8th Endowment Lecture in Memory of Dr K.Balagopal
Kakatiya University, Warangal, 9 October 2017
ఒక ఎకరా 30 సెంట్ల ప్రజల లాయర్
వసుధ నాగరాజ్, అడ్వకేట్
ఒక న్యాయవాదిగా బాలగోపాల్ కోర్టుల్లో చేసిన పని గురించి చాలా తక్కువ మందికే తెలుసనుకుంటున్నాను. బాలగోపాల్ హక్కుల లాయర్ అని చాలామందికి తెలుసు కాని వాస్తవంగా ఆయన కోర్టుల్లో చేసిన పని ఏమిటో వారికి తెలియకపోవచ్చు. నేను ఇప్పుడు వరంగల్ లో, అదీ కాకతీయ యూనివర్సిటీలో మాట్లాడుతున్నాను కాబట్టి బాలగోపాల్ ఎంతగానో కృషి చేసిన ఒక హక్కుల అంశం – ఎన్ కౌంటర్ల గురించి మాట్లాడడంతో మొదలుపెడతాను. ఇక్కడ ఉన్న యువతీయువకులలో ఎంతమందికి ఎన్ కౌంటర్ మరణాల గురించి, ఆ పదానికి ఇవ్వాళ దేశంలో ఉన్న అర్ధం గురించి తెలుసో నాకు తెలియదు. దాని అర్ధం హత్యలే. ఎన్ కౌంటర్ మరణాలన్నీ పోలీసులు చేసిన హత్యలే అని గుర్తింప చేయించడానికి కన్నబిరాన్, తారకం, బాలగోపాల్, హరగోపాల్, మరెందరో చాలా పోరాడాల్సి వచ్చింది. నిజనిర్ధారణ కమిటీ, నిజనిర్ధారణ నివేదిక, హెబియస్ కార్పస్, ఎన్ కౌంటర్ మరణాలను హైకోర్టులో సవాలు చేయడం వంటి పదాలు, చర్యలు వాడుకలోకి వచ్చింది ఈ జిల్లా నుండే. నిజానికి ఇవాల్టి ప్రసంగం ఒక్క బాలగోపాల్ గురించే కాదు, కన్నబిరాన్, తారకం గార్ల గురించి కూడా.
ఈ అంశాలపై కోర్టుల్లో సవాలు చేయడమంటే ఏమిటి? నిజానికి చాలామంది హక్కుల లాయర్లకు చట్టాన్ని సవాలు చేయడమనేది ఎన్ కౌంటర్ల అంశంతోనే మొదలయ్యేది. బాలగోపాల్ ఒప్పుకోకపోవచ్చు గాని హక్కుల రిజిస్టర్ లో ఇప్పటికీ మొదటి అంశం ఎన్ కౌంటర్ మరణాలే. ఒక నేరస్తుడిని లేదా మావోయిస్టును లేదా టెర్రరిస్టును పట్టుకున్నపుడు పోలీసులు ఏం చేయాలి? భారత శిక్షా స్మృతి కింద, నేర శిక్షా స్మృతి కింద కేసు పెట్టాలి. అంతే గాని వారిని చంపాల్సిన అవసరం ఏమిటి? కాని ఈ మాట వారికి ఏ విధంగా చెప్పాలి? ఎక్కడికెళ్ళి చెప్పాలి? కోర్టులకెళ్ళే చెప్పాలి. నిజమే, ఈ అంశంపై చాలా పెద్ద పెద్ద రాజకీయ ఉద్యమాలే నడిచాయి. కాని కోర్టు నుండే కదా చివరికి న్యాయం పొందాలి.
మీ అందరికీ తెలుసు మనకు శాసనాలు చేయడానికి, పరిపాలన సాగించడానికి, న్యాయం అందించడానికి వేరు వేరు శాఖలు ఉన్నాయి. పరిపాలనా, కార్యనిర్వాహక శాఖలు చేసే పనులు, చేయవలసిన బాధ్యత ఉండి కూడా చేయకుండా ఉండే పనులు – వీటి మీద చెక్ పెట్టాల్సింది న్యాయ శాఖ అని కూడా మీకు తెలుసు. కాబట్టి పోలీసు స్టేషన్ లో ఒక వ్యక్తి చిత్రహింసలకు గురైతే, లేదా మాయమైతే, లేదా ఒక మండల రెవెన్యూ అధికారి తను చేయాల్సిన పని చేయకపోతే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? వాటిని పట్టించుకునే ప్రజా ఉద్యమాలు ఉండొచ్చు కాని కోర్టులు కూడా ఉన్నాయి. ఎన్ కౌంటర్ల విషయానికి వచ్చినపుడు వాటిని సవాలు చేస్తూ హక్కుల లాయర్లు మొదట వెళ్ళింది హైకోర్టుకే. ‘చట్టం మౌనంగా ఎలా ఉండగలుగుతుంది? పోలీసులు చేసిన పనిని మీరు ఎలా ఆమోదించగలుగుతారు? ఆ ఘటన మీద కోర్టులో విచారణ జరపండి’ అని వాదించారు. మిస్సింగ్ కేసుల విషయానికి వస్తే కన్నబిరాన్, బాలగోపాల్ మొదట కోర్టులకే వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ లు వేశారు. ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినపుడు ఏమవుతుంది? సంబంధిత పోలీసు స్టేషన్ కి, కమిషనర్ కు, మరి కొందరికి నోటీసులు వెళతాయి. ఫలితంగా అరెస్టయిన వ్యక్తిని జుడీషియల్ రిమాండ్ కి పంపిస్తారు. అంటే జైల్లో ఉంటాడు; అది తక్కువ ప్రమాదం, పోలీసు కస్టడీలో ఉండకపోతే చాలు. హక్కుల యాక్టివిజంలో, జుడీషియల్ యాక్టివిజంలో అది ఒక ముఖ్యమైన సూత్రం. ఈ విషయాలన్నీ హక్కుల యాక్టివిస్టుల దగ్గర నుండే తెలుసుకున్నాను నేను.
