ఆదర్శాలు, విలువలు – ప్రజల పట్ల బాధ్యత – బాల గోపాల్ జీవితం
వరవరరావు ( http://www.pranahita.org/2010/01/aadarshaalu_viluvalu/)
బాలగోపాల్ ను పునర్నిర్మాణం చేయడం ఇంత తొందరలో సాధ్యం కాకపోవచ్చు.కాని ఆయన సమాజం మీద వేసిన ప్రభావం వల్ల ఆయన వ్యక్తిత్వ విశ్లేషణ జరగాల్సే వున్నది. ఆ క్రమంలో ఆయన ఆలోచనలను, ముఖ్యంగా ప్రజాస్వామిక సంస్కృతిని రూపొందించడానికి ఆయన ప్రతిపాదించిన ప్రాపంచిక దృక్పధాన్ని , విలువలను అంచనా కట్టాల్సే వున్నది ముందుగా అందుకోసం మనకుండే ఆకరాలు, పనిముట్లు , సమాచారం - విడివిడిగా శకలాలుగా, ఙ్ఞాపకాలుగా , అనుభవాలుగా , ఆచరణగా ఉన్నవన్నీ ఒకచోట సమకూర్చుకోవాలి లేకపోతే అర్థసత్యం చెప్పినన వాళ్ళం, అరకొరగా తెలుసుకున్న వాళ్ళమే అవుతాం. అందువల్ల ఇపుడెట్లాగూ ఆయన కొచ్చే నష్టమేమీలేదు. బతికుండగానే ఆయన పొగడ్తలకు,నిందలకు దూరంగా ఉన్నాడు. అయితే అది మన సత్యాన్వేషణకే అవరోధమవుతుంది గనుక అధిగమించాలి.
అక్టోబర్ 12 న హైదరాబాద్ సుందరయ్య విఙ్ఞాన భవన్ లో బాల గోపాల్ బాల్యం గురించి చెప్తూ ఆయన చెల్లెలు మృణాళిని ఆయన అక్షరాల చీమకయినా హాని చేయని వాడని, నిజంగానే గండు చీమలను , బొద్దింకలను చంపవద్దని బయట తీసుకువెళ్ళి పారేసేవాడని చెప్పింది. అట్లని ఆయన అహింసావాది అని చెప్పలేం. ఆయన ప్రైవేట్ హింసను ఖండించిన సందర్భంలో కూడా ‘ఉద్దిష్ట వ్యక్తి’ ని కాకుండా ‘అమాయకు’లను చంపినపుడు ఖండించాడు. లేదా ఉద్దిష్ట వ్యక్తిని చంపినపుడో, చంపాలని ప్రయత్నించినపుడో ప్రజలకు కూడా జరిగిన నష్టాన్ని ,ప్రజలు కూడా చనిపోవడాన్ని ఖండించాడు.
ఎస్ .ఐ యాదగిరి రెడ్డి హత్య జరిగిన మర్నాడే డా. రామనాధం గారి హత్య జరిగినపుడు మేమిద్దరమూ కలిసే హైదరాబాదుకు వచ్చాం. ఆయన మర్నాడు 4 సెప్టెంబర్ 1985 ప్రెస్ కాన్ఫరెన్స్ లో డా.రామనాధాన్ని ఎస్ ఐ. యాదగిరి రెడ్డి శవయాత్రలో సివిల్ దుస్తుల్లో పాల్గొన్న పోలీసు అధికారులే చంపారని ఆరోపిస్తున్న సందర్భంలో ఎస్.ఐ యదగిరి రెడ్డి ఆర్.ఇ.సి మెస్ వర్కర్లు మొదలు, కాజీపేట పోలీసు స్టేషన్ నుంచి ఆర్.ఇ.సి. వరకు మెస్ వర్కర్లను ( అందులో స్త్రీలు కూడా ఉన్నారు) కోర్టూ ఉత్తర్వులపై అక్రమ నిర్బంధం నుంచి వదిలి పెట్టడానికి తీసుకు వస్తున్నపుడు పోలీసుల పహారాలో నడిపిస్తూతాను వాహనంలో వెంట వుండిబిస్కీలు తీయిస్తూ తీసుకరావడం గురించి ఎంత కళ్ళుకు కట్టినట్లు వివరించాడంటే ఇరవై నాలుగేళ్ళ తర్వాత కూడా నేనిపుడు రాయగలిగేంత.