రిజర్వేషన్ల వర్గీకరణ – ప్రజాస్వామిక దృక్పథం
మానవ హక్కుల వేదిక ప్రచురణ
ఈ పుస్తకం నవోదయ (9000413413), నవ తెలంగాణ (9490099378) లలో దొరుకుతుంది
ఎస్.సి వర్గీకరణను ఆహ్వానిద్దాం
తెలుగు నేల మీద ఎస్.సి వర్గీకరణ ఉద్యమం మొదలై ముప్పై ఏళ్లు గడిచింది. వర్గీకరణ ఆకాంక్ష చరిత్ర అంతకంటే పెద్దది. చాలా కాలంగా పరిష్కారం కాకుండా కొనసాగుతున్న ఈ వివాదం మనం నేర్చుకోదల్పుకుంటే చాలా విషయాల్ని నేర్పుతుంది. కనీసం ఇన్నేళ్ళ తర్వాతైనా సుప్రీంకోర్టు తన గత తప్పును సరిదిద్దుకుని వర్గీకరణకు అనుకూల తీర్పునివ్వడం సంతోషించాల్సిన విషయం. ఇదొక కీలక దశ. బహుశా ఇప్పుడు వర్గీకరణను ఇన్‌ప్రిన్సిపుల్ కోర్టుల ద్వారా ఆపటం అంత సులభం కాదు. దాదాపు అసాధ్యం కూడా. వారికి మిగిలింది రాజకీయ ఒత్తిడి పెంచటం. ఆ ప్రయత్నాలు ఈపాటికే మొదలయ్యాయి.
నిజానికి ఎస్.సి వర్గీకరణ డిమాండు సాపేక్షంగా వెనుకబడిన, అంతర్గతంగా కొంత చిన్నచూపును అనుభవించిన ప్రజల ఆకాంక్ష. అది ఒక ప్రజాస్వామికమైన పరిష్కారాన్ని కోరుకుంటూ ముందుకు వచ్చింది. వర్గీకరణ కోరిన మాదిగ, తదితర కులాల సాధారణ ప్రజలు ఆ నాటి దళిత (మాల) మేధావులు, దళిత (మాల) ఉద్యమ నాయకుల నుండి ఎంతో సహకారం ఆశించారు. కొంత మద్దతు అందినా అది రెండు వర్గాల ప్రజల మధ్య దూరం పెరగకుండా ఆపలేకపోయింది. ఫలితంగా రాజకీయాల్లో, సామాజిక ఉద్యమాల్లో సైతం వారి ఐక్యతకు బీటలు పడ్డాయి. అంటరాని కులాల ఆకలి కేకల ఘర్షణ తమ తరతరాల ఉమ్మడి శత్రువును మర్చిపోయింది. సోదర సమానుల మధ్య చెలరేగిన మంటల్లో ఆధిపత్య కులాలు యధేచ్చగా చలి కాచుకున్నాయి.