పోలీసు స్టేషన్ లలో జరిగే చిత్రహింసలకు బాధ్యులు ఎవరు? ఒక కేసు నమోదైనపుడు విచారణ జరపమని నేర శిక్షా స్మృతి చెబుతుంది. కాని దాని అర్ధం పోలీసులు చిత్రహింసలు పెట్టొచ్చని కాదు కదా! అలాగే అరెస్టయిన వ్యక్తి పది మందిని చంపిన మావోయిస్టు కాబట్టి పోలీసులు అతని పట్ల ఎలాగైనా ప్రవర్తించవచ్చన్న అర్ధం కూడా కాదు కదా! ఈ అంశాలన్నిటి మీదా 1970 లలో, 1980 లలో, 1990 లలో కూడా హక్కుల లాయర్ లు, ముఖ్యంగా బాలగోపాల్ లాంటి వాళ్ళు ఎంక్వయిరీ కమిషన్ల ముందు, హైకోర్టు ముందు నిరంతరం మాట్లాడుతూనే వచ్చారు. ఇప్పుడున్న హక్కుల లాయర్లు కూడా ఈ విషయాల మీద ధైర్యంగా కేసులు వేస్తున్నారు నిజమే కాని ఇప్పుడు ఈ కేసులు వేయడం అంత ప్రమాదకరమేమీ కాదు. కాని 1980 లలో, 1990 లలో కోర్టుకెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడమన్నా, ఒక ఎన్ కౌంటర్ మరణాన్ని సవాలు చేయడమన్నా చాలా ప్రమాదకరమైన పనిగా భావించబడేది. అదృష్టవశాత్తూ ఇవ్వాళ, కనీసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పరిస్థితి అలా లేదు. మిగతా రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉందో నాకు సరిగ్గా తెలియదు కాని ఇక్కడ మాత్రం కన్నబిరాన్, బాలగోపాల్ లాంటి వాళ్ళు చేసిన కృషి వల్ల అది ఇప్పుడంత కష్టమైన పనిగా లేదు. (అయితే గత రెండేళ్లలో పరిస్థితులు మారాయి. ఇప్పుడు ప్రజల పక్షాన వాదించే లాయర్లందరినీ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతోంది – వక్త)
అప్పట్లో హక్కుల లాయర్ల కోర్టు కేసులు ఎన్ కౌంటర్ మరణాలు, అక్రమ నిర్బంధాలు, టాడా కేసులతో మొదలయ్యేవి. ఇక్కడున్న సీనియర్లందరికీ ఈ విషయాలు తెలుసు. ఈ అంశాలతో పరిచయం లేని వారి కోసం నేను ఇవన్నీ చెబుతున్నాను. అవి టాడా కేసులైనా, దొంగతనం కేసులైనా, బందిపోటు దొంగతనం కేసులైనా ఎక్కువ భాగం బూటకపు కేసులే ఉండేవి లేదా ఏ మాత్రం సాక్ష్యాధారాలు లేని కేసులై ఉండేవి. అందువల్ల మళ్ళీ హక్కుల లాయర్లే క్రిమినల్ కోర్టులకెళ్ళి వారి తరఫున వాదించాల్సి వచ్చేది. ముఖ్యంగా మావోయిస్టుల కేసులను, ఇప్పుడైతే టెర్రరిస్టుల కేసులను కూడా. ఎన్నో బూటకపు కేసుల్ని పెట్టేవారు. హక్కుల లాయర్ల పని ముఖ్యంగా రెండు విధాల ఉండేది. ఒకటి – పోలీసుల చర్యలకు జవాబుదారీ వహించమని హైకోర్టు ద్వారా ప్రభుత్వాన్ని ఆదేశించడం; రెండు – క్రిమినల్ కోర్టుల్లో వాదించి నిందితులను విడుదల చేయించడం. ఇదే వారి ముఖ్యమైన పని అయిపోయింది. యాక్టివిస్ట్ లలో ఎక్కువమంది బాలగోపాల్ ను ఎన్ కౌంటర్ మరణాలు, అక్రమ అరెస్టులను సవాలు చేసే లాయర్ గా చూస్తారు కాని నిజానికి ఆయన వాటి కంటే ఇతర అంశాలపైనే ఎక్కువ కేసులు చేశారు.
బాలగోపాల్ చనిపోయాక ఆయన ఆఫీసు కెళ్ళి ఆయన చేస్తున్న కేసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అది చాలా చిన్న గది. ఎక్కడ చూసినా ఫైళ్లు పడేసి ఉన్నాయి. లెక్క పెట్టడం మొదలుపెట్టాం. దేనికి సంబంధించిన కేసులివి? ఈయన క్లయింట్లు ఎవరు? ఎంతమంది ఉన్నారు అని చూస్తే ఆ రోజున మేము 756 కేసుల్ని లెక్క పెట్టాం. వాటిని వివిధ కేటగిరీల కింద విభజిస్తే అందులో 400 కేసులు కేవలం లేబర్ కేసులే ఉన్నాయి. నేనైతే షాక్ అయ్యాను. ఇంకో పెద్ద కేటగిరీ భూమి సంబంధిత కేసులు. అవి 300 దాకా ఉన్నాయి. స్త్రీలకు సంబంధించి ఒక 20 (గృహ హింస, మనోవర్తి మొదలైన కేసులు), ఎన్ కౌంటర్ కేసులు ఒక 5 కనిపించాయి. అమ్మో…ఏమిటిది? లేబర్ కేసులే నాలుగు వందలా! అంటే ఆయన వాస్తవానికి లేబర్ లాయరా! రాష్ట్రం మొత్తం నుండి ఆయనకు కేసులు వచ్చేవి. హైదరాబాద్ లో ఆయన లేబర్ కోర్టులకు వెళ్ళేవాడు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ కి వెళ్ళేవాడు. కేంద్ర ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కి కూడా వెళ్ళేవాడు, ఎ.పి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి వెళ్ళేవాడు.
లేబర్ కేసుల విషయానికి వస్తే యూనియన్లు పెట్టుకోగానే వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలయ్యేది. యూనియన్ పెట్టీ పెట్టగానే టెర్మినేషన్లు, రెట్రెంచ్ మెంట్లు, అన్ని రకాల అక్రమ పద్ధతులూ మొదలవుతాయి. అక్రమ పద్ధతులంటే ఏమిటి? యూనియన్ పెట్టగానే నీ ఇంక్రిమెంట్ ఆపేస్తారు. నీ బోనస్ ఆపేస్తారు. లేదా ఉద్యోగం నుండి పీకి పారేస్తారు. కాబట్టి వాటన్నిటినీ సవాలు చేస్తూ కోర్టుల్లో కేసులు వేయాల్సి వస్తుంది. మొత్తం రాష్ట్రం సంగతి నాకు తెలియదు గాని ఒక్క హైదరాబాద్ నగరంలోనే బాలగోపాల్ లేబర్ చట్టాలను పాటించని అనేక హోటల్ కార్మికుల కేసులు వాదించారు. ఎన్ కౌంటర్ మరణాలపై ప్రభుత్వంతో పోరాడడం ఒక ఎత్తు అయితే, లేబర్ కేసులపై పోరాడడం మరో ఎత్తు.
నిజానికి మొదటిదే తేలిక, రెండోదే ఎక్కువ కష్టం అని బాలగోపాల్ అనుకుని ఉండొచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే యజమానులు, మేనేజ్మెంట్ల తరఫున కేసులు వాదించడానికి వచ్చే లాయర్లతో వేగడం చాలా కష్టం. అయినా అలాంటి కేసులు ఆయన 400 దాకా చేశాడు. పైగా హైకోర్టులో కూడా కాదు. అక్కడ పరిస్థితి కాస్తయినా మెరుగ్గా ఉంటుంది. ఆయన ఈ కేసులన్నీ లేబర్ కోర్టులలో, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ లో చేశాడు. సగం టైం ఈ కోర్టులు అసలు పని చేయవు. అడిగీ అడగక ముందే వాయిదాలు ఇచ్చేస్తారు.. ఇవాల్టి పరిస్థితుల్లో లేబర్ లా కేసులు చేయడం చాలా కష్టం. కోర్టుకొచ్చి ఎవరూ న్యాయాన్ని నేరుగా చంపనక్కరలేదు. వాయిదాలు తీసుకుంటూ పోతే చాలు, అదే న్యాయాన్ని చంపేస్తుంది. వాయిదా తర్వాత వాయిదా, వాయిదా తర్వాత వాయిదా తీసుకుంటూ పోతారు. కేసు కట్ట తీసి చూస్తే ప్రతి కేసులో కనీసం 50 హాజర్లు ఉంటాయి. ప్రతి వాయిదాకూ వెళ్ళాల్సిందే. పొరపాటున ఏ వాయిదాకైనా మేము వెళ్ళకపోతే జడ్జి ఆ రోజే ఏదైనా ఆర్డర్ ఇచ్చేయొచ్చు. అందువల్ల మేము వెళ్ళక తప్పదు. కాబట్టి ఊహించండి బాలగోపాల్ లేబర్ కోర్టుల్లో ఎంత సమయం వెచ్చించి ఉంటారో.
