.
పౌరహక్కుల గురించి మాట్లాడేటప్పుడు పౌరులలోభాగంగా స్త్రీలున్నారని గుర్తించాలని , రాజ్యహింసను కూడా సంబోధించాలని యు.వింధ్య వంటి వాళ్ళు పౌరహక్కుల సంఘంలో చర్చ పెట్టినప్పుడు బాల గోపాల్ దానిని పూర్తిగా ఆమోదించాడు.1990లో ఆ మేరకు విజయవాడలో పౌరహక్కుల సంఘం సమావేశం కూడా జరిగింది.’ స్త్రీల హక్కులన్నీ మానవ హక్కులే’ నన్న నినాదంతో సాగిన ఆనాటి సదస్సులో వరంగల్లు నుండి నేను, జ్యోతిరాణి వెళ్ళి పాల్గొన్నాం. ఆనాటి నుండి బాలగోపాల్ స్త్రీల హక్కుల విషయంలో నిత్య జాగురూకుడుగానే వున్నాడు. భారతదేశంలో వర్ణానికి , వర్గానికి మధ్య వున్న సంబంధాన్ని గురించి లోతుగా పరిశోధించి వ్రాసిన బాలగోపాల్ వర్ణానికి జెండర్ కు వున్న సంబంధాన్ని కూడా స్పష్టంగానే గుర్తించి చెప్పాడు. 2005లో నేను, జ్యోతి రాణి, బుర్రారాములు కలిసి కౌటిల్యుని అర్థశాస్త్ర్తం , మనుస్మృతి , వాత్సాయన కామసూత్రలు, నాట్య శాస్త్రం – అన్న నాలుగు రచనలపై మహిళల జీవిత కోణం నుండి వ్రాసిన “ప్రాచీన భారత రాజకీయార్థిక నిర్మాణాలను ప్రతిబింబించిన రచనలు మహిళల జీవితం ” అనే పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో బాల గోపాల్ వర్ణ ఆధిక్యతకు, లైంగిక అణచివేతకు వున్న సంబంధాన్ని చర్చించాడు. పురుష స్వామ్యం గురించి మాట్లాడటం అంటే వర్ణ ధర్మాన్ని ప్రస్తావించటం తప్పని సరి అంటాడు. ఈ పుస్తకావిష్కరణలో సభలో కూడా పాల్గోని బాలగోపాల్ మాట్లాడటం మాకొక మంచి ఙ్ఞాపకం.
పౌరహక్కుల ఉద్యమం రాజ్యహింసను మాత్రమే సంబోధిస్తే సరిపోదని, తదితర హింసలను గురించి మాట్లాడక పోతే పౌరన్యాయం దెబ్బతింటుందని నమ్మి, నమ్మిన దానిని మాట్లాడి పౌరహక్కుల సంఘం నుండి బయటకు వచ్చిన బాలగోపాల్ మానవహక్కుల ఉద్యమాన్ని మరింత విస్తృత ప్రాతిపదిక మీద నిర్మించటానికి కృషి చేస్తూ వచ్చాడు. ఆ క్రమంలో దేశమంతా తిరుగుతూ బాధితుల పక్షాన నిలబడి, వాదించి ఓదార్పునిచ్చాడు. బాలగోపాల్ ప్రస్థానంలో ఇదొక కీలకాంశం అయితే, హక్కుల ఉద్యమ తాత్వ్తికత నుండి ఒక విమర్శనాత్మక దృక్పధంతో నక్సలైట్ ఉద్యమ గమ్యాన్ని, గమనాన్ని నిష్కర్షగా నిగ్గు తేల్చి చెప్పటం- మరోక మలుపు. పౌరహక్కుల ఉద్యమ సంబంధంలో తొలి నుండి తాను ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణా లో ఏ నక్సలైట్ ఉద్యమాన్ని సన్నిహితంగా చూస్తూ వచ్చాడో, ఆ ఉద్యమంలో చీకటి కోణాలు కొన్ని వున్నాయని వెలుగులోకి తెచ్చి చూపాడు. ఉన్నతమైన ఆశయంలో దీర్ఘకాలిక పొరాట వ్యుహాంతో సాగే ఉద్యమం ఆరోగ్యకరంగా ఎదుగుతూ కొనసాగాలన్న ఆకాంక్ష నుండే ఆ వ్యాసం వ్రాశాడు. అది ఎంత వివాదా స్పదమైనా, అందుకు బాలగోపాల్ ను ఎవరు తప్పు పట్టినా, బాలగోపాల్ నిజాయితీని, చిత్త శుద్ధిని మాత్రం శంకించలేరు. నక్సల్ బరి విప్లవోద్యమంలో చీకటి కోణాల గురించి బాల గోపాల్ వ్రాసినపుడు అదే మహిళల జీవితం పై నేనూ, జ్యోతిరాణి ఒక వ్యాసం వ్రాసి వివాదస్పదం కావటంలో ఆయనతోపాటూ వున్నాం.