తమ న్యాయమైన వాటా అడిగే వర్గానికి, ముఖ్యంగా నాయకత్వానికి, తమ ఈ భౌతిక పరిస్థితికి కారణం ఎవరు, మనం ఎవర్ని లక్ష్యంగా చేసుకుంటున్నాం, దాని పర్యవసానాలు ఏమిటి అనేది అవగాహన ఉండాలి. తమ డిమాండు ఎంత న్యాయమైనదైనా తమ వేదికల నుండి వెళ్లే సందేశం దీర్ఘకాలికంగా నష్టం చేయకుండా ఉండాలి . ముఖ్యంగా సామాజిక అంతరాల పరిష్కారంలో అవతలి పక్షం మనసులు గెల్చుకోవటం అనేది సమస్య పరిష్కారాన్ని ఎంతో సులభతరం చేస్తుంది. అలాగే ఏ కారణాల వలన తాము ఒక న్యాయమైన సదుపాయాన్ని సాధించుకున్నామో దాన్ని తమలోని వారికే నిరాకరించడం, అందుకు ఆధిపత్య కులాల వారి వాదనలనే ఆలంబన చేసుకోవడం వర్గీకరణ వ్యతిరేకవాదులకు కూడా తగని పని. తమ వెనుకబాటుకు ఏ రకంగా కూడా కారణం కాని, తమతో పాటు సామాజిక వెలిని అనుభవించిన కులంలోని తటస్తుల, ఉదారవాదుల మద్దతునైనా మాదిగ ఉద్యమం కూడగట్టుకోలేకపోవడం ఒక సమస్య అయితే, మాల వర్గంలోని మేధావులు ఈ విషయంలో తీసుకోవాల్సినంత చొరవ తీసుకోకపోవడం మరో సమస్య. ఏది ఏమైనా అది గతచరిత్ర. ఇప్పుడు ఒక ప్రత్యేక దశకు చేరుకున్నాం. వర్గీకరణను ఇంకా వ్యతిరేకిస్తూ వస్తున్న వాదనల్లో చాలావరకు కాలం చెల్లినవి లేదా పూర్తిగా అసంబద్ధమైనవి. వర్గీకరణను ఎలా చేయాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని హేతుబద్ధంగా పరిష్కరించుకోవచ్చు.
ఎస్.సి వర్గీకరణను వ్యతిరేకించే మాల నాయకులకూ, మేధావులకూ, ఆ కులం ప్రజలకూ మా విజ్ఞప్తి ఏమిటంటే ఇప్పటికైనా సామరస్య పూర్వకంగా ఆలోచించి మనం ఎవరికి వ్యతిరేకంగా సంఘటితమవుతున్నామనే విషయాన్ని సమీక్షించుకోవాలని. ఈ అంతర్గత వివాదం ఇకనైనా ముగియాలి. ఉమ్మడిగా పోరాడటానికి అసంఖ్యాకమైన సమస్యలు ఉన్నాయి. వర్గీకరణ వల్ల దళితుల్లో చీలిక రావడం సంగతి అటుంచి వర్గీకరణ జరగకపోవడం వల్లనే చీలిక పెరుగుతున్నది. ఈ దశలో కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే దళితుల ఐక్యత అసాధ్యమై పోతుంది. ఎస్.సి కులాలు మళ్ళీ బ్రాహ్మణీయ కులాల నియంత్రణలోకి వెళ్తాయి. ఇదే జరిగితే ఇంతకంటే ఎక్కువ వైరుధ్యాలున్న ఓబీసీ కులాల ఐక్యత మరింత పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. దీనర్థం సమాజం అంతా కులం పేరు మీద మాత్రమే సంఘటితం కావాలని కాదు. సామాజిక అణచివేత ఈ రోజుకీ అదే ప్రాతిపదికన కొనసాగుతున్నప్పుడు, ఆధునిక రంగాల్లోనూ మరింతగా దృఢపడుతున్నప్పుడు నష్టపోతున్న వర్గాలు ఆ ప్రాతిపదికనే ఐక్యం కావడం, సామాజిక వివక్ష లేని సమాజాన్ని కోరుకోవటం కూడా ఒక ప్రజాస్వామికమైన హక్కే అవుతుంది. ఆ హక్కు సాధించుకోవాలంటే సామాజికంగా వివక్షకూ, అణచివేతకూ గురవుతున్న కులాల ఐక్యత ఒక తప్పనిసరి అవసరం. ఆ ఐక్యత సాధిస్తేనే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లోని బలహీనులందరికీ శక్తి సమకూరుతుంది.