ఆ తర్వాత ‘ అంకురం’ సినిమాలో పోలీసుస్టేషన్ లో ఒక గర్భవతియైన ఆదివాసి స్త్రీని ఎస్.ఐ బిస్కీలు తీయించిన దృశ్యానికి ఇదే ప్రేరణ. కొడవటి సుదర్శన్ ను డిసెంబర్ చలిలో బరిబాతల్ కాజీపేట పోలీసు స్టేషన్ ఆవరణలో తడిసిన ఇసుకలో చిత్రహింసలు పెట్టి తెల్లవార్లూ తాళ్ళతో కట్టిపడేసిన విషయం, అట్లా చంపి ఎస్.పి గారి ఆదేశాలపై ములుగు అడవుల్లో దహనం చేసిన విషయం కూడ చెప్పాడు. అటువంటి ఉద్రిక్త పరిస్థితిలో కూడా ‘ఐనా నేను ఎస్.ఐ. యాదగిరి రెడ్డి హత్య ను ఖండిస్తున్నాను ‘ అనే మాట అనలేదు. ఎ.పి.సి.ఎల్.సి ని కాపాడుకోవడానికైనా సరే ఆయన పరదేశీనాయుడు , కె.ఎస్.వ్యాస్ ల హత్యలను కూడా ఖండించలేదు.
అట్లని ఆయన పీపుల్స్ వార్ , ఆ తర్వాత మావోయిస్టు పార్టీ’ మైండ్ లెస్ వాయిలెన్స్ ‘ చేస్తున్నదని గానీ, వీళ్ళూ ఆధిపత్యం ఉన్న చోట రేపు అధికారానికి వస్తే ఇట్లే హింసనాచరిస్తారని అనలేదని గానీ కాదు.’ చీకటి కోణాలు ‘ వ్యాసం నుంచి అనంతపురం సభల్లో అఖరు ఉపన్యాసం దాకా అందుకెన్నో ఉదాహరణలు దొరుకుతాయి.
ఆయన అహింసావాదో, గాంధేయవాదో కాదని చెప్పడానికే ఈ వివరణ. గాంధీ – ‘భగత్ సింగ్ , రాజగురు, సుఖదేవ్’ల ఉరిశిక్ష రద్దు చేయాలని కోరలేదు. బాల్ గోపాల్ భూమయ్య కిష్టాగౌడ్ ల ఉరిశిక్ష నాటికి ఉద్యమంలోకి రాలేదు గానీ చలపతి , విజయవర్ధనరావుల ఉరిశిక్ష చిలకలూరి పేట బస్సు దహనం హేయమైన చర్య. స్త్రీలు పసిపిల్లలు చనిపోయారు. ఇరవై మందికి పైగా చనిపోయారు. ఆ చర్యని బాలగోపాల్ సమర్ధించాడని కాదు . కాని పూర్తిగా సామాజిక ఆర్థిక , సాంస్కృతిక కోణం నుంచి చూశాడు. ఆకలి, దారిద్ర్యం వంటి కారణాలే కాదు, వాళ్ళు దళితులని పట్టించుకున్నాడు. అంతకన్నా వాళ్ళు ఏ నిర్మాణానికి , ఉద్యమానికి చెందనివాళ్ళు కనుక పట్టించుకోవాలనుకున్నాడు. భూమయ్య , కిష్టాగౌడ్ ల ఉరిశిక్ష రద్దు ఉద్యమం, వాళ్ళు నక్సలైట్లు గనుక చేపట్టారు. వీళ్ళకెవరున్నారు అని నిష్టురం కూడా ఆడాడు. ఆయనకు గీటురాయి రాజ్యహింస. అందులో రాజ్య హింసకు గురవుతున్న వాళ్ళు పతితులు భ్రష్టులు, బాధాసర్పదశ్టులు (రెచెడ్ ఆఫ్ ది ఎర్త్ ) అయితే ఇంక చెప్పాల్సింది లేదు. పీపుల్స్ వార్ నుంచి బయటికి వచ్చి ఒక ఐదుగురు చిన్న దళం ఏర్పాటు చేసుకుని గోదావరిఖనిలో కొన్ని చర్యలకు పూనుకున్నారు. పోలీసులు వాళ్ళను ఎన్ కౌంటర్ చేసారు. ప్రాధ్యన్యమిచ్చి వెళ్ళి నిజనిర్ధారణ చేశాడాయన.
