తెలుగు సమాజపు కన్సైన్స్ కీపర్ (Conscience keeper) గా గుర్తింపు పొందిన వ్యక్తి కె. బాలగోపాల్. జటిలమైన సమస్య ఎదురైన చాలాసార్లు ఆయన అభిప్రాయం కోసం ఆలోచనాపరులు, కార్యకర్తలు ఎదురుచూసేలా తనను తాను మల్చుకున్న వ్యక్తి బాలగోపాల్. ఆయనుంటే ఏం చెప్పేవారో అనే మాట ఆయన చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా వినిపిస్తూ ఉంటుంది.
బాలగోపాల్ పౌరహక్కుల కార్యకర్తే కాక అనేక మౌలిక రంగాల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించిన ఒరిజినల్ థింకర్. భిన్నమైన అంశాల మీద తడుముకోకుండా సాధికారికంగా నిర్దుష్టంగా మాట్లాడే వక్త, రచయిత.
బాలగోపాల్ 1952లో బళ్లారిలో జన్మించారు. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో డాక్టరేట్ చేశాక దిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో కొంత కాలం పోస్ట్ డాక్టరేట్ పరిశోధన చేశారు. గణితంలో గుర్తింపు పొందుతున్నప్పటికీ తన కార్యక్షేత్రం అది కాదని భావించి సమానత్వపు చైతన్యాన్ని, విలువలను సమాజంలో పెంపొందించడం బాధ్యతగా ఎంచుకుని తిరిగి వరంగల్ చేరుకున్నారు. కొంతకాలం అధ్యాపకుడిగా పని చేస్తూనే సామాజికకార్యాచరణలో పాలుపంచుకున్నారు. తర్వాత 1985లో అధ్యాపక ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి కార్యకర్తగా మారి హక్కుల రంగానికి తన జీవితాన్ని అంకితం చేశారు. 1983 నుంచి 1998 వరకూ ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (APCLC) ప్రధాన కార్యదర్శిగా సంస్థను ముందుండి నడిపారు. నిర్దిష్టంగా ‘విప్లవహింస’, ‘ప్రతిహింస’ లాంటి అంశాలపైనా, మొత్తంగానే మార్క్సిస్టు సిద్ధాంతంలోని కొన్ని భావనలపైనా విభేదించి, సుదీర్ఘ చర్చల అనంతరం 1998లో దాని నుండి బయటకు వచ్చారు. తన భావాలకు సన్నిహితంగా ఉండే వారితో కలిసి 1998లో మానవహక్కుల వేదికను ప్రారంభించారు. న్యాయశాస్త్రం చదివి కోర్టులలో పీడితుల లాయర్‌గా తనదైన ముద్ర వేశారు. రాజకీయంగా అప్పటి యువతరాన్ని కదిలించిన 1975 ఎమర్జెన్సీ రోజులు ఆయన జీవితంలో కీలక మలుపు అనుకుంటే అప్పటినుంచి 2009 అక్టోబర్ 8న అనారోగ్యంతో మరణించే రోజు వరకూ ఆయన క్షణ క్షణం కణ కణం పీడితులతోనే, పీడితుల కోసమే.
సమస్త రంగాల్లో ఆధిపత్యమూ, వివక్షా వ్యక్తమయ్యే రూపాల గురించిన అవగాహనను పెంపొందించిన వాడు బాలగోపాల్. సమానత్వ చైతన్యం మన కామన్ సెన్స్‌లో భాగమవ్వాల్సిన పద్ధతి గురించి ఎరుక పరిచినవాడు.
మాట, రాత, ప్రత్యక్ష ఆచరణ – అన్నింటిలోనూ ముందు నడిచిన దీపధారి. నడకలోనూ నడతలోనూ, మాటలోనూ రాతలోనూ అందుకోవడం కష్టం అనిపించేంత వేగం, కచ్చితత్వం ఆయన ప్రత్యేకత. తెలుగు నాట మూలమూలలా బస్సు నెంబర్లు, రూట్లు కూడా నోటితో చెప్పగలిగినంత తిరగడమే కాదు, ఆయన ఎన్నెన్ని సభల్లో మాట్లాడారో ఎన్నెన్ని వ్యాసాలు రాశారో ఎన్నెన్ని పోస్టర్లు వేశారో లెక్కవేయడం కష్టం. భౌతిక, బౌద్ధిక శ్రమల మధ్య విభజన రేఖను ఆచరణాత్మకంగా చెరిపేయడానికి ప్రయత్నించిన మనిషి.
తెలుగు నేలతో పాటు చత్తీస్ గఢ్, ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ లాంటి ప్రాంతాల స్థితిగతుల గురించి కూడా సాధికారికంగా మాట్లాడేంత విస్తృతంగా పర్యటించి హక్కుల చైతన్యాన్ని విస్తరించిన ఉద్యమకారుడు. విచ్చలవిడి హింస, వికృతమైన ఆధిపత్య ప్రదర్శన ఉన్న చోటల్లా ధిక్కారంలో భాగమై నిలిచిన వాడు. ప్రత్యామ్నాయాలుగా చెప్పుకునే మార్గాల్లోనూ కనిపించే ఆధిపత్యపు స్వరాలతో కలతచెంది వాటి మూలాలను అన్వేషించే ప్రయత్నం చేసినవాడు. మానవస్వభావంలోని చీకటి కోణాలపై అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన వాడు. ఈ ప్రయత్నంలో తన అనుకున్నవారిని దూరం చేసుకోవడానికి కూడా వెరవని వాడు. ఆ రకంగా నిజమైన సత్యాన్వేషి.