ప్రాధమికంగా గణితశాస్త్ర ఙ్ఞాన విషయపరిధిలో వాడైన బాలగోపాల్ పౌరహక్కుల ఉద్యమం ద్వారా సామాజికార్థిక జీవనరంగాల ఙ్ఞాన జిఙ్ఞాసతో బహుముఖంగా విస్తారించాడు.వరంగల్లు కేంద్రంగా వివిధ సమకాలీన సంఘటనలను . సందర్భాలను విశ్లేషిస్తూ ఆయన వ్రాసిన వ్యాసాలు ” సారా సంవత్సరానికి సలాకుల స్వాగతం” లాంటివి ఎన్నోవున్నాయి. సామాజిక రాజకీయార్థిక పరివర్తనల క్రమాన్ని ఆయన వాటిలో గుర్తించి చూపాడు. అదే సమయంలో సమాజాన్ని రాజకీయార్థిక విధానాలను ప్రతిఫలించే సాహిత్య విశ్లేషణలు కూడా ఆయన చేశాడు. రావిశాస్త్రి రచనల్లో రాజ్యవ్యవస్థపై చేసిన విశ్లేషణ ఈ కోవలోదే . జీవితానికి, సాహిత్యానికి, సమాజానికి వుండే గతితార్కిక సంబంధాన్ని నిరూపించటం బాలగోపాల్ పద్ధతి ఈ క్రమంలో రాగో నవలకు ఆయన రాసిన ముందుమాటకు ఒక ప్రాధాన్యత వుంది. విప్లవోద్యమ ఆచరణ నుండి సరాసరి వచ్చిన ఆ నవల, విప్లవోద్యమంలోకి స్త్రీలు ప్రవేశించటాన్ని వాళ్ళ జీవిత అవసరాల నుండి, ఆకాంక్షల నుండి వ్యక్తం చేసిన ఆ నవలను పరిచయం చేస్తూ బాలగోపాల్ స్త్రీలు కానీ మరెవరూ కానీ ఏ స్వీయ ఆకాంక్షల మేరకు ఉద్యమాలలోకి ప్రవేశిస్తారో, ఆ ఆకాంక్షలు సఫలీకృత మయ్యే పర్యాంతమే వాటీలో కొనసాగుతారా? లేక మొత్తం ఆదర్శంతో తమను మమేకం చేసుకోగల స్థాయికి ఎదుగుతారా అని ఒక ప్రశ్నను లేవనెత్తాడు. విప్లవోద్యమ గమ్యం, గమనాలకు సంబంధించి ఆలోచించాల్సిన ఒక ప్రధానమైన పార్శ్యం గురించి సాహిత్య ముఖంగా చర్చను ప్రారంభించాడు. ఒక సంఘటన నుండి, సందర్భం నుండి మొత్తంగా ఉద్యమాన్ని విలువకట్టే ఈ పద్ధతి ఏ పరిశోధనకు అయినా పనికి వచ్చే సూత్రం.
బాల గోపాల్ కు చరిత్ర అభిమాన విషయం. డిడి కొశాంబి ఆయనకిష్టమైన చరిత్రకారుడు. ఆయన వ్రాసిన భారతదేశ చరిత్ర వ్యాసాలను తెలుగులోకి అనువదించాడు.నాలాంటివాళ్ళం ఎందరమో కొశాంబి అధ్యయనపరులుగా ఎదగటానికి ఆ పుస్తకం ఇచ్చిన ప్రేరణ, శక్తి చాల గొప్పవి . రెండేళ్ళ క్రితం నేను కాకతీయ యూనివర్సిటీ విమెన్స్ స్టడీస్ సెంటర్ డైరక్టరు గా వున్నప్పుడు ‘భారతదేశ సామాజిక సాహిత్య చరిత్రకారులు – మహిళల దృక్పధం’ అన్న అంశం మీద ఉపన్యాస పరంపరను ఏర్పాటు చేసి ఆహ్వానిస్తే బాలగోపాల్ వచ్చి’ డిడి కొశాంబి మహిళాదృక్పధం’ పైన ప్రసంగించాడు. ఆ వ్యాసం వ్రాసివ్వమని అచ్చువేస్తామని అడిగాం. అలాగే నన్నారు. ఇలాంటి పనులెన్నో అర్థాంతరంగా వదిలేసి బాలగోపాల్ ఎందుకు వెళ్ళిపొవాలి? ఈ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి వేసే ప్రశ్నకు జవాబేది?