కాలక్రమంలో సామాజిక బృందాల్లో ఆదివాసులు. ముస్లింలు, అసంఘిటిత రంగంలోనూ, కార్పోరేట్ సంస్థల్లోను పనిచేస్తున్న కార్మికులు ఆయనకు అదే వరుసలో పట్టించుకోవల్సిన శ్రేణులయ్యాయి. ఈ అవాగాహన పెరిగే కొద్దీ ఆయన రాజ్యహింసను ప్రతిఘటించే హక్కుల ఉద్యమాన్ని సామాజిక అధిపత్య శక్తుల హింసను ప్రతిఘటించే వైపు విస్తరించాలనుకున్నాడు. ఇది కారంచేడు సంఘటనతో ప్ర్రారంభమైంది. కారంచేడు లో ప్రత్యక్షంగా రాజ్యం లేదు. కమ్మ భూస్వాములు, అగ్రకుల ఐక్యతను పేద కమ్మ కులస్తులకు కూడా ఎక్కించి దళితుల మీద దాడిచేసారు. దళితులు , అందులోను స్త్రీలు చైతన్యవంతంగా ప్రతిఘటించారు. కారంచేడు సంఘటనను విశ్లేషించడానికి ఆయన ఆ గ్రామంలో ప్రవేశిస్తున్నప్పుడు దేవాలయం నుంచి వినొస్తున్న భగవద్గీత శ్లోకంతో ప్రారంభిస్తాడు. తెలుగు నేల మీద బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని, నాస్తిక , హేతువాద ఉద్యమాలను ప్రారంభించిన కమ్మ కులం ఎన్.టి.ఆర్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్కడికి చేరుకున్నదో ఇది ప్రతీక అంటాడు. అందుకే ఎన్.టి.ఆర్ వియ్యంకుడే ఈ దాడికి నాయకుడు కావడం ఆశ్చర్యం కాదంటాడు. అంతేగాదు ఈ గ్రామం నుంచే అనుత్పాదకరంగమైన సినిమా పరిశ్రమకు, పొగాకు వంటి వ్యాపార పంటల మిగులు పెట్టుబడిగా ఎగబాకడానికీ ఉన్న సంబంధాన్ని ప్రస్తావిస్తాడు.
1985 జనవరి 1 న వరంగల్ మిల్ కాలనీ సి.ఐ ఇంటి మీద రాడికల్స్ బాంబు వేసినపుడు ఆ కేసులో అరెస్టయి విడుదలయ్యాక కత్తి మోహనరావు ఆయనను పోలీసుల మీద దాడి చేయడం గురించి’ మీరేమనుకుంటున్నారు? ‘ అని అడిగాడు. నేను దీనిని తప్పొప్పుల దృష్టితో చూడడంలేదు. పోలీసు వ్యవస్థ మీరు రాజకీయ నాయకులపై దాడి చేయడాన్నయినా సహిస్తుంది, ఒక్కొక్కసారి మనసులో సంతోషపడుతుంది గానీ, తనపై దాడిని చాలా సీరియసగాను, సంఘటితం గాను తీసుకుంటుంది. పంజాబ్ మిలిటెంట్ ఉద్యమం అందువల్లనే ఎక్కువ అణచివేతను, హింసను ఎదుర్కొన్నది అన్నాడు. ఎస్.ఐ యాదగిరి రెడ్డి హత్య తర్వాత దొరికితే ప్రతీకారమే ఉంటుందని భావించిన కాలంలో కారంచేడు సంఘటన జరిగాక హైదరాబాదులో కన్నబిరాన్ గారి ఇంటి నుంచి వెళ్తూ ఒక సాయంత్రం అరెస్టయ్యాడు బాలగోపాల్ . ఆయనను వరంగల్ తీసుకుపోతూ ఒక దళిత పొలీసు అధికారి గౌరవాశ్చర్యాలతో అడిగాడట – కారంచేడు ప్రస్తావన తెచ్చి ‘ మీకు దళితుల మీద ఇంత ప్రేమ ఎందుకండీ ? ‘ అని. వాస్తవానికి ఆ ప్రేమే ఆ దుర్మార్గుడైన పోలీసు అధికారి బాల గోపాల్ ను ఏమీ చేయకుండా కాపాడింది. కారంచేడు వంటి సంఘటనలే ఆ తర్వాత కాలంలో ఆ దళిత క్రిస్టియన్ పోలీసు అధికారి పాస్టర్ గా మారడానికి దారితీసినవి.
