కమిషన్ నివేదికలు-సామాజిక న్యాయం

మా మాట

రెండేళ్ల క్రితం ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ పుస్తకం తీసుకొచ్చాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘కమిషన్‌ నివేదికలు – సామాజిక న్యాయం’ తీసుకొస్తున్నాం. కోర్టు తీర్పులు చర్చించబడినంతగా కమిటీలు, కమిషన్ల నివేదికలు ప్రజాక్షేత్రంలో చర్చించబడవు. మండల్‌, సచార్‌ కమిషన్‌ లాంటి కొన్ని మాత్రమే దీనికి మినహాయింపు. సాధారణంగా నేరుగా లబ్ది పొందే లేదా నష్టపోయే వర్గాలు మాత్రమే ఈ నివేదికలను చదివి వాటి సిఫార్సులను అమలు చేయమనో, తిరస్కరించమనో ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తుంటాయి. అవే ఎక్కువగా మీడియాలో వార్తలుగా వస్తుంటాయి. అయితే బాలగోపాల్‌ గారు తన హక్కుల ప్రయాణం ప్రారంభ దశ నుండి ప్రజా ప్రయోజనం ఉన్నాయనుకున్న అన్ని కమిటీలకు, కమిషన్లకు చాలా ప్రాముఖ్యం ఇస్తూ వచ్చారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో ఏర్పాటైన కమిషన్ల నివేదికలపై కూడా స్పందిస్తూనే వచ్చారు. ప్రజాస్వామ్య సంవాదంలోనూ, సామాజిక న్యాయ సాధనలోనూ వాటి పాత్రను ఆయన గుర్తించి, గౌరవించినట్టుగా ఇంకెవరూ చేసినట్టు కనిపించదు.

1986 నుండి 2009 వరకు తన మొత్తం హక్కుల ప్రయాణంలో ఆయన అనేక కమిటీలు, కమిషన్ల నివేదికలపై విస్తృతంగా రాశారు. కొన్నిసార్లు కమిషన్ల ఏర్పాటు దశ నుండే వాటికి సూచనలు ఇచ్చారు. ప్రకటనల రూపంలో, కరపత్రాల రూపంలో, వత్రికలలో వ్యాసాల రూపంలో, హక్కుల సంఘం తరవున ఇచ్చే వినతిపత్రాల రూపంలో, బుక్‌లెట్‌ల రూపంలో, ఉపన్యాసాల రూపంలో వాటిలోని అంశాలను ప్రజలకు తెలియజేయడానికి శాయశక్తులా కృషి చేశారు. జాగ్రత్తగా చదివితే – ఇందులోని ఒక్కొక్క వ్యాసం వెనక ఆయా నివేదికల ద్వారా ప్రజలకు మేలు జరగాలన్న ఆయన తపన, ఆరాటం, హాని జరగకూడదన్న పట్టుదల కనిపిస్తాయి.

ఒక హక్కుల కార్యకర్తగానే కాదు, పరిశోధకుడిగా, ప్రజా మేధావిగా బాలగోపాల్‌ ఈ నివేదికలను లోతుగా విశ్లేషించి, వాటి మంచిచెడులను సమాజానికి తెలియజేశారు. కమిషన్లు సేకరించిన సమాచారం, వాటిని అవి పరిశీలించిన పద్ధతి, చేసిన సిఫార్సులు, అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఏవి ప్రజానుకూలమైనవో, ఏవి కావో, ఏవి ప్రజాస్వామ్యానికి దోహదపడేవో, ఏవి కావో సహేతుకంగా వివరించి చెప్పిన వ్యాసాలు ఇవి. చట్టం చెప్పే న్యాయం మాత్రమే కాదు, సామాజిక న్యాయం కూడా ఉందా లేదా అని సాధికారికంగా చెప్పడం ఈ వ్యాసాల విశిష్టత.

జీవన్‌ రెడ్డి గారి మీద ఇతరత్రా ఎంత గౌరవం ఉన్నా సాయుధ బలగాల చట్టం మీద ఆయన నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సును బాలగోపాల్‌ చాలా ఘాటుగా విమర్శించారు. ‘ఒక వ్యక్తిని నేరుగా కాల్చి చంపడానికి సాయుధ బలగాల చట్టం సైనిక బలగాల సిబ్బందికి ఇచ్చిన అధికారం ఎంతవరకు సబబు ఆన్న ప్రశ్న ప్రధానంగా వేసుకోవలసి ఉండింది. వేసుకోకుండా, రాజ్యం ఉనికినే ప్రశ్నించే ఉద్యమాలు నడుస్తున్న చోట సి.ఆర్‌.పి.సి సైనిక బలగాలకు కల్పించే పాత్ర, ఇచ్చే అధికారాలు చాలవనీ, సాయుధ బలగాల చట్టం ఇచ్చే విశేష అధికారాలు అవసరమనీ నిర్ణయించడం, ఎంత మర్యాదగా చెప్పాలన్నా విచారకరం అనక తప్పదు… జీవన్‌ రెడ్డి గారు క్షమిస్తే వికృతమైన ఆలోచన అని కూడ అనక తప్పదు అని రాశారు. సచార్‌ కమిటీ నివేదికను ప్రశంసిస్తూనే “దాని సిఫారసులే ఆ నివేదికలోని అత్యంత బలహీనమైన అంశం” అన్నారు. అంటరానితనం నిర్మూలించడానికి పున్నయ్య కమిషన్‌ చేసిన సూచనలు మరీ సుతిమెత్తగా ఉన్నాయని కూడా నిర్మాహమాటంగా అన్నారు.