ప్రతి కంపెనీలో యూనియన్ పెట్టగానే యూనియన్ ఏర్పాటు మీదే కేసు వేస్తారు. ఆ తర్వాత అది సక్రమంగా ఏర్పాటు కాలేదని ఇంకొక కేసు వేస్తారు. ఆ తర్వాత సుమారు ఓ 20 మందిని ఉద్యోగాల నుండి బర్తరఫ్ చేస్తారు. వాళ్ళు కేసులు వేస్తారు. నేను అన్ని రకాల సంస్థల గురించి మాట్లాడుతున్నాను. కొందరు కార్మికులకు ఇంక్రిమెంట్లో మరొకటో కట్ చేస్తారు. వాళ్ళందరూ కోర్టుకు వెళతారు. వెరసి ప్రతి సంస్థకు సంబంధించి 30, 40 కేసులు దాఖలవుతాయి. వేరే ఎన్నో పనులు చేస్తూ బాలగోపాల్ ఈ కేసులన్నీ చూసేవారు. పైగా లేబర్ కోర్టులన్నీ ఒక చోట ఉండవు. సిటీ అంతటా ఉంటాయి.
ఇదొక పార్శ్వమైతే నేను ఆశ్చర్యపోయిన మరొక విషయం ఏమిటంటే ఆయన చేసిన సర్వీస్ లా కేసుల సంఖ్య. క్రిమినల్ కేసులు, ఎన్ కౌంటర్ మరణాల కేసులు మాత్రమే కనిపిస్తాయనుకుని వెళ్ళిన దాన్ని కదా! సర్వీస్ లా లో కూడా ఆయన అనేక రకాల ఉద్యోగ సంబంధిత కేసులను చేశారు. అవన్నీ ఒక్క హైకోర్టులో చేసిన కేసులు కూడా కావు; ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కు వెళ్ళి చేసినవీ చాలా ఉన్నాయి. చాలామంది దళిత, ఆదివాసీ ఉద్యోగులకు సకాలంలో ప్రమోషన్లు రావు. లేదా ఇంకేదో అన్యాయం జరుగుతుంది. ఉద్యోగం దొరికాక కూడా పై మెట్లు ఎక్కే క్రమంలో వారు ఎన్నో రకాల వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కేసులన్నీ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి వెళతాయి. మొదట నేను చెప్పిన 756 కేసులు కాక ఇవి మరో 200, 300 ఉంటాయి. ఇవి కాక కేంద్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో కూడా కేసులున్నాయి. బాలగోపాల్ సంవత్సరానికి ఎన్ని కేసులు చేసేవాడా అని ఒక్కొకసారి ఆలోచిస్తుంటా. హైకోర్టులో కనీసం వంద కేసులు, లేబర్ కోర్టులు, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, కేంద్ర ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ వాటన్నిట్లోను కలిపి మరికొన్ని వందల కేసులు. హైకోర్టులో కూడా ఆయనకు లేబర్ కేసులు ఉండేవి.
లేబర్ తర్వాత ఆయన చేసిన ఎక్కువ కేసులు, భూమికి సంబంధించిన కేసులు. అవన్నీ ఆదివాసులకు, దళితులకు సంబంధించిన కేసులే. అందులో మళ్ళీ ఎన్నో రకాలు. సింహ భాగం LTR కేసులు అయినప్పటికీ వాటి గురించి తర్వాత మాట్లాడతాను. మొదట గొత్తికోయల కేసుల గురించి చెబుతాను. వాళ్ళు ఛత్తీస్ గఢ్ నుండి వచ్చి ఇక్కడ, అంటే ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఇళ్ళు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం వారి ఇళ్ళను తగలబెట్టించింది. గొత్తికోయల ఇళ్ళని తెలిస్తే చాలు, వెళ్ళి తగలబెట్టేస్తున్నారు. ఇంకో రకమైన భూమి సమస్య మన రాష్ట్రానికే చెందిన ఆదివాసీ తెగలది. ముఖ్యంగా కోయలది. వారు తాతల, తండ్రుల కాలం నుండి ఇక్కడి అటవీ భూముల్లోనే బతుకుతున్నామని చెపుతారు కాని వాళ్ళ దగ్గర సాక్ష్యంగా ఒక్క కాగితం కూడా ఉండదు. వాళ్ళ గురించి కోర్టులో ఎలా వాదించాలి? మూడో రకం కేసులు ప్రభుత్వ భూముల ‘ఆక్రమణ’లకు సంబంధించినవి. చాలామంది దళితులు, ఆదివాసులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకోవడమో, ఇళ్ళు కట్టుకోవడమో, గొర్రెలనో బర్రెలనో మేపుకోవడమో చేస్తుంటారు.
ఇప్పుడు మొదట ప్రస్తావించిన LTR కేసుల గురించి చెబుతాను. ఆయన చేసిన భూమి సంబంధ కేసుల్లో ఇవే అత్యధికం అని చెప్పా కదా! ఒక ఎకరా 30 సెంట్ల భూమి ఉండే ఒక ఆదివాసీ, దళిత రైతు కోసం బాలగోపాల్ కనీసం 20 సార్లు కోర్టుకు వెళ్ళి ఉంటారు. అంత చిన్న రైతు కోసం కూడా ఆయన అంత గట్టి ప్రయత్నం చేసేవారు. ఏజెన్సీ ప్రాంతాలను ఏర్పరచింది రాజ్యాంగమే; ఆదివాసుల ప్రయోజనాల పరిరక్షణ కోసం LTR చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వమే. అయినా ఆదివాసులకు ఆ భూములు దక్కడం లేదు. గత ఏడాది ఇదే వేదిక నుండి బాలగోపాల్ గారి స్మారకోపన్యాసం చేసిన లాయర్ త్రినాథరావు గారు ఈ కేసుల గురించి చెప్పే ఉంటారు. LTR చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఒక ఆదివాసి భూమిని ఒక ఆదివాసేతరుడికి బదిలీ చేయడానికి వీలు లేదు. అది చెల్లదు. కాని ఏం జరుగుతుందంటే ఒక ఆదివాసి తన భూమి కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం జరిపి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుండి అనుకూల ఉత్తర్వు పొందిన తర్వాత కూడా ఆ భూమి అతనికి దక్కడం లేదు. ఆ భూమి తనదని వాదించే ఆదివాసేతరుడు హైకోర్టుకు వెళ్ళి వెంటనే స్టే తెచ్చేసుకుంటున్నాడు. కాబట్టి స్థానిక ఏజెన్సీ కోర్టులలోనే కాక, ఆ స్టే ఉత్తర్వులను ఎత్తేయించడానికి కూడా మనకు హైకోర్టులో లాయర్లు కావాలి. ఆదివాసి పిటిషనర్ వాదనకు అవకాశం ఇవ్వకుండా హైకోర్టు చాలా సులభంగా అడ్మిషన్ స్థాయిలోనే స్టేలు ఇచ్చేస్తుంటుంది. ఆ ఆదివాసి పిటిషనర్ సమస్యను కోర్టు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ కేసులు ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినవని, అది ఒక ప్రత్యేక చట్టం కింద వారికి లభించిన రక్షణ అని కోర్టు మరిచిపోకూడదు. ఈ కేసుల్లో బాలగోపాల్ ప్రధాన వాదన ఏమిటంటే హైకోర్టు వాటిని ప్రైవేటు ప్రాపర్టీ కేసుల్లాగా చూడకూడదని. ప్రైవేటు ప్రాపర్టీ కేసుల్లో క్లయింట్లు ‘ఆస్తి నా స్వాధీనంలో ఉంది, దానికి సంబంధించిన కాగితాలు కూడా నా పేరుతోనే ఉన్నాయి కాబట్టి నాకు స్టే ఇవ్వండి’ అని వాదిస్తారు. కాని రాజ్యాంగం ఆ ప్రాంతాన్ని ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత అక్కడి కేసులకు ప్రైవేటు ప్రాపర్టీ సూత్రాలను ఎలా అన్వయిస్తారు అనేది బాలగోపాల్ వాదన. అసంఖ్యాక కేసుల్లో బాలగోపాల్ వ్యక్తిగత ఆస్తి కేసులకు వర్తించే ఆ సూత్రం ఈ కేసులకు వర్తించదని హైకోర్టుకు చెప్పడానికి ప్రయత్నించారు. చివరి క్షణం వరకు ఆయన ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
చనిపోయే రోజున కూడా ఆయన కార్మికులకు సంబంధించిన ఒక కేసులో హైకోర్టులో వాదించారు. కార్మికులు రాజీకి ఒప్పుకున్నారని బాలగోపాల్ ఆ రోజు కోర్టులో అన్నట్టు ఆ కేసులోని అవతలి పక్షం లాయరు ఆయన చనిపోయిన తర్వాత నాతో అన్నారు. అలా జరగనే జరగదు అని చెప్పా నేను. కార్మికులు గాని, ఆదివాసులు గాని రాజీకి వస్తారని ఆయన ఛస్తే చెప్పరని నేను అన్నాను. అంటే చనిపోయే రోజున కూడా ఆయన ఈ కేసుల కోసమే హైకోర్టుకు వచ్చారు.