గాంధీజీ హిందూ మతాన్ని, భగవద్గీతను, రఘుపతిని వదులుకోకుండా అహింసను ప్రభోధించాడు. పాటించాడు. బాలగోపాల్ – రాజ్యం, సామ్రాజ్యవాదంతో పాటు ఆ మూడే హింసకు ఆకరాలని నమ్మాడు. రాసాడు. మానవ హక్కుల ఉద్యమాచరణలో హిందూత్వ హింసను ప్రతిఘటించడాన్ని ఒక ప్రధాన అంశంగా ప్రతిపారించాడు.
కాలోజీ అధికృత హింసను ప్రతిఘటించాలన్నాడు. బాలగోపాల్ అధిపాత్య వ్యవస్థలలోని హింసను ప్రతిఘటించడం మానవహక్కుల ఎజెండాగా విస్తరించాడు.
పిరికితనం హింసగా వ్యక్తమవుతుందని, వ్యక్తిగత ఆస్తి భావన వల్ల, సాంచయ దృష్టివల్ల, భద్రతా భావం వల్ల పిరికితనం ఏర్పడుతుందనిభావించారు. గనుక ఆయన అన్నిటికన్న బలమైన విలువగా నిర్భయత్వాన్ని ప్రతిపాదించాడు. ఒరిస్సాలో లక్ష్మణానందహత్యను గానీ, లాల్ ఘడ్ లో బుద్ధదేవ్ కాన్వాయ్ కింద మందుపాతర పెట్టడం గానీ వాటికవిగా ఒప్పా, తప్పా అని రాజకీయ విశ్లేషణలోనికి పోలేదు. ఆ తర్వాత ప్రజల మీద వచ్చే నిర్భంధం, ప్రజల మీద దాడులు ఊహించారా – విప్లవకారులు ప్రజలకు జవాబు దారీగా ఉండాలి కదా అన్నాడు. అందులోను ఆ ప్రజలు దళితులు, ఆదివాసులు అయ్యారు. ఆ ప్రజలే నిర్ణయించారు . ఆ ప్రజలు నిర్భంధాన్ని , దాడులను లక్ష్యపెట్టకుండా హర్షించారు. ఆమోదించారు అన్నప్పుడు ఆయనింక డిబేట్ చేయలేదు. నేను వాదం కోసం కాదు, ప్రజాస్వామిక ఆచరణ కోసం చెప్తున్నానన్నాడట’ చీకటి కోణాలు ‘వ్యాసం గురించి.
నల్లమలలో అదుశ్యమైన వైయస్ ఆర్. చనిపోవాలని కోరుకున్నాడని చెప్పలేం గానీ బతికితే పగబట్టి నల్లమలను విధ్వంసంచేస్తాడని ఆందోళన చెందాడు. ఆ పని ఇప్పుడు ఆయన వారసులు జగన్ మైదలైనవాళ్ళు చేస్తున్నారు.