అరుదైన నమూనా
రాజ్యం, దాని సాయుధ ముఖంగా ఉన్నటువంటి పోలీసు అక్రమాలను ధిక్కరించి కిడ్నాపులు, ప్రాణాంతక దాడులు ఎదుర్కొన్నా వెరువక నిబ్బరంగా నిలిచి ముందు నడిచిన సాహసి. ‘‘శరీరం మాట వినడం మొదలెడితే అది రోజూ ఏదో ఒకటి చెపుతూనే ఉంటుంది’’ అని సొంత శరీరాన్ని కూడా పరాయిగా భావించ గలిగినటువంటి నిర్మమకారం సాధించిన అరుదైన మనిషి బాలగోపాల్. సొంత ఆస్తి మాత్రమే కాదు, ఎంచుకున్న రంగం తప్ప దేన్నీ సొంతంగా భావించకుండా ఉండడాన్ని సాధన చేసిన వాడు బాలగోపాల్. సమయాన్నీ, శక్తినీ పూర్తిగా సామాజిక ఆచరణ మీద కేంద్రీకరించడానికి ఆయన ఎంచుకున్న ఈ మార్గం ఆయన్ని అనుసరణకు అతీతం అనేట్టు మార్చింది. అది అసాధ్యమనిపించేంత ఆచరణ. అరుదైన నమూనా. హక్కు అనే ఆధునిక విలువను దాని సారాంశంలో విస్తృతం చేయడానికి ప్రయత్నించినవాడు. ఒక దశలో తెలుగు నాట హక్కుల ఉద్యమానికి, దానికి ప్రధాన రూపమైన ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘానికి పర్యాయపదమై నిలిచినవాడు. పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులు, మానవహక్కుల మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకోవడానికి పరికరాలను, చట్రాన్ని రూపొందించే ప్రయత్నం చేసిన వాడు.
రాజ్యహింసను ధిక్కరిస్తూ దోపిడీ, పీడన లేని సమాజం కోసం ఉద్యమించే వారి హక్కుల రక్షణతో ప్రయాణం ఆరంభించి మెల్లమెల్లగా దళిత, ఆదివాసీ, స్త్రీ, మైనారిటీ తదితర సమూహాలకు దానిని విస్తరిస్తూ చివరకు విప్లవహింసలో కూడా అవాంఛనీయమైన ధోరణులను నిలదీసి హక్కుల ఉద్యమంలో తనదైన బాట వేసుకున్న మనిషి బాలగోపాల్. వర్గం, కులం, ప్రాంతం, లింగం, ఇంకా అనేకానేక ఛాయల్లో పని చేసే వివక్షా రూపాలను గుర్తించి వాటి బాధితులకు బాసటగా నిలిచిన స్వరం. కనిపించే ఘటనలపై స్పందించడం మాత్రమే కాకుండా వాటి వెనుక సాగే పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి మనకు ఆయుధంగా అందించిన కలం. ఆధిపత్యాన్ని ధిక్కరించే విషయంలో తన మన అనే భావనలు – అంటే నీ ప్రాంతం, నీ కులం, నీ మతం, ఇత్యాది అంశాలు పనిచేయకుండా ఆలోచించాల్సిన పద్ధతి గురించి నమూనాలను మిగిల్చినవాడు బాలగోపాల్. నీటి పంపకంలో తెలుగువారికి అరుచికరమైన వాస్తవాలను చెప్పాల్సి వచ్చినపుడు, మాదిగ రిజర్వేషన్ విషయంలో వాస్తవం వైపు నిలబడాల్సి వచ్చినపుడు ఆయన చూపిన వైఖరి అనుసరణీయమైనది. కరపత్ర రచనలో కొత్త ఒరవడి తెచ్చినవాడు బాలగోపాల్. తెలుగులో హాయిగా చదువుకోదగిన సులభ శైలిలో కరపత్ర రచన చేయడం అటు యాక్టివిస్టులకు, ఇటు విశాల సమాజానికి ఆయన చేసిన చేర్పే అనుకోవచ్చు. వామపక్ష శిబిరం వరకు అది కచ్చితంగా చెప్పొచ్చు. మానవహక్కుల వేదిక కరపత్రాల్లో అది ప్రతిఫలిస్తుంది. కరపత్రమనే కాదు, రచనలన్నింటా కూడా ‘నేనిది చెపుతున్నాను, చదవండి’ అని కాకుండా సామాన్యుడికి రాగలిగిన సందేహాలను తానే వేసుకుని వాటికి సమాధానాలు కూడా చెప్పే పద్ధతిని – అంటే ఒక రకమైన డైలాగ్ పద్ధతిని అనుసరించిన వాడు బాలగోపాల్. తాను ఎక్కడినుంచి అయితే ఆరంభమయ్యాడో ఆ మార్క్సిస్ట్ సిద్ధాంత మూలాల్లోనే పూరించాల్సిన లోపాలున్నాయి అని గుర్తించి మనిషిని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సైద్ధాంతిక తలంలో పనిచేసిన మేధావి.
బాలగోపాల్ అక్షరాలలో ఆయన భౌతిక, మేధో ఆచరణ అంతా ఉంది. సమస్యలను ఆయన చూసిన పద్ధతి, ప్రజాపక్ష వైఖరిని ఆయన రూపొందించిన తీరు వర్తమానానికి, భవిష్యత్తుకు కూడా పరామర్శ సూత్రాలు.