ఈ పుస్తకంలో వచ్చిన వ్యాసాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితం కాదు. జాతీయ లేబర్‌ కమిషన్‌, లా కమిషన్‌, బొంబాయి అల్లర్ల మీద ఏర్పాటైన శ్రీకృష్ణ కమిషన్‌, 11 వ ఫైనాన్స్‌ కమిషన్‌ మొదలైన జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఎన్నో కమిషన్‌ రిపోర్టులను పరిశీలించి రాసిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇవన్నీ ప్రధానంగా తెలుగులో రాసిన వ్యాసాలు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌ల మీద, పోలీస్‌ కస్టడీ మరణాల మీద జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులు మాత్రమే తెలుగులోకి చేసిన అనువాదాలు (బాలగోపాల్‌ గారు చేసినవే). ఇంగ్లీషులో కమిషన్లకు ఇచ్చిన సబ్మిషన్లు (అవి ఫిర్యాదుల రూపంలో, అభిప్రాయాల రూపంలో, సూచనల రూపంలో, నిజనిర్ధారణ ఆధారంగా చేసిన ఫిర్యాదుల రూపంలో ఉన్నాయి కాబట్టి సబ్మిషన్‌లనే ఆంగ్ల పదాన్నే వాడుతున్నాం) 20 కి పైనే ఉన్నాయి. వాటిలో 27 మంది చనిపోయిన సింగరేణి 7 LEP,  8A INCLINE గనుల్లో జరిగిన ప్రమాదాల మీదా, 22 మంది చనిపోయిన HPCL వంటి పారిశ్రామిక ప్రమాదాల మీదా ఇచ్చిన సబ్మిషన్లు ఉన్నాయి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు, విద్యుత్‌ కమిషన్‌కు ఇచ్చిన సబ్మిషన్లు ఉన్నాయి. వాటిని ఇందులో చేర్చలేదు. కొన్ని దొరకలేదు కూడా. అయితే వీటిలో మేము ఎంతో ప్రయత్నించినా దొరకని వ్యాసం ఒకటుంది. అది మిస్సింగ్‌ కేసుల మీద టి. ఎల్‌ ఎన్‌. రెడ్డి కమిషన్‌కు ఇచ్చిన సబ్మిషన్‌. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మిస్సింగ్‌ కేసుల వివరాలన్నీ ఉన్నాయి. ఆ నివేదికను అసెంబ్లీకి సమర్పించారో లేదో ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. దీని గురించి బాలగోపాల్‌ APCLC ప్రధాన కార్యదర్శిగా 9 వ రాష్ట్ర మహాసభల కోసం రాసిన కార్యదర్శి నివేదికలో ఈ కింది వాక్యాలు ఉన్నాయి.

పోలీసు కస్టడీ నుండి మాయం అయిన వారి గురించి టి.ఎల్‌.ఎన్‌. రెడ్డి కమిషన్‌ జరివిన న్వాయ విచారణ నివేదికను రాష్త్ర వ్రభుత్వం దాదావు రెండేళ్ళు తొక్కి పెట్టింది. ఆ నివేదికను బయటపెట్టాలని మనం 1994 ఏప్రిల్ నెలలో ఆందోళన చేవట్టాము. అయిలయ్య, రాజుమల్లు, మరొక 43 మంది గురించి టి.ఎల్‌.ఎన్‌. రెడ్డి కమిషన్‌ న్వాయ విచారణ జరిపింది. మనం ఒత్తిడి పెట్టగా రాష్త్ర ప్రభుత్వం ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టింది. కమిషన్‌ 6 కేనులలో మాత్రం పోలీసులను  దోషులుగా గుర్తించింది. అయినవ్పుటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ 6 కేసులలో కూడా ఎటువంటి చర్యా తీసుకోలేదు. ఈ మహాసభల  తర్వాత దీని గురించి మనం అందోళన చేపట్టవలసి ఉంది.

 బాలగోపాల్‌ ఇంత స్పష్టంగా రాశారు కాని ఆ నివేదికను ప్రవేశపెట్టినట్లు అసెంబ్లీ రికార్డులలో మాత్రం లేదు. రాజకీయ నాయకులో, పోలీసు, సివిల్‌ ఉన్నతాధికారులో మాత్రమే ఈ మిస్టరీని ఛేదించగలరేమో. ఏమైనప్పటికీ ఆ నివేదిక గాని, APCLC ఇచ్చిన సబ్మిషన్‌ గాని మాకు దొరకలేదు. నిజానికి దాని కోసమే ఈ పుస్తకాన్ని ఇంతకాలం ఆపాం. అలాగే ఇందులో పేర్కొన్న కమిటీలు, కమిషన్‌ల నియామకాల తేదీలు, టర్మ్స్ అఫ్ రిఫరెన్స్, సభ్యుల పేర్లు సిఫార్సులు అమలయిందీ లేనిదీ, అమలైతే ఏ మేరకు అమలైందీ వంటి వివరాలు కూడా ఇందులో పొందుపరచాలనుకున్నాం. కాని ఈ డిజిటల్‌ యుగంలో కూడా అవి అరకొరగా మాత్రమే దొరకడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాం.

ఇందులో చర్చించబడిన అంశాలన్నీ భారత రాజకీయ సంవాదంలో చాలా ముఖ్య పాత్ర పోషించినవి, మరెంతో కాలం పోషించబోయేవి కూడా. కాబట్టి అందరూ చదివి వీటిని తమ అవగాహనలో భాగం చేసుకోవాలని కోరుతున్నాం.

మానవహక్కుల వేదిక

5 డిసెంబరు 2024

Recent Posts/Updates