బాలగోపాల్ ఆచరించిన రెండవ విలువ న్యాయం. అసమానతకు, పీడనకు వ్యతిరేకంగా నిలిచే న్యాయం. ముఖ్యంగా హిందూ సమాజంలో దీనిని ధర్మంగా పొరపాటు పడితే ఒక ప్రమాదం ఉంది. ధర్మం వర్ణవ్యవస్థ మీద ఆధారపడి ఏర్పడిన విలువ. వర్ణవ్యవస్థ రాజ్యాన్ని కూడా ఒక ధర్మంగా భావిస్తుంది. అందుకే ధర్మశాస్త్రాల్లోని న్యాయ నిర్వచనం ఆస్తి సంబంధంగా ఉంటుంది. పాలకప్రయోజనం కొరకే రచించబడిన రాజ్యాంగం విషయంలో గానీ, కోర్టుల విషయంలో గానీ ప్రారంభంలో బాలగోపాల్ కు అందుకే ఏ మాత్రం గురి ఉండేది కాదు. మార్క్సిస్టు అవగాహన వల్ల రాజ్యాంగ యంత్రాన్ని కూలదోయాలనే భావించాడు. కానీ రాజ్యాంగానికి అంబేద్కర్ ఇచ్చిన దృష్టిని – ముఖ్యంగా ఆదేశిక సూత్రాలు, అస్పృశ్యతా నివారణ ఆదర్శం, ఎస్.సి.,ఎస్.టి., వర్గాల రిజర్వేషన్ లు, ఆదివాసీ ప్రాంతాలను రాజ్యాంగం ఐదవ షేడ్యూల్ లో చేర్చే వెసులుబాటు అధికారం – పోరాడి సాధించుకోవచ్చునని ఆయన్లో భావం పెరుగుతూ వచ్చింది.అందుకే తన జీవిక కోసమే కాకుండా పీడితులకు న్యాయం సాధించడానికి ఆయన న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నాడు.రాజ్యహింసకు, ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా వేసిన రిట్ లు మాత్రమే కాదు, ఆయన తర్వాత మిగిలిపోయిన ఎనిమిది వందల కేసుల్లో వందలాదిగా ఉన్నవి- ఆదివాసుల, ముస్లింల, కార్పోరేట్ సెక్టర్లలో పనిచేస్తున్న అసంఘిటిత రంగ కార్మికుల కేసులే. న్యాయవాది వసుధ రాసినట్లు ఆయన ఎప్పుడూ కేసు గెలవడానికి వాదించలేదు. న్యాయం గెలవడానికి వాదించాడు.
చాలా మంది బాలగోపాల్ నైతికత , నిజాయితీ , నిరాడంబరత్వం గురించి సగటు అవి ఆచరణ సాధ్యంగాని అసాధరణ ప్రవృత్తులుగా మారాయి గనుక – దాదాపు ఆయనొక దైవత్వాన్ని ఆపాదిస్తూ రాస్తున్నారు.
బాలగోపాల్ నిరాడంబరత్వం, నిజాయితీ ఆదర్శవాదం నుంచి వచ్చినవి. ఈ ఆదర్శవాదం నక్శల్బరీ తరం లక్షణం. వాళ్ళు చదువులు వదిలి, సర్టిఫికెట్లు చించేసి, బంగారు పతకాలు పరిత్యజించి, యవ్వన స్వప్నాలుగా సుందర జీవితాలను కాకుండా విప్లవాన్ని , ప్రజాసేవను, ప్రజల కోసం త్యాగాన్ని ఎంచుకున్నారు. అందుకే నిరాడంబరత్వంలో ఆయన మీద సూరపనేని జనార్దన్ ప్రభావం గురించి ప్రస్తావిస్తున్నాను. సూరపనేని జనార్దన్ రావు కృష్ణా జిల్లా గరికపర్రు గ్రామంలో మధ్యతరగతి కమ్మ కుటుంబంలో