ఇప్పటిదాకా మూడు రకాల కేసులు చెప్పాను. ఒకటి లేబర్, రెండు సర్వీస్, మూడు భూమి. ఇంకా స్త్రీల కేసులు, కుల వివక్ష కేసులు వంటి ఇతర రకాల కేసులు చాలా ఉన్నాయి. కుల వివక్ష కేసుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఒక దళితుడు అత్యాచారం కేసు పెట్టగానే అవతలి వ్యక్తి అంటే దళితేతరుడు హైకోర్టుకు వెళ్ళి తనకు అనుకూలమైన ఆర్డర్ ఏదో తెచ్చుకుంటాడు. అదేమిటో గాని ఆదివాసేతరులకు, దళితేతరులకు హైకోర్టులో ఎప్పుడూ మంచి నెట్ వర్క్ లు ఉంటాయి. అందువల్లే ఏదైనా జరిగితే వెంటనే హైకోర్టుకు వచ్చి కేసు మీద స్టే ఆర్డర్ గాని, అరెస్టు మీద స్టే ఆర్డర్ గాని సులభంగా తెచ్చేసుకుంటారు. ఇలాంటి దళిత అత్యాచారాల కేసులెన్నో బాలగోపాల్ ఆఫీస్ లో ఉన్నాయి. చుండూరు దళిత హత్యల కేసులో ఆయన చాలా పని చేశారు. మీకందరికీ చుండూరు కేసు గురించి తెలిసే ఉంటుంది. అక్కడ 8 మంది దళితులను అగ్రకులస్తులు చంపారు. హతుల కుటుంబాలు చుండూరులోనే విచారణ జరగాలని పట్టు పట్టి ప్రత్యేక కోర్టును సాధించుకున్నారు. కాని అగ్ర కులస్తులు చీటికీమాటికీ ఏదో ఒక నెపం మీద హైకోర్టుకెళ్ళి విచారణ జరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
అగ్ర కుల, అగ్ర వర్ణ మనుషులకు హైకోర్టుకు వెళ్ళడం చాలా తేలిక, ఆ ఖర్చును వాళ్ళు పెట్టుకోగలరు. కాని దళితులకు, ఆదివాసులకు, స్త్రీలకు అది చాలా కష్టమైన పని. హైకోర్టుకు వెళ్ళలేకే చాలామంది అపీలు వేసుకోకుండా కేసును వదిలేసుకుంటారు. ఖర్చులు ఎక్కువనే కాకుండా అన్ని సార్లు తిరిగే శక్తి కూడా వాళ్లకు ఉండదు. లాయర్ గురించి టెన్షన్ ఉండనే ఉంటుంది. కేసు సరిగ్గా చేస్తున్నాడా లేక అవతలి పక్షం వాళ్ళతో కుమ్మక్కై పోయాడా అని భయపడుతూ ఉండాలి. హైదరాబాద్ లో బతుకుతున్న మాబోటి వాళ్ళం కూడా సుప్రీంకోర్టు గురించి అలాగే భయపడుతుంటాం. అమ్మో…సుప్రీంకోర్టుకు వెళ్ళడమే, ఫీజులు భరించలేం, అక్కడి లాయర్లు ఎవరూ మనకు తెలియదు అనుకుంటాం. అలాగే జిల్లాల క్లయింట్లు కూడా హైదరాబాద్ రావడానికి భయపడుతుంటారు. హక్కుల లాయర్లు ఉన్నపుడే వాళ్ళు ధైర్యంగా రాగలుగుతారు. లేదా హక్కుల లాయర్ అనే ముద్ర లేకపోయినా ఆ కేసులను నిజాయితీగా చేసే లాయర్లు ఉన్నపుడు రాగలుగుతారు. అయితే వారి సంఖ్య చాలా తక్కువ. ప్రధానంగా హక్కుల లాయర్లే ఈ కేసుల్ని వాదించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఒక లాయర్ గా బాలగోపాల్ ను, ఆయన పనిని పరిశీలించే ప్రయత్నం చేస్తా. బాలగోపాల్ వారానికి ఐదు రోజులు, అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా కోర్టుకు వచ్చేవాడు. అయితే ప్రతి శుక్రవారం సాయంత్రం రైలో, బస్సో ఎక్కి ఏదో ఒక ఊరికి వెళ్ళి మళ్ళీ సోమవారం పొద్దున దాకా హైదరాబాద్ తిరిగి వచ్చేవాడు కాదు. బాలగోపాల్ ప్రయాణాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన చనిపోయాక మేము లెక్క పెట్టిన 756 కేసులలో ఇరవయ్యో, ముప్పయ్యో కేసుల్ని మాత్రమే క్లయింట్లు వచ్చి తీసుకెళ్ళారు. మిగతా కేసుల కట్టలన్నీ ఆఫీస్ లో ఉండిపోయాయి. ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అరె…ఎందుకు ఎవరూ వచ్చి తీసికెళ్ళడం లేదని నేను ఆశ్చర్యపోతుండేదాన్ని. ఫోన్ చేసి అడుగుదామంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా లేవు. అంతమంది క్లయింట్లు అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారా అనుకునేదాన్ని. ఈ కేసులలో కొన్ని నేను ఇంతకు ముందు చెప్పిన ఒక ఎకరా 30 సెంట్ల వాళ్ళ కేసులు. కాని కొన్ని పెద్ద కేసులు. అన్నీ మా దగ్గరే అలా ఉండిపోయాయి. ఒక కేసు అయితే పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంకు చెందిన 80 ఎకరాల భూమికి సంబంధించిన కేసు. కొన్ని సార్లు వాళ్ళ నిర్లక్ష్యానికి భలే కోపం కూడా వచ్చేది. అయితే క్రమేణా నాకు అర్ధమైనదేమిటంటే ఈ ఆఫీస్ పూర్తిగా వేరే రకమైన ఆఫీసని. ఈ కేసులన్నీ ఆయన దగ్గరకు రాలేదు, క్లయింట్లు బస్సో, రైలో ఎక్కి ఆయన దగ్గరకు వచ్చి ఇచ్చిన కేసులు కావివి. బాలగోపాల్ తన వారాంతపు ప్రయాణాలలో కనుగొన్న కేసులివి. ఈ క్లయింట్లు పేదలు, బలహీనులు మాత్రమే కాదు, వారు ఎవరికీ కనబడని ‘అదృశ్య’ క్లయింట్లు కూడా.
