రాజ్యం మతం కులం

మా మాట

బాలగోపాల్‌ ఎప్పుడో ఇచ్చిన ఒక ఉపన్యాసాన్ని ఏడాది క్రితం 64 పేజీల ఒక చిన్న పుస్తకంగా తీసుకొచ్చాం. దాని పేరు ‘కులాన్ని అర్ధం చేసుకోవడం ఎలా?’ ఇప్పటికే 2000 కాపీలు అమ్ముడయ్యాయి. నిజానికి అది ‘కులవ్యవస్థ – చారిత్రక భౌతికవాదం’ పేరుతో అప్పటికే youtubeలో ఉన్న ఉపన్యాసమే. అయినా దాన్ని పుస్తకరూపంలో చదవడానికి అంతమంది ఇష్టపడడం ఇప్పుడు ఈ రెండో పుస్తకానికి ప్రేరణ. ఇందులోని ఈ రెండు ఉపన్యాసాలు కూడా ‘భారతదేశంలో లౌకికవాదం అంటే కుల నిర్మూలనే’, ‘హిందూ మతతత్వం – భారత రాజకీయాలు’ అనే పేర్లతో youtube లో ఉన్నాయి, balagopal.org లోనూ ఉన్నాయి. వినడానికి ఉపన్యాసం ఎంత బాగున్నా లోతుగా అర్థం చేసుకోవడానికి, వివేచించుకోవడానికి పుస్తకాలే ఎక్కువ ఉపయోగకరమని భావించి ఇప్పుడు వీటిని కూడా transcribe చేసి, edit చేసి పుస్తక రూపంలో తీసుకొస్తున్నాం.

బాలగోపాల్‌ అన్ని వ్యాసాలు, ఉపన్యాసాలలోనూ ఆలోచనాత్మక విషయాలు అనేకం ఉండే మాట నిజమే కాని ఈ రెండూ మరో మెట్టు పైనున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మన దేశానికి సంబంధించినంత వరకు లౌకికవాదం అంటే ఏమిటో; రాజ్యానికి – మతానికి, రాజ్యానికి – కులానికి ఉండాల్సిన సంబంధం ఏమిటో eyeopener గా అనిపించే విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. మిగతా దేశాలలో లౌకికవాదానికి ఉన్న అర్థం వేరు, మన దేశంలో ఉన్న అర్థం వేరు. సెక్యులర్‌ అనే పదాన్ని ఇందిరాగాంధీ 1975 లో రాజ్యాంగంలో చేర్చాక మాత్రమే భారతదేశం లౌకిక దేశంగా మారిందనుకోవడం తప్పు అని, ఆ పదం లేకుండానే లౌకికవాద విలువల్ని అంబేద్కర్‌ రాజ్యాంగంలో ఏ ఏ ఆర్టికల్స్‌లో పొందుపరిచారో బాలగోపాల్‌ ఈ ఉపన్యాసాలలో సవివరంగా తెలియజేశారు. ఆ విధంగా అసలైన అర్థంలో లౌకికవాద భావన మన రాజ్యాంగంలోనే అంతర్భాగంగా ఉందని నిరూపించారు.

మన దేశంలో అసమాన సామాజిక వ్యవస్థను నిలబెడుతున్నది మతమేనని బాలగోపాల్‌ పదే పదే ఎన్నో ఉదాహరణలతో చెప్పారు. ప్రజా వనరులను కొల్లగట్టి కార్పొరేట్లకు అప్పగించే విషయంలో హిందుత్వం, సరళీకరణ భావజాలాలు ఎంత సమ జోడీలుగా వ్యవహరిస్తున్నాయో కూడా చెప్పారు. లౌకికవాదానికి బి.జె.పి ఒక్కటే కాదు శత్రువు, మనలోనూ ఉన్నారు చాలామంది శత్రువులు, నిజానికి వీరే ఎక్కువ ప్రమాదకారులంటారు ఆయన. ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా అది లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి ముప్పేనంటారు.

ఒకటికి రెండుసార్లు చదివి అర్ధం చేసుకోవాల్సిన, చర్చించాల్సిన వ్యాసాలివి.

మానవహక్కుల వేదిక

6 డిసెంబర్‌ 2024

Recent Posts/Updates