పుట్టి వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ రాడికల్ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తూ, సిద్ధిపేటకు ఎం. ఎల్ పార్టీ దళ నాయకునిగా వెళ్ళి ఎన్ కౌంటర్ అయ్యాడు. డొక్కు సైకిల్ వేసుకుని వరంగల్ అంతా మెస్ వర్కర్లు,రిక్షావాళ్ళు, వ్యవసాయ కూలీలు, రైల్వే కార్మికులు, ఆర్.టి.సి కార్మికులు, గ్రామీణ పేదాల మధ్యన తిరిగేవాడు. ఇప్పుడు హక్కుల నిబద్ధతతో బాల గోపాల్ తిరుగుతున్న పరిస్థితులకన్న అననుకూల పరిస్థితుల్లో ఆయన విప్లవ నిబద్దతతో తిరిగి ప్రాణత్యాగం చేసాడు. బాల గోపాల్ వరంగల్ లోను, ఆ తర్వాత అటూవంటి త్యాగజీవులను చాలామందిని చూశాడు.ఆయన దగ్గరగా చూసినవాళ్ళలో జనార్థన్ , నరేంద్రనాధ్ లు ఆయనపై చెరగని ముద్ర వేశారు. నరేంద్రనాధ్ ఎ.పి.సిఎల్.సి.లోకాయన్ లతో ప్ర్రారంభించి. సేంద్రీయ వ్యవసాయం, తన జిల్లా ప్రజల మధ్యన తన పోరాట ఆచరణతో ముగించినా బాల గోపాల్ ఎంచుకున్నది ఆయన ఆదర్శప్రాయ జీవితాన్ని. కనుక బాల గోపాల్ నిరాడంబరత్వం గాంధీజీ వేరుసెనగపప్పు. మేకపాలు , తొమ్మిది గజాల ఖాదీ వస్త్రం ఉన్న ఒంటి మీద అంగీ లేకపోవడం వంటివికావు.ఆవులే పాలివ్వని ఈ దేశంలో గాంధీజీ మేకపాలు ఇవ్వడానికి, రోజుకు పద్నాలుగు రూపాయలు ఖర్చయ్యేదని లూయిఫాషిర్ రాసాడు. దేశంలో గోచిపాత పేదలు తొమ్మిది గజాల బట్ట దొరికితే ఒంటినిండా ధరించేవారే. విష ముష్టికాయలు కరువు కాలంలో ఆహరమైన ఆదివాసులు వేరుశనగపప్పు విలాసాన్ని ఆశించలేదు.
బాల గోపాల్ తన జీవిక కోసం చేసిన ఆర్జనలో ఎంత నిరాడంబరంగా ఉండగలనో , ఇతరులకెంత భారం లేకుండా ఉండగలనో అన్నదొక్కటే సింపుల్ గా ఉండడానికి ప్రమాణంగా పెట్టుకున్నాడు. ఖాదీ చేనేత వస్త్రాలే కట్టాలనుకోలేదు. రంగురంగుల వస్త్రాలు వేసుకోవద్దనుకోలేదు. వాటి కోసం తనతో సహా ఎవరూ లెక్కించదగిన , గుర్తుపెట్టుకొదగిన ఖర్చు చేయద్దనుకున్నాడు. వకీలుగా గుమాస్తాను పెట్తుకోవాలంటే ఆ ఖర్చు భారం క్లయింట్లు మీదనే పడుతుందనుకున్నాడు. ప్రజలకు కొట్టొచ్చినట్లు కనిపించే ఆడంబరత్వాన్ని, విలాస జీవితాన్ని చైతన్యపూర్వకంగా నిరాకరించాడు. ఈ విషయంలో మాత్రం మార్కెట్టు భావజాలం పట్ల ఆయన తీవ్ర నిరసనయే ఆయన పాటించిన నిరాడంబరత్వం. అది ఆయన తెచ్చిపెట్టుకున్నది కాదు. ఒక సామాన్య వ్యక్తి సంస్కృతిగా పాటించింది.