బాలగోపాల్ ఆ మారుమూల గ్రామాలకు వెళ్లకపోయి ఉంటే ఈ కేసులు హైకోర్టు దాకా వచ్చి ఉండేవే కావు. మనకు హైకోర్టులో, సెషన్స్ కోర్టులలో, సిటీలో, జిల్లాలలో అనేకమంది లాయర్లున్నా బాలగోపాల్ లాగా ఇలా ఊర్లకు వెళ్ళి బాధితుల్లోని చిట్టచివరి వాడిని కూడా వెతికి పెట్టుకుని కేసులు వేసిన లాయర్లు అతి కొద్ది మంది మాత్రమే. ఇది అన్యాయాలను రికార్డు చేయడం మాత్రమే కాదు, ఒక నిజ నిర్ధారణ నివేదికగా బయటి ప్రపంచానికి తెలియజేయడం మాత్రమే కాదు; ఒక హక్కును న్యాయపోరాటంగా, ముందుకు తీసుకుపోవడం, కోర్టులో పిటిషన్ గా మార్చడం. తర్వాత ఆ క్లయింట్లతో మాట్లాడితే నాకు అర్ధమైంది ఆ కేసులు కోర్టు దాకా ఎలా వచ్చాయో. “ఆ సార్ వచ్చి మా దగ్గర సంతకాలు తీసికెళ్ళాడు. ఆ తర్వాత ఏమైందో మాకేమీ తెలియదు” అన్నారు వాళ్ళు. ఆ లాయర్ తన కోసం ఒక స్టే ఆర్డర్ తెచ్చాడని కూడా క్లయింటుకు తెలియదు. అయితే ఆ అత్యంత పేద, బలహీన, అదృశ్య క్లయింటుకు ఒకటి మాత్రం తెలుసు తన భూమి నుండి తనను ఎవరూ గెంటేయడం లేదని. మరి వాళ్ళు కేసులు వెనక్కి తీసుకోలేదంటే ఆశ్చర్యమేముంది? ఇటువంటి క్లయింట్ లు ఇంకెక్కడా కనబడరు బాలగోపాల్ ఆఫీసులో తప్ప.
లాయర్ గా బాలగోపాల్ గురించి చెప్పాల్సిన విషయం ఇంకోటుంది. పేదలు, స్త్రీలు, దళితులు, ఆదివాసులు, కార్మికుల కోసం కేసులు వేసే లాయర్లు చాలామందే ఉంటారు. అయితే వాళ్ళ వాదనలు ఎక్కువగా – యువర్ లార్డ్ షిప్…అతను చాలా పేదవాడు, ఆదివాసి – అంతే, వాక్యం అక్కడితో ఆగిపోతుంది. పేదవాడు, ఆదివాసి అదొక్కటే వాళ్ళకుండే వాదన. కాని పాపం ఆ పేదవాడి, ఆ ఆదివాసి, ఆ దళితుడి, ఆ స్త్రీ జీవితంలో ఇంకేదో ఉంటుంది కదా! వారు కోర్టుకు వచ్చి కేసు వేయడానికి ఒక నేపధ్యం ఉంటుంది కదా! కాని చాలాసార్లు ఏదో దయాబిక్ష అడిగినట్టు అడుగుతారు. కాని బాలగోపాల్ ఎప్పుడూ ఆ విధంగా వాదించలేదు. ప్రతి పిటిషనర్ వేసే కేసుకు ఆయన ఎంతో వివరమైన, అవసరమైన, జ్ఞానవంతమైన నేపధ్యాన్ని సమకూర్చేవారు. ఇంకా చెప్పాలంటే ఆయన వాదనల్లో పేద అనే పదం ఎప్పుడూ ‘పేద’ అనే అర్ధంలో ధ్వనించదు; ఎంతో విలువైన, పదునైన వాదన వినిపించేందుకు ఒక సాధనంగా ఆయన దాన్ని వాడతారు. నేను ఆయన పుస్తకాలు ఎక్కువ చదవలేదు కాని అది నాకు ఎప్పుడూ లోటుగా అనిపించలేదు ఎందుకంటే వాటి సారమంతా నేను ఆయన కేసు ఫైళ్ళలో చదివాను. ఉదాహరణకు మళ్ళీ గొత్తికోయల ఇళ్ళ దహనం కేసుల్నే తీసుకుందాం. అటవీ శాఖ వాళ్ళు ఎందుకు తగలబెడుతున్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఆపాల్సిన అవసరం ఏమిటో, మొత్తం ఛత్తీస్ గఢ్ కల్లోలం, సల్వాజుడుం ఆవిర్భావం, అన్ని విషయాలూ ఆ పిటిషన్ లో ఉంటాయి. గొత్తికోయలు దంతేవాడ నుండి ఖమ్మం జిల్లాకు ఎందుకు రావాల్సి వచ్చిందీ, ఎందుకు సరిహద్దులు దాటాల్సి వచ్చిందీ, ఇక్కడ బిచ్చగాళ్ళలా ఎందుకు బతకాల్సి వస్తున్నదీ ఆ విషయాలన్నీ అందులో ఉంటాయి.
ఇంకో ఉదాహరణ కూడా చెబుతాను. కరీంనగర్ జిల్లా మల్హర్ రావు మండలంలో ఒక పెద్ద ప్రభుత్వ జాగా ఉంది. ఇప్పుడు అది ఏ జిల్లాలో ఉందో నాకు సరిగ్గా గుర్తు లేదు. వేరే జిల్లలో కూడా ఉండొచ్చు. ఎప్పుడో చాలా ఏళ్ళ కిందట 600 మంది దళితులు, ఆదివాసులు కలిసి ఆ భూమిని ఆక్రమించుకుని పంటలు పండించుకుంటున్నారు. ఆక్రమణకు కారణం? 50 సంవత్సరాల క్రితం తమ ఊరి చుట్టుపక్కల గ్రామాలలో కలరా మహమ్మారి వ్యాపించడంతో వాళ్ళు ఇల్లు, పొలాలు, ఊర్లు వదిలి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళ వారసులే ఇప్పుడు అందులో వ్యవసాయం చేసుకుంటున్నారు. బాలగోపాల్ తయారు చేసిన కేసు ఫైల్ లో ఆ ప్రాంత చరిత్ర, వలస రావాల్సిన పరిస్థితులు మొదలైన వివరాలన్నీ ఉంటాయి. అలాగే వంశధార ప్రాజెక్ట్ మీద ఆయన కేసు ఫైల్ చూస్తే నిర్వాసితుల సమాచారమే కాదు, ప్రాజెక్ట్ గురించి కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఒరిస్సా నుండి శ్రీకాకుళం వరకు కాలువ ఎడమ వైపు ఉందా, కుడి వైపు ఉందా; ఎడమ వైపు ఎంతమంది నిర్వాసితులయ్యారు, కుడి వైపు ఎంతమంది నిర్వాసితులయ్యారు; మొత్తం వంశధార ప్రాజెక్ట్ చరిత్ర అంతా ఆ ఫైల్ లో చదువుకోవచ్చు మనం. నేను ఈ విషయం ఎందుకు చెపుతున్నానంటే ఒక కేసుకు నేపధ్యం సమకూర్చడం బాలగోపాల్ కు అకడమిక్ వ్యవహారం కాదు. కేవలం అకడమిక్ కారణాల కోసమైతే ఆయన ఏ కేసుకైనా చాలా సునాయాసంగా దాని నేపధ్యాన్ని సమకూర్చగలరు కాని ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈ క్లయింట్లలో చాలామంది ఎటువంటి కాగితాలూ లేకుండా ఆయన దగ్గరకు వస్తారని. కాగితాలు