వర్గీకరణ డిమాండు మొదలైన నాటి నుండీ అది న్యాయమైన డిమాండ్ అని బాలగోపాల్ గారు స్పష్టం చేస్తూ వచ్చారు. వర్గీకరణ జరిగితే నష్టపోయే ప్రజలనే కాదు మొత్తం సమాజాన్ని కూడా కన్విన్స్ చేయడానికి ఆయన నిరంతర ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగాను, తాను ప్రాతినిధ్యం వహించిన సంఘాల ద్వారాను కూడా ఈ ప్రయత్నం చేశారు. ఈ విషయంలో సామాజిక మద్దతు కూడగట్టడం మాత్రమే కాక, బాలగోపాల్ గారు హైకోర్టులోనూ వర్గీకరణకు అండగా నిలబడ్డారు. హైకోర్టులో ఆయన చేసిన ఆర్గ్యుమెంట్లు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించిన న్యాయవాదులకూ సహాయపడ్డాయి. జాతీయస్థాయిలో వర్గీకరణ వ్యతిరేకతను తగ్గించడానికి జాతీయ పత్రికల్లో సైతం బాలగోపాల్ వ్యాసాలు రాశారు. అటువంటి ఒక వ్యాసమే మొన్నటి సుప్రీంకోర్టు తీర్పును ప్రభావితం చేసిన డాక్యుమెంట్లలో ఒకటిగా ఉంది. ఆయన వర్గీకరణపై తెలుగులోనూ, ఇంగ్లీషులోను వివిధ సందర్భాలలో రాసిన అన్ని వ్యాసాలనూ, సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పులోని ముఖ్యమైన భాగాలనూ ఇందులో పొందుపరిచాం. వాటిని మరోసారి అందరి దృష్టికీ తేవాలని మా ప్రయత్నం.
మానవ హక్కుల వేదికగా మేము ఆయన చేసిన ఈ కృషిని మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. వర్గీకరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేము రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నాం. కోర్టుల వైపు నుండి మరోసారి అడ్డంకులు రాకుండా ఈ సారి వర్గీకరణ ప్రక్రియను శాప్రీయంగా, పూర్తి చట్టబద్ధంగా జరపాలని కోరుతున్నాం. అందుకోసం ఎస్.సి కులాల జనాభా వివరాలు, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిలో వారి ప్రస్తుత స్థానం వంటివన్నీ ముందుగానే శాస్త్రీయంగా మదింపు చేయబడాలి. ఆ సమాచారం ఆధారంగానే ఎస్.సి కులాలను ఎన్ని కేటగిరీలు చేయాలి, ఎవరెవరికి ఏ ప్రాధాన్యతా స్థానం ఇవ్వాలనేది నిర్ణయించాలి. ఎస్.సి కులాల్లో అందరి కంటే వెనుకబడిన (ఆశ్రిత/ సంచార /అర్ధ సంచార కులాలకు మొదటి ప్రాధాన్యమిస్తూ వర్గీకరణ ప్రారంభించాలి. క్రీమీలేయర్ ప్రస్తావన ఉండకూడదు. కేంద్రమే ఎస్.సి వర్గీకరణకు ఒక చట్టం చేసి, కేంద్ర సంస్థలలో కూడా ఎస్.సి వర్గీకరణను అమలు చేయాలి. వాటితో పాటు ప్రైవేటీకరణ జరిగిపోయి విద్యా, ఉద్యోగ కల్పనా సంస్థలు దాదాపు తొంభై శాతం ప్రైవేట్ రంగంలో ఉంటున్న నేపథ్యంలో ప్రైవేటు రంగంలో ఉన్న అన్ని సంస్థల్లో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాలకూ వారి జనాభా దామాషాలో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంది.
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఆధిపత్య కులాల రాజకీయ దాహానికి చెంపపెట్టుగా ఈ వివాదాన్ని ఎవరి ప్రమేయం లేకుండా పరిష్కరించుకునే సత్తా మాకుందని నిరూపించే మేధావుల, నాయకుల చొరవ కోసం కాలం ఎదురు చూస్తున్నది.
మానవహక్కుల వేదిక
2 అక్టోబర్ 2024