ఇందులో భాగమే శ్రమ పట్ల, పనిపట్ల ఆయన గౌరవం . పనిరాక్షసుడుగా పేరుబడిన ఆయన నిరంతరం ప్రజా సమస్యల్లో తిరుగుతూ , దేశమంతా తిరుగుతూ, కోర్టుకుతిరుగుతూ , అధ్యయనం చేస్తూ , సభలు , సమావేశాల్లో మాట్లాడుతూ, ప్రభుత్వం దగ్గరికి విఙ్ఞాపనలతో వెళ్తూ, పాదయాత్రలు, ధర్నాలు నిర్వహిస్తూ కూడా ఊళ్ళో ఉంటే ఇంటి పని ఎన్నడూ మానలేదు.కూరగాయలు కోయడం , చాయ్ చేయడం మొదలు వంటలోనూ అంత ప్రతిష్టాత్మకంకాని చిల్లర పనులు తన కోసం పెట్టుకునేవాడు. ఇంక కొడుకు ప్రభాతకు రోజూ గంట పాఠం చెప్పడం, అతనితో క్రికెట్ ఆడడం , అతడు రాసే నవలలు చదవడమే కాదు టైపు చేసి పెట్టడం . స్కూల్లో దించి రావడం , అతనికి నూడుల్స్ చేసిపెట్టడం, కోరితే చికెన్ వండి పెట్టడం - ఏదీ విసుక్కోకుండా చేసే వాడు. అనుత్పాదక శ్రమకు ఇచ్చినంత గౌరవం, అసంఘిటిత రంగంలోని కార్మికులకు ఇచ్చాడు. చెత్త ఎత్తేవాళ్ళు , చాకిరేవువాళ్ళు ఆయన క్లయింట్లు. ఆయన పలకరించి నమస్తే పెట్టే వ్యక్తి ఇంట్లో ‘పనిమనిషి’. ఆయన అట్టడుగువర్గాలను ప్రేమించే, గౌరవించే సంస్కృతిని ఒక జీవన విధానంగా అచరించాడు.
సింపుల్ గా, నిరాడంబరంగా ఉండడాన్ని ఒక విలువగా గుర్తించినవాళ్ళు, పట్టించుకోనివాళ్ళు, తేలిక చేసే వాళ్ళు బాల గోపాల్ నిరాడంబరత్వం పట్ల వస్తున్న స్పందనను చూసయినా ఇదంతా మనకు తెలియకుండానే , మనం పాటించినా, పాటించకున్న మార్కెట్టు భావజాలం పట్ల, సరుకు వ్యామోహం పట్ల పేరుకుపోతున్న, పెరుగుతున్న ఏహ్యభావంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రజాసంఘాల , ఉద్యమాల కార్యకర్తలు ఇది తప్పకుండా అలవరచుకోవాల్సిన విలువ (వర్చ్యూ) గా గుర్తించి ఆచరించాలి. అది ప్రజల్లో విస్వసనీయతను పెంచుతుంది.
నైతికతను ధర్మం వలెనే బాల గోపాల్ ఒక మతభావనగా అర్థం చేసుకోలేదు. ప్రజల పట్ల జవాబుదారీతనంగా భావించాడు. పాటించాడు. ఎ.పి.సి.ఎల్.సి కోసం కానీ, మానవ హక్కుల వేదిక కోసం కానీ, సభలు , పుస్తకాల కోసం గానీ ఆయన ఎవరైనా ఇచ్చిన డబ్బులకు ఎన్నడూ లెక్క చెప్పకపోవచ్చుకానీ ఒక్క పైసా కూడా తన కోసం వాడుకోలేదని , వృధా చేయలేదని ఆయన పట్ల నూటికి నూరుశాతం విశ్వాసం ఉంచారు ఇచ్చిన వాళ్ళు. వాళ్ళకసలు ఆయన చేతిలో పడిన డబ్బు అనవసరంగా ఖర్చువుతుందని కలలో కూడా అనుమానం రాలేదు. విప్లవకారులు జనంలో ఉంటారు. జనం దగ్గర తింటారు. వాళ్ళ అవసరాల్ని జనమే తీరుస్తారు. నిజమే కానీ ఆయుధాల కోసం లేవీ వసూలు చేయాల్సి వస్తుంది అనే చర్చ పులిఅంజయ్య కాలం నుంచి ఆయనతో సాగుతూనే ఉంది. తిలక్ పైసా ఫండ్ వలె, జయప్రకాష్ నారాయణ్ డయాల్సిస్ కోసం ఒక రూపాయి మించని నిధి వలె ఏమైనా మార్గాలు లేవా అనేవాడు .అయితే మరి శత్రువు మీద దాడి చేసి ఆయుధమో, తయారు చేసుకున్న ఆయుధమో కాకుండా, ఆయుధం కొనాల్సి వచ్చినపుడే స్మగ్లర్లు, ఇమ్మడి , ముమ్మడిగా ధరల సమస్య వస్తుంది. ప్రపంచ విప్లవంలో పారదర్శకంగా ఆయుధాల సేకరణ ఎక్కడయినా జరిగిందా అనే చర్చ మా మధ్య 93 కన్న ముందు ఉండేది. ఆయన ఆలోచించాలి, అధ్యయనం చేయాలి అనేవాడు. ఆయన వరంగల్ లో గోపగాని ఐలయ్యకు పి.యఫ్. ఇచ్చేవాడనే అనుకుంటాను కనీసం 85 దాకా.