లేకుండా హక్కులు సాధించుకుందామని కోర్టుకొస్తే ఏమవుతుందో తెలుసా! ఏ కోర్టూ వారి వాదనను అంగీకరించదు. కాని వాస్తవం ఏమిటంటే ఈ దేశంలోని పేదల వద్ద, దళితుల వద్ద, ఆదివాసుల వద్ద ఎలాంటి కాగితాలూ ఉండవు. రాజ్యం వాళ్ళ దగ్గర అటువంటి కాగితాలు ఏమీ లేకుండా జాగ్రత్త పడుతుంది. అందువల్ల ఇలాంటి కేసులలో వారిని రక్షించగలిగేది ఆ నేపధ్య వివరణే, సందర్భం అర్ధమయ్యేలా జడ్జిలకు వివరించగలిగే సమాచారమే. అలా చేస్తేనే జడ్జిలు ఒక ఇంటిని కూలగొట్టకుండా ఆపేందుకు, లేదా ఒక పొలం నుండి వారిని వెళ్ళగొట్టకుండా ఆపేందుకు స్టే ఆర్డర్లు ఇవ్వగలుగుతారు. కాగితాల లేమిని ఎదుర్కొనేందుకు అదొక్కటే మార్గం. బాలగోపాల్ ఆ మార్గాన్నే అనుసరించాడు. ఆయన ప్రతి పిటిషన్ లోను ఆయా గ్రామాలు, క్లయింట్లకు సంబంధించి ఎంతో విలువైన సమాచారం ఉంది. ఒక ఎన్ కౌంటర్ కేసులో హతుడి భార్య న్యాయమైన, నిష్పక్షపాతమైన విచారణ జరపమని కోర్టును కోరింది. అందులో ఒక చిన్న వివరం ఉంది. భర్తను పోలీసులు తీసికెళ్ళేటపుడు ఆమె జీపు వెనకాల పరిగెత్తి, మావోయిస్టుగా అనుమానించబడుతున్న తన భర్తకు 5 రూపాయలు, కేవలం 5 రూపాయలు, రాత్రి భోజనానికని ఇస్తుంది. తర్వాత ఆమెకు తెలుస్తుంది ఆ రాత్రే అతన్ని ఎన్ కౌంటర్ లో కాల్చి చంపేశారని. బాలగోపాల్ ఎన్ కౌంటర్ లపై వేసిన కేసుల్లో ఇలాంటి వివరాలు ఎన్నో ఉంటాయి. బాలగోపాల్ రచనలు పుస్తకాలుగా వేస్తే వంద దాకా అవొచ్చంటారు, ఆయన కేసు ఫైల్స్ కూడా అచ్చు వేస్తే ఇంకెన్ని పుస్తకాలు అవుతాయో! పైగా వాటిలో పునరావృతాలు గాని, అతిశయోక్తులు గాని, సెంటిమెంట్లు గాని ఏమీ ఉండవు. కొందరు లాయర్లు ఎక్కువ చక్కెర వేసి టీ తయారు చేసినట్లు ప్రతి కేసునూ చాలా ఎక్కువ సెంటిమెంట్ తో నింపేస్తారు. బాలగోపాల్ ఆ పని ఎప్పుడూ చేయలేదు. ఆయన పిటిషన్లన్నీ గట్టి వాదనతో ఉంటాయి.
ఇప్పుడు చెప్పబోయే అంశం నాకు అత్యంత ఇష్టమైన విషయం – ఒక లాయర్ గా ఆయన కోర్టులో ఎలా నడుచుకున్నాడనేది. అందరి దృష్టీ తన వైపు ఉండాలని కోరుకోని వ్యక్తి బాలగోపాల్. కేసుకు అవసరమైనంత మేరకే మాట్లాడతాడు. గొత్తికోయలు, స్త్రీలు, ఎన్ కౌంటర్ మరణాల వంటి కేసుల్ని వాదించేటపుడు మా బోటి లాయర్లు అనుకూల ఆర్డర్ల కోసం జడ్జిల కాళ్ళా వేళ్ళా పడుతుంటాం. ప్లీజ్ యువర్ లార్డ్ షిప్స్ ప్లీజ్, దయచేసి ఆ విషయాన్ని మరోసారి పరిశీలించండి…ఇలా బతిమిలాడుతుంటాం. కేసులోని ముఖ్యమైన విషయాలు చెప్పేశాక అందరం చేసేది అదే. ఏదో ఒక రకంగా కాస్త దయ చూపించి ఆర్డర్ ఇవ్వండి అనేదే మా అభిమతం. కాని బాలగోపాల్ ఆ పని ఎప్పుడూ చేసేవాడు కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇవీ నిజాలు, ఇదీ చట్టం, ఇవీ జడ్జీలు గతంలో ఇచ్చిన తీర్పులు, ఇదీ ఈ విషయమై గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాలు; ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, నేను పోతున్నాను అన్నట్టు ఉండేది ఆయన వైఖరి. ఆయన వాదనకున్న బలం అది.
ఒక లాయర్ గా ఆయన సుగుణాలలో చెప్పాల్సింది ఇంకొకటుంది. కోర్టుల్లో చాలా పెత్తనం/అధికారం నడుస్తుంటుంది. జడ్జిలకు, లాయర్ లకే కాదు, అటెండర్ లకు కూడా చాలా పవర్ ఉంటుంది. నల్ల గౌన్లు వేసుకుని తిరగడాన్ని లాయర్లందరూ ఎంజాయ్ చేస్తుంటారు. హక్కుల కేసులు వాదించేటపుడు మేము కూడా కొంత పవర్ ను చూపిస్తుంటాం. ఉదాహరణకు ఒక మావోయిస్టు కేసులో అతన్ని చిత్రహింసలు పెట్టిన ఒక పోలీసతను క్రాస్ ఎగ్జామినేషన్ కోసం సెషన్స్ కోర్టుకు వచ్చాడనుకోండి లాయర్ల పవర్ అంతా పూర్తిగా బయటకు వస్తుంది. ఇప్పుడు నేను క్రాస్ ఎగ్జామిన్ చేసి అతన్ని బాగా ఏడిపించాలి, బోనులోనే అతను కన్నీళ్లు పెట్టుకోవాలి అని అనుకుంటాం. అంత కోపం ఉంటుంది వాళ్ళ మీద. వాళ్లకు శిక్ష పడేలా చేయలేకపోయినా కనీసం ఈ మాత్రం న్యాయమైనా జరగాలి కదా అనుకుంటాం. కాని బాలగోపాల్ ఆ పని ఎప్పుడూ చేసేవాడు కాదు. ప్రదర్శన, నాటకీయతలకు ఆయన చాలా దూరం. ఆయన సాక్షిని ఒక 10 ప్రశ్నలు అడిగి వదిలేస్తాడు. అతగాడిని వీలైనంత సిగ్గు పడేలా చేయాలన్న ఆలోచన ఆయనకు ఉండదు. ఆ వ్యక్తి పది మందిని చంపిన పోలీస్ ఆఫీసర్ అయ్యుండొచ్చు. పదిమందిని ఎన్ కౌంటర్ చేసిన వాడై ఉండొచ్చు, రేపిస్టు అయ్యుండొచ్చు, ఎవరైనా సరే సాక్షిని గౌరవించాలి అనేది ఆయన విశ్వాసం. తను అడగదలచుకున్న 10 ప్రశ్నలు అడిగేసి కూర్చుంటాడు. లాయర్లుగా మేము ఎంజాయ్ చేసే పవర్ ను ఆయన ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. పవర్ గేమ్ లో ఆయన ఎప్పుడూ లేడు, ఎన్నడూ భాగం కాలేదు.