ఆస్తి, సంచయంలతో సంబంధం గల విలువలుగా ఆయన అవినీతిని చూసాడు. అట్లే ప్రజాజీవిత ఆచరణను ప్రభావం వేసే విలువగా కూడా చూశాడు. అందుకే ఉద్యోగులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం గురించి ఆయన 80 ల ఆరంభంలోనే’ ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’లో తీవ్ర నిరసనతో రాశాడు. భద్ర జీవితం – ప్రజాజీవితం పట్ల స్పందనను చంపేస్తుందని నమ్మాడు.
అట్లని ఒకే ఆదాయ వనరుతో పారదర్శకంగా జాగ్రత్తగానే జీవిస్తూ ఇతరుల మంచి చెడ్డలు ఆలోచించే వాళ్ళకు ఆయన ఎన్నడూ అపరాధ భావనకు గురిచేసేంత పెద్ద పనులు చెప్పలేదు. యుద్ధరంగంలో ఉన్నవాళ్ళకు మేజోళ్ళు అల్లే పనిని ఆయన గౌరవించాడు, ప్రోత్శహించాడు.
ఆయనకు నీతి అంటే నిర్భయం, పారదర్శకత , ప్రజల పట్ల బాధ్యత.
రాజ్యహింసను ప్రతిఘటించడంతో ప్రారంభించి సమాజంలోని అన్ని రంగాల్లో , బృందాల్లో ఆధిపత్య భావాన్ని ప్రశ్నించడంతో ఆయన తన విలువల పోరాటాన్ని విస్తరించాడు. ఈ క్రమంలో గడిచిన ముప్పై ఏళ్ళలో ఆయన గ్రహించిందేమిటంటే ఆధిపత్య భావజాలాన్ని ప్రశ్నించడమంటే నిర్భయత్వాన్ని అలవరుచుకోవడం.అది తన శరీరం పట్ల కూడ నిర్మమత్వం ఉంటే తప్ప సాధ్యం కాదు.మెట్టు కూడా లేని నేల మీద నిలబడితే తప్ప సాధ్యంకాదు. గడ్డి వేళ్ళస్థాయి పోరాటాలు చేయాలంటే గడ్డి వేరుకుండే ధిక్కార భావం ఉండాలి. గుర్తింపు కోరని అనామక జీవన విధానం ఉండాలి.
అయితే ఇవన్నీ ఆయన తన ఆచరణ నుంచి నేర్చుకోవాలనే అనుకున్నాడు గానీ ఒక సమిష్టి చర్చను, ఆచరణను చైతన్యయుతంగా నిర్వహించి, ప్రోత్సహించి ఒక సామూహిక పనివిధానంగా పెంపొందించే ప్రయత్నం చేసినట్లు లేడు. ముప్పై ఏళ్ళ ప్రజా జీవితంలో ఇరవై అయిదేళ్ళకు పైగా ప్రజాసంఘ బాధ్యుడుగా ఉన్నవాడు అందుకే ఒక అనితరసాధ్యమైన ఆదర్శ శిఖరంగా, ఆయన అట్లా పిలవడం ఇష్టపడని అసాధరణ వ్యక్తిగా, బహుశా మనం దేవులాడుకునే దేవుడుగా మిగిలాడు.