లాయర్లకు ఇంకో పెద్ద కోరిక ఏముంటుందంటే ఎప్పటికైనా ఒక ఫుల్ బెంచ్ ముందు వాదించాలనేసి. ఒకసారి ఎన్ కౌంటర్ల మీద వాదనలు వినడానికి ఐదుగురు జడ్జిలతో కూడిన ఫుల్ బెంచ్ ఏర్పాటైంది. చాలామంది లాయర్లు వెళ్ళి దాని ముందు వాదించారు. ఎన్ కౌంటర్ అని చెప్పి కేసును మూసేయడానికి లేదని, అది నిజమైన ఎన్ కౌంటరా లేక బూటకపు ఎన్ కౌంటరా అని తేల్చడానికి ప్రతి ఎన్ కౌంటర్ మీదా FIR నమోదు చేయాలని, విచారణ జరపాలని ఒకరి తర్వాత ఒకరు వాదనలు వినిపించారు. ఐదుగురు హైకోర్టు జడ్జిలు, అందునా సీనియర్ జడ్జిలు ఈ కేసును వినడమనేది హక్కుల లాయర్లకు, కార్యకర్తలకు అందరికీ చరిత్రాత్మక దినం లాంటిది. నిస్సందేహంగా వారి వృత్తి జీవితాల్లో అవి చాలా గొప్ప క్షణాలు. లాయర్లు ఢిల్లీ నుండి వచ్చారు, చెన్నై నుండి వచ్చారు. హైదరాబాద్ లోని హక్కుల లాయర్లు అందరూ మాట్లాడారు. మరి బాలగోపాల్ ఏం చేశాడు? ఆయన వాదించలేదు. ఇంతమంది వాదించాక ఇంక వాదించడానికి ఏముంది అనుకున్నాడు. తన వాదనలను లిఖితపూర్వకంగా ఇచ్చి వెళ్ళిపోయాడు.
బాలగోపాల్ ఎన్ కౌంటర్ల గురించి దాదాపు 30 ఏళ్ళుగా మాట్లాడుతున్నాడు, అయినా ఫుల్ బెంచ్ ముందుకు వెళ్ళి మాట్లాడడం అవసరం అని అనుకోలేదు. “అందరూ తమ వాదనలు వినిపించారు కదా, నేను నా వాదనలను లిఖితపూర్వకంగా ఇస్తాను చాలు” అనుకున్నాడు. ఇది నా దృష్టిలో చాలా గొప్ప సుగుణం. దీన్ని ఎలా వివరించాలో నాకు తెలియడం లేదు, కాని పవర్ లో భాగం కాకపోవడం ఆయన్ని ఈ రోజుకీ మహోన్నత వ్యక్తిగా నిలబెట్టింది. కోర్టుల్లో ప్రదర్శన ఉంటుంది, పవర్ ఉంటుంది, కాని ఆయన అందులో భాగం కాకుండా ఉండిపోగలిగాడు. మౌఖికంగా వాదించకపోయినా తీర్పు ఇచ్చేటపుడు కోర్టు ఆయన లిఖిత వాదనలకు ప్రాముఖ్యం ఇచ్చింది. ప్రతి కేసునూ తనే వాదించాలని, అన్ని చోట్లా తనే కనిపించాలని ఆయనకు ఉండేది కాదు. అలాంటి వ్యక్తి కాదాయన.
ఆయన ఆఫీస్ గురించి చెప్పాలంటే, ఇక్కడ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఇంట్లోనే ఒక చిన్న గదిలో ఉండేది ఆయన ఆఫీస్. కారు, డ్రైవర్ లాంటి సౌకర్యాలేమీ లేవు. నాతో సహా ఇద్దరు, ముగ్గురు జూనియర్ లు ఉండేవారు కాని మా వల్ల ఆయనకు ఒరిగిందేమీ లేదు, మేము ఆయనకు పెద్దగా సహాయపడిందేమీ లేదు. ఆయనకు టైపిస్ట్ కూడా లేడు. ఆయన స్థాయి లాయర్ ఇంకెవరైనా, ఆయన ఫైల్ చేసే కేసుల సంఖ్యను బట్టి చూస్తే కనీసం ఇద్దరు టైపిస్టులను, ఒక అటెండర్ ను పెట్టుకునేవారు. కాని ఆయనకు ఎవరూ లేరు. వెస్పా స్కూటర్ మీద ఒక కోర్టు నుండి ఇంకొక కోర్టుకు తిరుగుతూ కోర్టు పనులు చూసుకునేవాడు. తనే అన్ని డాక్యుమెంట్ లూ టైప్ చేసుకునేవాడు. ఒక్క అఫిడవిట్ లను మాత్రమే కాదు, తెలుగులో ఉన్న అన్ని మెటీరియల్ పేపర్ లన్నీ కూడా తనే ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి టైప్ చేసుకునేవాడు. స్పష్టంగా కనిపించని పత్రాలన్నిటినీ మళ్ళీ టైప్ చేసి కోర్టుకు ఇవ్వాల్సి వచ్చేది. అవన్నీ కూడా ఆయనే టైప్ చేసుకునేవాడు. ఒకసారి నేను అడిగాను ఎందుకు అన్ని డాక్యుమెంట్లూ మీరే టైప్ చేసుకుంటారు అని. టైప్ చేస్తే విషయం బాగా గుర్తుంటుందని, విచారణ సమయంలో మెటీరియల్ పేపర్ లను మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం ఉండదని అన్నాడు. ఆయన నిజానికి టైప్ వచ్చినవాడు కూడా కాదు, రెండు వేళ్ళతో చేసేవాడు. ఒక రకంగా ఆయనది ఒంటి చేతితో నడిచిన ఆఫీస్, పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా నిశ్శబ్దంగా పని చేసుకుపోయిన ఆఫీస్. వీటన్నిటి కంటే కూడా ఇందాక చెప్పినట్లు కోర్టుకుండే పవర్ లో, చట్టానికుండే పవర్ లో భాగం కాకుండా ఆయన పని చేసుకుపోయిన పద్ధతి నాకు చాలా ఆదర్శప్రాయమైనది.
చివరిగా చట్టాన్ని ఆయన ఎలా అర్ధం చేసుకున్నారన్నది చూద్దాం. ఆయన చట్టానికి అమ్ముడుపోయాడనే విమర్శ ఒకటుందని మీకు తెలుసు. అయితే 8 ఏళ్ళుగా ఆయన ఫైల్స్ చదువుతున్న వ్యక్తిగా ఆ విమర్శతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఆయన ఎప్పుడూ అమ్ముడుపోలేదు. నిజం చెప్పాలంటే ఆయన చట్టం విషయంలో అత్యంత జాగరూకతతో ఉండేవాడు. చట్టానికి ఉండే పరిమితులు ఆయనకు తెలుసు, బాగా తెలుసు. ఆ విషయంలో ఆయన ఎప్పుడూ పొరబడలేదు. చట్టం నుండి ఏమి కోరాలనే విషయంలో ఆయనకు చాలా స్పష్టత ఉంది. చాలామంది లాయర్లకు అది ఉండదు. మా న్యాయవాదులు ప్రతి కేసులోనూ ప్రేయర్స్ (విన్నపాలు) అని ఒకటి తయారు చేస్తాం. దేవుడికి చేసే ప్రేయర్స్ కాదు, జడ్జిలకు నివేదించే ప్రేయర్స్ ఇవి. వీటిని ఎలా రాయాలో మాకు స్పష్టత ఉండాలి. చిన్న తప్పు దొర్లినా కేసు ఓడిపోతాం. ఈ విషయంలో బాలగోపాల్ కి ఉండే స్పష్టత చూస్తే ఆశ్చర్యపోతాం. చట్టం పరిమితులు తెలుసు కాబట్టి ఏ విషయాల్లో కేసు వేయాలి, ఏ విషయాల్లో వేయకూడదు అని ఆయనకు అవగాహన ఉండేది. ఎవరైనా కేసు వెయ్యాల్సిన తరుణం కంటే ముందే వేస్తే ఆయనకు చాలా చిరాకొచ్చేది. ఒకటి రెండు సార్లు ఆ చిరాకును నేను ప్రత్యక్షంగా చూశాను కూడా. ముఖ్యంగా ఆ సమస్యపై ఒక సామాజిక ఉద్యమం లేదా రాజకీయ ఉద్యమం జరుగుతుంటే దాని మీద కోర్టుకు వెళ్ళడం ఆయనకు ఏ మాత్రం ఇష్టముండేది కాదు. ఆయన తన రచనల్లో రాశారో లేదో నాకు తెలియదు గాని కోర్టు ఆర్డర్ ద్వారా పొందే దాని కన్నా రాజకీయ ఉద్యమం ద్వారా పొందగలిగేదే ఎక్కువని, అదే స్థిరంగా ఉంటుందని ఆయన తరచూ అనేవారు. చట్టం పట్ల ఎంతో వివేకంతో వ్యవహరించే వారాయన.
ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (PIL) విషయానికి వస్తే బాలగోపాల్ చాలా తక్కువ PIL కేసులే వేశారు. ఆయన కేసుల్లో అవే అన్నిటి కన్నా తక్కువ. అంటే ఆయనకు చట్టం పట్ల ఆ మెలకువ, ఆ జాగ్రత్త ఉండేది. ఇవ్వాళ ఆయన లేని లోటును నేను ఇంతగా అనుభవిస్తున్నానంటే అది ప్రధానంగా చట్టం గురించిన ఆయన వివేకాన్ని మిస్ అవడమే; ఆయన హెచ్చరికను మిస్ అవడమే. చట్టం కొన్నిసార్లు మనల్ని ఎటెటో తీసికెళ్ళి పోతుంటుంది. మనం అడిగిన దానికి పూర్తి భిన్నమైన ఫలితం వస్తుంటుంది. అది చాలా ప్రమాదకరం. మౌలికంగా చట్టం ఉన్నది శాంతి భద్రతలను కాపాడడానికే. అందువల్ల చట్టం ద్వారా న్యాయం పొందడానికి మనం ప్రయత్నించేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాలగోపాల్ కు ఆ వివేకం ఉంది. ఇవ్వాళ మనం మిస్ అవుతున్నది ఆ వివేకాన్నే.
ముగింపుగా ఒక మాట చెప్పాలి. ఈ ఉపన్యాసం ఇవ్వడానికి నిజానికి నేను కొంచెం భయపడ్డాను. నేను రోజూ ఆయన కేసులే చేస్తున్నప్పటికీ ఆయన గురించి మాట్లాడడం వేరే కదా! బ్యానర్ మీద బాలగోపాల్ ఫోటో పక్కన నా పేరు కనబడేసరికి చాలా కంగారు అనిపించింది. టెన్షన్ వచ్చేసింది. సామాన్యంగా మేము లాయర్లం ఇంకో లాయర్ గురించి లేదా జడ్జి గురించి మాట్లాడాల్సి వస్తే వారికి బాగా పేరు తెచ్చిన కేసుల గురించి, లా జర్నల్స్ లో రిపోర్ట్ అయిన వారి కేసుల గురించి; అంటే హై ప్రొఫైల్ కేసులు అంటారే అలాంటి వాటి గురించి మాట్లాడతాం. కాని బాలగోపాల్ విషయానికి వస్తే ఆయనకు అలాంటి కేసులు తక్కువే ఉన్నాయి. ఆయన కేసుల్లో ఎక్కువ భాగం ఒక ఎకరా 30 సెంట్ల ఆదివాసి రైతులవి లేదా 50 వేల రూపాయల బకాయిల కోసం కోర్టుకు వచ్చిన కార్మికులవి ఉంటాయి. బాలగోపాల్ స్థాయికి చేరుకున్న న్యాయవాదులెవరూ నిజానికి ఒక ఎకరా 30 సెంట్ల కేసులను తీసుకోరు. జూనియర్లకో, వేరే లాయర్లకో ఇచ్చేస్తారు. కాని ఆయన తన చివరి రోజు వరకు తన న్యాయశాస్త్ర పాండిత్యాన్ని ఆ ఎకరా 30 సెంట్ల వారి కోసం ఇస్తూనే వచ్చాడు. ఆయనలోని అత్యుత్తమ గుణం అది. మనందరం దాన్ని ఆయన నుండి నేర్చుకోవాలి.
ఇంకొక్క మాట. ఇక్కడున్న ఫోటోలో ఏ చొక్కా అయితే వేసుకున్నాడో అదే చొక్కాతో, అదే చిరునవ్వుతో ఆయన ఒకప్పుడు ఫిలిం మేకర్ దీపా ధనరాజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో – మొండితనం, మొండిపట్టుదల అనేవి వాటంతటవే సుగుణాలు కాదు కాని సామాజిక ఉద్యమాలలో పాల్గొనేటపుడు అవి చాలా ఉపయోగపడతాయని ఆన్నాడు. కోర్టుల విషయంలోనూ ఆయన చెప్పింది అక్షరాలా నిజం. ఎప్పటి కంటే ఎక్కువగా ఇవి ఇప్పుడు అవసరమవుతున్నాయి. లేకపోతే వాయిదాలలోనే న్యాయమంతా ఆవిరి అయ్యే ప్రమాదం ఉంది. బాలగోపాల్ చట్టాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదు. చట్టం విషయంలో చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండేవాడు. బాలగోపాల్ లాయర్ మాత్రమే కాదు, లా స్కాలర్ కూడా. ఆయన వాదనలు కోర్టుకే పరిమితం కాదు, కమిషన్ లకు సమర్పించే పత్రాలలో కూడా ఆయన చట్టానికి సంబంధించి అనేక విలువైన సూచనలు చేసేవారు. వెనకబడిన తరగతుల కమిషన్ కు ఇచ్చిన 10 పేజీల పత్రంలో ఇతర రాష్ట్రాలలో ఆ కమిషన్ లు ఎలాంటి విచారణ జరిపాయో, ఆ అంశం మీద సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పిందో ఆ విషయాలన్నీ చాలా వివరంగా రాశారు*.
మేము కూడా ఆయన లాంటి లాయర్లు కాగలిగితే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది. పవర్ లో భాగం కాకుండా ఉండే ఆయన లాంటి గుణాలున్న లాయర్లు మనకు మరెంతో మంది ఉంటే బాగుంటుంది కదా అని కూడా అనిపిస్తుంది. లా పవర్ లో భాగం కాకుండానే మంచి లాయర్ కావడానికి మనమంతా ప్రయత్నించాలి. శెలవ్.
(2017 లో వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లో ఇచ్చిన బాలగోపాల్ స్మారకోపన్యాసానికి తెలుగు అనువాదం. స్పష్టత కోసం అక్కడక్కడ కొద్దిగా ఎడిట్ చేశాం.)
*ఒక్క వెనకబడిన తరగతుల కమిషన్ కే కాక బాలగోపాల్ అనేక కమిషన్ లకు మెమొరాండంలు, సూచనలు ఇచ్చారు. ఎన్ కౌంటర్ల మీద, లాకప్ హత్యల మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ కు చాలా వివరమైన కంప్లైంట్స్ ఇచ్చారు. దళితుల, ఆదివాసుల సమస్యల పరిష్కారానికి ఏమి చెయ్యవచ్చో చెబుతూ పున్నయ్య కమిషన్ కు ఒక మెమొరాండం ఇచ్చారు. విశాఖ హెచ్.పి.సి.ఎల్ ప్రమాదం మీద వేసిన జైన్ కమిషన్ కు, సింగరేణి గని ప్రమాదం మీద వేసిన కమిషన్ కు, లా కమిషన్ కు, ప్లానింగ్ కమిషన్ కు , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన ల్యాండ్ కమిషన్ కు, విద్యుత్ రెగ్యులేటరీ బోర్డు లాంటి చాలా వాటికి ఆయన సూచనలు, నివేదికలు ఇచ్చారు. ఆ కమిషన్లు, కమిటీలు తమ నివేదికలు ఇచ్చిన తరువాత కూడా వాటి మంచిచెడ్డలను ప్రజల హక్కుల కోణం నుంచి పరిశీలిస్తూ, విమర్శిస్తూ వివరమైన వ్యాసాలు రాసారు. ఇవన్నీ మరో పుస్తకంగా వేస్తున్నాం. దాని పేరు ‘కమిషన్ నివేదికలు: సామాజిక న్యాయం’ – మానవ హక్కుల వేదిక.